యుద్ధం అంటే ముందు నమ్మలేదు..
ABN, First Publish Date - 2022-03-06T04:47:26+05:30
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో స్వదేశానికి తిరిగొచ్చిన మరో విద్యార్థి శనివారం తన స్వగ్రామమైన మధిర మండలం ఖాజీపురానికి చేరుకున్నాడు.
నిజమేనని తెలియగానే భయమేసింది..
ముందుగా బుక్‌చేసుకున్న విమానం రద్దైంది
యూనివర్సిటీవారు రుమేనియా సరిహద్దుకు చేర్చారు
అక్కడినుంచి సీ-17 మిలటరీ విమానంలో ఢిల్లీకి చేరుకున్నా
ఉక్రెయిన్ నుంచి క్షేమంగా ఇంటికి చేరుకున్న మధిర మండలం ఖాజీపురం విద్యార్థి నాసిర్
మధిర రూరల్ మార్చి 5: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో స్వదేశానికి తిరిగొచ్చిన మరో విద్యార్థి శనివారం తన స్వగ్రామమైన మధిర మండలం ఖాజీపురానికి చేరుకున్నాడు. గ్రామానికి చెందిన మహమ్మద్‌గౌస్, బస్త్రీల కుమారుడైన మహమ్మద్‌నాసిర్ హుస్సేన్ ఉక్రేయిన్‌లోని వినిస్టియా పట్టణంలో వినిస్టా మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. యుద్దం నేపథ్యంలో నాసిర్ శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు. స్వగ్రామానికి చేరుకున్న నాసీర్‌ను కుటుంబ సభ్యులు, దగ్గర బంధువులు అక్కున చేర్చుకుని స్వాగతం పలికారు. యద్దం భయాందోళనల నేపధ్యంలో ఉక్రేయిన్‌లో ఉన్న తమ కుమారుడు క్షేమంగా ఇంటికి రావడంతో తల్లితండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఇండియన్ ఎంబసీ సహయంతో క్షేమంగా ఇంటికి చేరుకున్న నాసిర్ తన అనుభవాలను ‘ఆంధ్రజ్యోతి’కి తెలియజేశాడు. తాను ఎంబీబీఎస్ చదివేందుకు 2021 డిసెంబర్ 9న ఉక్రేయిన్ దేశం వెళ్లానని తెలిపాడు. ఉక్రెయిన్‌లో ఉండగా రష్యాతో యుద్ధం అనే మాటలు వినిపించినప్పుడు ముందుగా తాను నమ్మలేదని అయితే ఆ తరువాత భయం వేసిందని నాసిర్ తెలిపాడు. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు తెలియగానే తను వెంటనే ఇంటికి ఫోన్ చేశాననని, కుటుంబ సభ్యులు వెంటనే బయలుదేరి ఇంటికి రమ్మని చెప్పడంతో ఫిబ్రవరి 23న క్యూసిటీ నుంచి హైదరాబాద్‌కు వచ్చేందుకు విమాన టికెట్‌ను బుక్ చేయించుకున్నానని తెలిపాడు. అయితే 24వ తేదీన రష్యా ఉక్రేయిన్‌పై బాంబు దాడులు చేయడంతో విమానాలను రద్దు చేశారని తెలిపాడు. తిరిగి 26వ తేదీ సాయంత్రం యూనివర్సిటీ వారు బస్సులు ఏర్పాటు చేసి తమను రుమేనియా బోర్డర్‌కు తరలించారని తెలిపాడు. అక్కడ ఒక్క రోజు ఉన్నానని, ఆ తరువాత ఇండియన్ ఎంబసీవారు తమను రుమేనియా రాజధాని భుచాస్టర్ ఏయిర్‌పోర్టుకు తీసుకెళ్లి అక్కడ నుంచి సీ-17మిలటరీ విమానంలో తమను మార్చి 4వ తేదీ ఉదయం ఏడు గంటలకు ఢిల్లీకి తీసుకొచ్చారన్నాడు. అక్కడకు చేరుకోగానే తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు తమను తెలంగాణ భవన్‌కు తీసుకెళ్లారున్నాడు. ఢిల్లీనుంచి శనివారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నానని, తీవ్ర భయాందోళన నేపధ్యంలో క్షేమంగా ఇంటికి చేరుకోవాడంతో ఎంతో ఆనందంగా ఉందని నాసిర్ తెలిపాడు. తనకు సహాయ సహకారాలు అందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపాడు.
Updated Date - 2022-03-06T04:47:26+05:30 IST