మాను.. ప్రాణాలేం కాను?
ABN, First Publish Date - 2022-12-16T23:34:00+05:30
రహదారి వెంట ఉన్న వృక్షాలు ఎండి ప్రమాదకరంగా మారాయి.
ముదిగొండ, డిసెంబరు 16: రహదారి వెంట ఉన్న వృక్షాలు ఎండి ప్రమాదకరంగా మారాయి. ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు కొన్ని ఎండిపోయి ప్రమాదకరంగా మారాయి. మరికొన్ని చెట్లు మానులుగా మారి రహదారిపై కొమ్మలు విరిగపడుతుం డటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గాలిదుమ్ముల సమయంలో రహదారిపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడింది. కొన్ని సంవత్సరాల క్రితం రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలు ఇప్పుడు అవికాస్తా మహావృక్షాలుగా ఎదిగాయి. కాలక్రమేణా అవి ఎండిపోయి మానులుగా మారాయి. దీంతో ఆ మానుల కొమ్మలు గాలిదుమ్ములకు విరిగి రహదారిపై పడుతుండటంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారి వెంట ఎండిపోయిన కొమ్మలు విరిగిపడటంతో పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని సంద ర్భాల్లో కొమ్మలు విరిగి విద్యుత్ తీగెలపై పడటంతో ప్రమాదాలు జరిగిన సంఘటనలు కోకొల్లలు. నిత్యం ముదిగొండ పారిశ్రామిక ప్రాంతంలో వేలాదిమంది కార్మికులు రహదారికి ఇరువైపులా ప్రయాణిస్తుంటారు. ఎప్పుడు చెట్ల కొమ్మలు విరిగిపడతాయోనని భయంభయంగా కార్మికులు రాకపోకలు సాగిస్తున్నారు.
మానులను తొలగించాలి
కమర్తపు ఉమన్, గ్రానైట్ పరిశ్రమ యజమాని
ఖమ్మం నుంచి ముదిగొండ వరకు రహదారికి ఇరువైపులా ఎండిపోయిన చెట్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని అధికారులు తొలగించాలి. ఆ కొమ్మలు విరిగిపడి తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. కొమ్మలు విరిగిపడి కార్మికులు గాయపడిన సంఘటనలు కోకొల్లలు. వచ్చేది ఎండాకాలం కాబట్టి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా వాటిని తొలగించాలి.
Updated Date - 2022-12-16T23:34:01+05:30 IST