టీఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే.. మహిళలకు సముచిత గౌరవం
ABN, First Publish Date - 2022-03-06T04:43:19+05:30
మహిళలకు సముచిత గౌరవం ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, జెడ్పీఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, జెడ్పీఛైర్మన్ లింగాల కమల్‌రాజ్
ఖమ్మం కార్పొరేషన్, మార్చి5: మహిళలకు సముచిత గౌరవం ఇచ్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, జెడ్పీఛైర్మన్ లింగాల కమల్‌రాజ్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా జిల్లాలో మూడు రోజులపాటు నిర్వహించే మహిళాబంఽధు వేడుకలపై శనివారం జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో ప్రత్యేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారన్నారు. ఒంటరి మహిళలకు ఫించన్ దేశంలో కేవలం తెలంగాణాలోనే ఇస్తున్నారన్నారు. షాదీముబారక్, కళ్యాణలక్ష్మి పధకాలు మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతున్నాయన్నారు. గతంలో మహిళలు మంచినీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సివచ్చేదని, అలాగే వీధిపంపుల వద్ద ఘర్షణలు జరిగేవన్నారు. ప్రస్తుతం ప్రతి ఇంటికి నల్లా ఉండటంతో మహిళలు బయటకు వచ్చేపనిలేదన్నారు. మహిళలకోసం ఎన్నో సంక్షేమపధకాలు అమలు చేస్తున్నందుకు ముఖ్య మంత్రికి కృతజ్ఙతలు తెలుపుతూ మూడు రోజులపాటు మహిళాబంధు వేడుకలు నిర్వహిస్తామన్నారు.
భట్టిది అబద్దాల ప్రచారయాత్ర
సీఎల్పీనేత, మదిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క పీపుల్స్‌మార్చ్ పేరుతో చేపట్టింది అబద్ధాల ప్రచారయాత్ర అని జెడ్పీఛైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ విమర్శించారు. భట్టి పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఫించన్ రూ.2వేలు ఇచ్చి, చీప్‌లిక్కర్ రేటు పెంచారని భట్టి చెబుతున్నారని, పింఛన్‌కు చీప్‌లిక్కర్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్ల వివాహానికి వెంటనే రూ.లక్ష ఆర్ధికసాయం చేస్తుంటే, ఎప్పుడో 13 సంవత్సరాల తరువాత రూ.3లక్షలు వచ్చే బంగారుతల్లి పథకం గురించి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. రైతు బంధు కింద పెట్టుబడి సాయం ఇచ్చి, ఎరువులు, డీజిల్ ధరలు పెంచారని భట్టి తన పాదయాత్రలో చెబుతు న్నారని, ఆయా ధరలు పెంచేవిషయం కేంద్రప్రభుత్వ పరిధిలోదని భట్టికి తెలవదా? అని దుయ్యబట్టారు. ఈ సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య, రైతుబంధుసమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వేంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పగడాల నాగరాజు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చింతనిప్పు కృష్ణచైతన్య. మైనారిటీ విభాగం అధ్యక్షుడు తాజుద్దీన్, కార్పోరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T04:43:19+05:30 IST