బదిలీని ఆపిన బలశాలి ఎవరు?
ABN, First Publish Date - 2022-02-16T05:14:14+05:30
వైరా మునిసిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే మాటను కూడా పక్కన పెట్టి బదిలీని నిలిపివేసిన అదృశ్య వ్యక్తి ఎవరనేదానిపై చ
తన ట్రాన్సఫర్ హోల్డ్‌లో ఉందంటున్న వెంకటస్వామి
అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా వైరా మునిసిపల్ వ్యవహారం
ఎమ్మెల్యేకు సవాల్‌గా మారిన అంశం
వైరా, ఫిబ్రవరి 15 : వైరా మునిసిపల్ కమిషనర్ బదిలీ వ్యవహారం అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే మాటను కూడా పక్కన పెట్టి బదిలీని నిలిపివేసిన అదృశ్య వ్యక్తి ఎవరనేదానిపై చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైరా మునిసిపల్ కమిషనర్‌ని తానేనని ఎన. వెంకటస్వామి స్పష్టం చేశారు. తాను వైరా నుంచి రిలీవ్ కాలేదని, అలాగని తన బదిలీ ఆగలేదని, ప్రస్తుతం తన ట్రాన్సఫర్ హోల్డ్‌లో పెట్టి వైరా కమిషనర్‌గానే కొనసాగాలని బదిలీ చేసిన సీడీఎంఏ ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. కౌన్సిలర్లు చేసిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ స్పందించి కమిషనర్‌ను బదిలీ చేయాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో శనివారం అర్ధరాత్రి కమిషనర్ బదిలీ అయ్యారు. సోమవారం తనకు పోస్టింగ్ ఇచ్చిన మణుగూరు వెళ్లి మందస్తు సమాచారం లేకుండానే కమిషనర్‌గా వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించడం, ఆ సమాచారాన్ని అధికారులు కలెక్టర్‌కు చేరవేయటం వెనువెంటనే జరిగాయి. అయితే మణుగూరులో ఏడాదిగా కమిషనర్ బాధ్యతల్లో ఉన్న నాగప్రసాద్ కలెక్టర్ ఆదేశాలు లేనిదే తాను బాధ్యతలు అప్పగించబోనని వెంకటస్వామికి స్పష్టంచేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి వివాదస్పదమైంది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసి తాత్కాలిక కమిషనర్‌గా కార్యాలయ ఉద్యోగి మాధవికి ఇనచార్జ్ బాధ్యతలు ఇచ్చేలా ఆదేశించారు. ఆ వెంటనే వెంకటస్వామి వైరా వచ్చి ఆ తర్వాత ఖమ్మం వెళ్లి వైరాలో కొనసాగే విధంగా ఆదేశాలు తెచ్చుకున్నారు.
అవకతవకలు నిరూపిస్తే బాధ్యత వహిస్తా: కమిషనర్ వెంకటస్వామి
మంగళవారం వైరా మునిసిపల్ కార్యాలయంలో వెంకటస్వామి పలువురు విలేకరులతో మాట్లాడారు. తాను అవతవకలకు పాల్పడి ఉంటే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న బాధ్యత వహిస్తా అన్నారు. రింగ్ రోడ్డులో కూర్చుంటానని, తాను తీసుకున్న డబ్బులు, అవతవకలను నిరూపిస్తే బాధ్యత వహిస్తానని, కలెక్టర్‌తో ఎంక్వయిరీ చేయించవచ్చని అన్నారు. అధికారులు, కౌన్సిలర్ల సమన్వయంతో మునిసిపల్ చైర్మన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని, అయితే ఇక్కడ ఎలా జరుగుతుందో మీకే తెలియాలని అన్నారు. తాను మళ్లీ విధుల్లో చేరానని, బాధ్యతలు చేపట్టేందుకు మణుగూరు వెళ్లగా తనకు బదిలీ ఉత్తర్వులు ఇచ్చిన సీడీఎంఏ నుంచి వైరాలోనే కొనసాగాలని ఆదేశాలు ఇచ్చారని స్పష్టం చేశారు. తాను ఇంతవరకు వైరాలో కమిషనర్‌గా రిలీవ్ కాలేదని, బాధ్యతల్లోనే ఉన్నానని వెంకటస్వామి పేర్కొన్నారు. వైరాలో రిలీవ్ కాకుండానే మణుగూరులో బాధ్యతలు ఎలా చేపట్టారని ప్రశ్నించగా.. తాను వైరాలో రిలీవ్ కాలేదని, మళ్లీ బాధ్యతల్లోకి వచ్చానని అన్నారు. వైరాలో అభివృద్ధి సగంలో వదిలేస్తే ఎలా? నీ పని నువ్వు చేసుకో అని వైరాలో కమిషనర్‌గా కొనసాగేందుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
అధికార పార్టీలో కాక
వైరా మునిసిప్ కమిషనర్ ఎన. వెంకటస్వామి బదిలీ నిలిపివేత వ్యవహారం అధికార పార్టీలో అగ్గి రాజేసింది. మున్సిపల్ కౌన్సిలర్లు ఫిర్యాదుతో కమిషనర్‌ను ఒక తాత్కాలిక ఉద్యోగిని తొలగించాలని స్వయంగా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కలెక్టర్‌కు పురపాలకశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో తాత్కాలిక ఉద్యోగిని తొలగించి కమిషనర్‌ను మణుగూరుకు బదిలీ చేశారు. వెంకటస్వామి మణుగూరులో బాధ్యతలు చేపట్టేందుకు వెళ్లగా అక్కడ విధుల్లో ఉన్న కమిషనర్ రిలీవ్ కావడానికి అభ్యంతరం చెప్పడంతో అది కాస్తా వివాదాస్పదం కావడం తెలిసిందే. అయితే వెంకటస్వామిని కమిషనర్‌గా తిరిగి వైరాలో విధుల్లోకి చేరేలా పాలకవర్గంలోని ఒకరిద్దరు తమకు సన్నిహితుడైనా టీఆర్‌ఎస్ నేతలతో చక్రం తిప్పారని జోరుగా చర్చ నడుస్తోంది. ఈ విషయం ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన 14 మంది కౌన్సిలర్లకు మింగుడు పడడం లేదు. బదిలీ ఆగడం వెనుక టీఆర్‌ఎస్ లోని ఓ బలమైన నాయకుడు కీలకంగా వ్యవహరించారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారం ఎమ్మెల్యేకు ఓ సవాల్‌గా మారిందనే వ్యాఖ్యాలు వినిపిస్తున్నాయి.
బదిలీ సంగతి నాకొదిలేయండి: కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాములు నాయక్
వైరా మునిసిపల్ కమిషనర్ ఎన. వెంకటస్వామి బదిలీ వ్యవహారం తనకు వదిలేయండని ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కౌన్సిలర్లకు తెలిపారు. మణుగూరు మునిసిపల్ కమిషనర్‌గా బదిలీ అయిన 24 గంటల్లోనే తిరిగి వైరా మునిసిపల్ కమిషనర్‌గా వచ్చిన వెంకటస్వామి విషయాన్ని మంగళవారం కొంత మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు రోజుల పాటు అందరూ మౌనంగా ఉండాలని కమిషనర్ బదిలీ విషయం తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.
Updated Date - 2022-02-16T05:14:14+05:30 IST