కలుషిత ఆహారంతో ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థత
ABN, First Publish Date - 2022-11-15T00:06:44+05:30
కలుషిత ఆహారం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం జిల్లాపరిషత్ పాఠశాలో జరిగింది.
పోకలగూడెం జడ్పీఎస్‌లో మధ్యాహ్న భోజనానంతరం ఘటన
చండ్రుగొండ ఆసుపత్రిలో చికిత్స
చండ్రుగొండ, నవంబరు 14: కలుషిత ఆహారం తిని ఇరవై మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన సోమవారం భద్రాద్రికొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల పరిధిలోని పోకలగూడెం జిల్లాపరిషత్ పాఠశాలో జరిగింది. కలుషిత ఆహారం తినటం వల్లే దగ్గు, కడుపులో తిప్పటం, గొంతులో మంట తదితర లక్షణాలతో విద్యార్థులు బాధపడుతున్నారని స్థానిక వైదుడు వెంకటప్రకాష్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై పాఠశాల పీఈటీ యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం. మధ్యాహ్న భోజనం ముగిసిన అనంతరం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించామన్నారు. అనంతరం బహుమతులు అందచేస్తుండగా ఒక్కసారిగా విద్యార్థులు దగ్గటం ప్రారంభించారు. దీంతో పాటు కడుపులో తిప్పటం, గొంతులో మంట ఉందని విద్యార్థులు ఏడుస్తుండటంతో ప్రధానోపాధాయుడు ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇచ్చారు. డాక్టర్ వెంకట ప్రకాష్ పాఠశాలకు చేరుకొని విద్యార్థులను పరీక్షించిన అనంతరం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థులు కరుణ, అనురాధ, నందిని, వర్షా, సిద్దార్థ, విష్ణు, ఉదయకుమార్‌తో పాటు మరో 13మందికి చికిత్స అందిస్తున్నామని, అందరి ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక నాయకులు అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుకు సమాచారం ఇవ్వటంతో ఆయన వైద్యులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైతే కొత్తగూడెం తరలించాలని సూచించారు.
ఆసుపత్రిని సందర్శించిన డీఎంహెచ్‌వో
విద్యార్థులు అస్వస్థతకు గురైయిన సమాచారం తెలుసుకున్న డీఎంహెచ్‌వో దయానంద స్వామి చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. వైద్య సేవల వివరాలను డాక్టర్ వెంకట ప్రకా్‌షను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులకు ఎటువంటి అపాయం లేదని విద్యార్ధుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని ఆదేశించారు.
Updated Date - 2022-11-15T00:06:48+05:30 IST