గతమే ఘనం!
ABN, First Publish Date - 2022-10-08T05:09:29+05:30
గతమే ఘనం!
సమస్యల సుడిలో కొత్తగూడెం మైనింగ్ కళాశాల
విద్యాసంస్థ నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ
ఇష్టానుసారంగా విధులకు అధ్యాపకులు
హాస్టళ్లల్లో పరిమితికి మించి విద్యార్థులకు వసతి
ప్రాభవం కోల్పోతున్న ప్రతిష్టాత్మక కళాశాల
ఉమ్మడి రాష్ట్ర సమయంలో ఎంతో పేరున్న కొత్తగూడెం మైనింగ్ ఇంజనీరింగ్ నేడు ఆలనా పాలనా కరువై ప్రాభవాన్ని కోల్పోతోంది. కాలేజీ నిర్వహణపై కొరవడిన పర్యవేక్షణ, విద్యార్థులకు చాలీచాలని వసతులు, బోధనకు అవసరమైన ల్యాబ్‌లలో సౌకర్యలేమి, సక్రమంగా కాలేజీకి రాని అధ్యాపకులు, విలువైన కళాశాల భూముల ఆక్రమణతో నేడు కాలేజీ ప్రతిష్ట మసకబారుతోంది.
కొత్తగూడెం కలెక్టరేట్, అక్టోబరు 7: మైనింగ్ విశ్వవిద్యాలయంగా మారుతుందని భావించిన కళాశాల నేడు అరకొర వసతులతో కునారిల్లుతోంది. ఈ కాలేజీలో మొత్తం ఐదు బ్రాంచలలో సుమారు 927మంది విద్యను అభ్యసిస్తున్నారు. మొత్తం 24మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. రెగ్యులర్ అధ్యాపకుల్లో ముగ్గురు డిప్యూటేషనపై ఇతర కాలేజీకి వెళ్లారు. కాలేజీ హాస్టల్ నిర్వహణ లోపంతో సమస్యల వలయంలో చిక్కుకుంది. గదుల సామర్థ్యానికి మించి విద్యార్థులను ఉంచుతున్నారు. బాలిక వసతి గృహంలో 140మందికి మాత్రమే అవకాశం ఉండగా ప్రస్తుతం 280మంది, బాలుర హాస్టల్లో 160మందికి 300మంది ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్టల్లో ఉండలేని కొందరు బయట రూంలు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇదిలా ఉండగా సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం ఈ కళాశాలకు చెందిన స్థలాన్ని కేటాయించిన సమయంలో 140మంది విద్యార్థులు నివాసం ఉండే హాస్టల్‌ను కూల్చి వేశారు. దానికి బదులు కొత్త భవనం నిర్మించి ఇస్తామన్నారు. కానీ ఐదేళ్లయినా ఆ కొత్తభవనం ఊసే లేకుండా పోయింది. ఇక కాలేజీలో సరైన ల్యాబ్‌లు లేకపోవడంతో బోధన కుంటుపడుతోంది. ఇక విద్యార్థులు ఆడుకోవడానికి, వ్యాయామం చేయడానికి అనువైన క్రీడామైదానాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అడ్ర్‌సలేని బయోమెట్రిక్ విధానం
ఉద్యోగులు క్రమశిక్షణగా విధులు నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానం మైనింగ్ కాలేజీలో అమలు చేయడం లేదు. బయోమెట్రిక్ పరికరాలున్నా వాటిని ఉపయోగించకుండా బీరువాల్లో భద్రపరిచారు. దాంతో అధ్యాపకులు తమ ఇష్టానుసారంగా విధులకు హాజరవుతున్నారు. 2007-2008సంవత్సరంలో అప్పటి ఇనచార్జ్ వైస్‌చాన్సలర్ జనార్దనరెడ్డి కాలేజీ పర్యవేక్షణ సమయంలో బయోమెట్రిక్ లేదని గుర్తించి తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో 15 బయోమెట్రిక్ పరికరాలను కొనుగోలు చేశారు. కొంతకాలం వాటిని ఉపయోగించిన తరువాత వాటిని తీసి బీరువాల్లో భద్రపరిచారు. ఇప్పటికే ఆ కాలేజీ అధ్యాపకులు తమ సెలవుల కన్నా ఎక్కువగా అత్యవసర సెలవులను వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్ వాడకపోవడం ఆ ఆరోపణను బలపరుస్తున్నాయి.
ప్రిన్సిపాల్ ఏమంటున్నారంటే..
కళాశాలలో బయోమెట్రిక్ అమలు చేయాలంటే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి అనుమతి రావాలని కళాశాల ప్రిన్సిపాల్ పున్నం చందర్ తెలిపారు. యూనివర్సిటీ అనుమతి లేకపోవడంతో బయోమెట్రిక్ అమలు చేయడంలేదు. అధ్యాపకులు తమ సెలవుల కన్నా ఎక్కువగా అత్యవసర సెలవుల పేరుతో కాలేజీకి డుమ్మా కొడుతున్న మాట వాస్తవమేన్నారు. అటువంటి వారిని మార్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కలెక్టరేట్ భవన నిర్మాణ సమయంలో ఆర్అండ్బీ శాఖ అధికారులు కూల్చిన హాస్టల్ భవనం స్థానంలో కొత్త భవన నిర్మాణంపై ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Updated Date - 2022-10-08T05:09:29+05:30 IST