ప్ర‘జల’కష్టాలు
ABN, First Publish Date - 2022-12-31T22:47:34+05:30
మిషన్ భగీరథ పనులు సత్తుపల్లి పట్టణ ప్రజల పాలిట శాపంగా మారాయి. కాంట్రాక్టర్ వేళాపాళా లేకుండా పనులు చేస్తుండటం, ఇష్టానుసారంగా రోడ్లను తవ్వుకుంటూ పోతుండటంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు.
సత్తుపల్లిరూరల్, డిసెంబరు 31: మిషన్ భగీరథ పనులు సత్తుపల్లి పట్టణ ప్రజల పాలిట శాపంగా మారాయి. కాంట్రాక్టర్ వేళాపాళా లేకుండా పనులు చేస్తుండటం, ఇష్టానుసారంగా రోడ్లను తవ్వుకుంటూ పోతుండటంతో ప్రజలకు తాగునీరు అందడం లేదు. అస్తవ్యస్తంగా రోడ్లను తవ్వుతుండటంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పట్టణ పరిధిలోని మాధురి ఫంక్షన్ హాల్ వద్ద మిషన్ భగీరథ మెయిన్ పైప్‌లైన్ పాడవ్వడంతో సుమారు 50 గంటల పాటు గురు, శుక్రవారాల్లో పట్టణంలోని సగభాగం ప్రజలు తాగునీరు లేక అల్లాడిపోయారు. పైప్‌లైన్‌కు మరమ్మతులు చేయడం ఆలస్యం కావడం, పది రోజుల నుంచి నూతనంగా చేపట్టిన మిషన్ భగీరథ పైపులైన్ల పనులు సాగకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దీంతో వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు తాగునీటిని అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మితిమీరిన వేగం.. పనులతో ప్రమాదాలు
సత్తుపల్లి పట్టణంలోని అసలే కుచించుకుపోయిన జాతీయ రహదారిపై ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి. ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాటు వాహనాల మితిమీరిన వేగంతో ప్రజలు భయంతో రోడ్డెక్కాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మిషన్ భగీరథ పనులు నాసిరకంగా, నత్తనకడతో సాగడంతో ప్రజలు నరకం చూస్తున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతాం
కే.సుజాత, మునిసిపల్ కమిషనర్
మిషన్ భగీరథ పనుల్లో భాగంగా పైపులైన్ నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించాం. తాగునీరు ప్రజలకు అందలేదనే విషయం వాస్తవవమే. మెయిన్ లైన్‌కు మరమ్మతులు చేపట్టి తాగునీటిని ప్రజలకు శనివారం నుంచి అందిస్తున్నాం.
Updated Date - 2022-12-31T22:47:36+05:30 IST