నేదునూరి.. సంగీత కళానిధి
ABN, First Publish Date - 2022-12-07T23:52:54+05:30
భద్రాద్రి రాముడంటే ఆయనకు మక్కువ ఎక్కువ. రామదాసు అంటే అమితమైన ప్రీతి. ఇవే ఆయనను రాముడి సేవ వైపు నడిపించాయి. అలా ఆయన ఎన్నో ఏళ్లగా రాముడికి స్వర నిరాజనం అర్పించారు. భక్తులను ఆనందసాగరంలో ఓలలాడించారు సంగీత కళానిధిగా పేరు గాంచారు. ఆయనే నేదునూరి కృష్ణమూర్తి. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
భద్రాచలం, డిసెంబరు 7: భద్రాద్రి రాముడంటే ఆయనకు మక్కువ ఎక్కువ. రామదాసు అంటే అమితమైన ప్రీతి. ఇవే ఆయనను రాముడి సేవ వైపు నడిపించాయి. అలా ఆయన ఎన్నో ఏళ్లగా రాముడికి స్వర నిరాజనం అర్పించారు. భక్తులను ఆనందసాగరంలో ఓలలాడించారు సంగీత కళానిధిగా పేరు గాంచారు. ఆయనే నేదునూరి కృష్ణమూర్తి. గురువారం ఆయన వర్ధంతి సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
భద్రాద్రితో విడదీయరాని బంధం
నేదునూరి కృష్ణమూర్తికి భద్రాద్రితో అనుబంధం విడదీయరానిది. రాముడన్నా, రామదాసన్నా, తూమునరసింహాదాసన్నా ఎంతగానో పరవశించేవారు. వారిపై తనకున్న భక్తిని చాటుకునేవారు. ఏకంగా భక్తరామదాసు నవరత్న కీర్తనలను తన శిష్యులతో కలిసి రూపొందించారు. తన రామయ్య సన్నిధిలోనే ఆవిష్కరించారు. భక్తరామదాసు వాగ్గేయకారోత్సవాల్లో పాల్గొని స్వయంగా తన శిష్య బృందంతో గానం చేసి తన భక్తిని చాటుకున్నారు. భద్రాద్రి ప్రాభవానికి తన వంతు చేయూతనిచ్చిన నేదునూరి ఏడేళ్ళుగా ప్రతి ఏటా భద్రాద్రి దేవస్ధానం, శ్రీ చక్రా సిమెంట్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భక్తరామదాసు జయంతోత్సవాల్లో పాల్గొన్నారు. ఐదు దశాబ్ధాలుగా తన వద్ద శిష్యరికం చేసిన వారిని వాగ్గేయకారోత్సవాలకు రప్పించి వారితో తానుసైతం కలిసి అజరామరమైన కీర్తనలను ఆలపించారు. 2014 డిసెంబరు 8వ తేదీన ఆయన అనారోగ్యంతో మరలిరాని లోకాలకు తరలివెళ్లారు. వయోభారాన్ని సైతం లెక్క చేయకుండా ప్రతి ఏటా భక్తరామదాసు జయంతి ప్రయుక్త వాగ్గేయకారోత్సవాల్లో పాల్గొని అన్నమయ్య రామదాసు కీర్తనలు ఆలపించేవారు.
శిష్యులు కూడా ఆయన బాటలోనే..
ఆయన ప్రియ శిష్యులుగా పేరొందిన మల్లాది సోదరులు, శ్రీనిధితో కలిసి నవరత్న కీర్తనలను ఆలపించేవారు. నేదునూరి కృష్ణమూర్తి శిష్యుల్లో ఒకరైన జి బాలకృష్ణప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్ధానానికి చెందిన అన్నమాచార్య ట్రస్టులో కీలక భాద్యతలు నిర్వహించారు. అన్నమాచార్య కీర్తనలకు బహుళ ప్రాచుర్యం తేవడంలో మరువలేనిది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా సంగీత కళానిధి అవార్డును నేదునూరి కృష్ణమూర్తి అందుకున్నారు.అలాగే కేంద్ర ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ అవార్డు సైతం ఆయనకు ప్రభుత్వం అందజేసింది. అంతే కాదు అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ర్టేలియా, కెనడ, సింగపూర్ తదితర దేశాల్లో ఆయన 40 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు.
Updated Date - 2022-12-07T23:52:56+05:30 IST