మీకు ఎవరి పనితీరు నచ్చింది?
ABN, First Publish Date - 2022-03-05T05:37:04+05:30
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నిర్వహిస్తున్న సర్వేలో ఆసరా పింఛన్లు, రూ.లక్ష వ్యవసాయ రుణాల మాఫీ అంశాలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదు.
ఎమ్మెల్యేల పనితీరుపై పీకే టీ సర్వే
సర్వేలో ప్రస్తావన లేని ఆసరా పింఛన్లు, రుణమాఫీ అంశం!
వైరా, మార్చి 4: రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పనితీరుపై నిర్వహిస్తున్న సర్వేలో ఆసరా పింఛన్లు, రూ.లక్ష వ్యవసాయ రుణాల మాఫీ అంశాలకు సంబంధించిన ఎలాంటి ప్రస్తావన లేదు. ప్రశాంత్ కిషోర్(పీకే)కు చెందిన సర్వేగా ప్రచారం జరుగుతుంది. లీడ్‌టెక్ సాఫ్ట్‌వేర్‌లో ఈ సర్వే జరుగుతుంది. మొత్తం 21ప్రశ్నలతో కొన్ని రోజులుగా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 70పోలింగ్ స్టేషన్లను ఈ సర్వేకు ఎంపిక చేశారు. ఒక్కో పోలింగ్‌స్టేషన్ పరిధిలో 20మందితో ఉంచి ప్రభుత్వ పనితీరు, పథకాలు, టీఆర్‌ఎస్ నాయకులు, ఇతర పార్టీల నాయకులు, రాజకీయ పరిస్థితులపై సర్వే సిబ్బంది అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ప్రభావితం చేసే సమస్యల గురించి ప్రస్తావిస్తూ రోడ్లు, పరిశుభ్రత, డ్రింకింగ్ వాటర్, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ధరల పెరుగుదల, శాంతిభద్రతలు, నిరుద్యోగం, వ్యవసాయ పంపుసెట్లు, రైతు పంటలకు గిట్టుబాటు ధరల గురించి ప్రస్తావిస్తున్నారు.
ఈ సమస్యల్లో 57సంవత్సరాలు నిండిన వారికి ఆసరా పింఛన్లు అలాగే వితంతువులకు పింఛన్లు, 2018లో కేసీఆర్ ఇచ్చిన రూ.లక్ష వ్యవసాయ రుణాల మాఫీ వంటి వాటికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన లేదు. అలాగే ఏ ప్రజాప్రతినిధి పనితనం నచ్చిందో తెలపాలని ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎవరూ నచ్చలేదని అభిప్రాయాలు సేకరిస్తున్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తున్నారా అని ఆరా తీస్తున్నారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీకి ఓటు వేస్తారు, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇతరులు, బీఎస్పీ పార్టీలను ప్రస్తావిస్తున్నారు. అలాగే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి అయితే ఎమ్మెల్యే అవుతారని, ప్రస్తుత ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎమ్మెల్యే బాణోతు మదన్‌లాల్ పేర్లను టీఆర్‌ఎస్ నుంచి, బాణోతు బాలాజీ, రేష్మాబాయి వర్సా రాములు, మాజీ ఎమ్మెల్యే బాణోతు చంద్రావతి, భూక్యా వీరభద్రం, గుగులోతు విజయబాయిని ప్రస్తావించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి మద్దతు ఇస్తారంటూ టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, ఎంఐఎం ఇతరులు అంటూ అభిప్రాయాలు సేకరిస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరు నచ్చిందా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రపై మీ అభిప్రాయం, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పథకాలైన దళితబంధు, రైతుబంధు, కేసీఆర్ కిట్టు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, హరితహారం, ఆరోగ్యలక్ష్మీ, పింఛన్లలో ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభావితం చేసే రాష్ట్రస్థాయి సమస్య ఏదంటూ ప్రభుత్వ పథకాలు, కరెంట్, కులం, ప్రాంతం, అవినీతి, శాంతిభద్రతలు, నిరుద్యోగం, అభివృద్ధి, స్కాంలు వంటివి ఉన్నాయా అని అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ప్రధాని మోదీ పనితీరు నచ్చిందా, అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరిని చూసి ఓటు వేద్దామనుకుంటున్నారు అని మోదీ, కేసీఆర్, రాహుల్‌గాంధీ పేర్లను ప్రస్తావిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పేర్లను ప్రస్తావిస్తున్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఎంగా ఎవరిని చూద్ధామనుకుంటున్నారు అని కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పేర్లను, బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపుడి అరవింద్, కిషన్‌రెడ్డి, రాజాసింగ్, రఘునందన్‌రావు పేర్లను, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్లను ప్రస్తావిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల సంక్షేమానికి ఏపని చేస్తే బాగుంటుంది, మీ నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ప్రముఖ వ్యక్తులపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈవిధంగా సర్వే కొనసాగుతుంది.
Updated Date - 2022-03-05T05:37:04+05:30 IST