‘పోడు’ మాట మరిచిన కేసీఆర్
ABN, First Publish Date - 2022-04-21T06:47:04+05:30
‘పోడు’ మాట మరిచిన కేసీఆర్
‘ప్రజాప్రస్థానం’లో వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల
పాల్వంచ మండలం కరకవాగులో ‘రైతుగోస’ దీక్ష
800కిలోమీటర్లు పూర్తయిన పాదయాత్ర
పాల్వంచ రూరల్, ఏప్రిల్ 20: తానే స్వయంగా కుర్చీ వేసుకుని కూర్చొని పోడుభూములకు పట్టాలిస్తానని గత ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ సీఎం అయ్యాక ఆ పెద్ద పనిషి ఆ మాట మరిచిపోయాడని, ఇంతవరకు పోడు సమస్యలను ఎందుకు పరిష్కరించలేదని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 61వ రోజైన బుధవారం భద్రాద్రి జిల్లాలో మొత్తం 14.5కిలోమీటర్లు కొనసాగింది. లక్ష్మీదేవిపల్లిలో ప్రారంభమై ఉయ్యాలబాడవ, జోగ్యాతండా, గేట్‌తండా మీదుగా కరకవాగు వరకు చేరుకోగా.. అక్కడ చేపట్టిన రైతుగోస దీక్షలో షర్మిల మాట్లాడారు. వైఎ్‌సఆర్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే లక్షా90వేల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారని, ఆయన తరువాత వచ్చిన ఏ సీఎం ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేకపోయారన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల కోసం 100 సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. పోడుభూముల పోరాటంలో చనిపోయిన ఆదివాసీలకు వైఎ్‌సఆర్ బిడ్డగా నివాళులర్పిస్తున్నానన్నారు. అధికార పార్టీ నాయకులు తమ రక్షణ కోసం పోలీసులను పనోళ్లుగా వాడుకుంటున్నారన్నారు. ప్రతిపక్షాలు సైతం పాలకపక్షానికి తొత్తులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత 5గంటలకు సూరారం చేరుకున్న క్రమంలో షర్మిల పాదయాత్ర 800కిలోమీటర్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా అక్కడ వైఎ్‌సఅర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రజలతో మాటముచ్చట కార్యక్రమం నిర్వహించారు. తవిశలగూడెం మీదుగా పాండురంగాపురం చేరుకున్నారు.
నేటి పాదయాత్ర ఇలా..
బుధవారం పాల్వంచ మండలం పాండరంగాపురంలో బస చేసిన షర్మిల గురువారం చిన్నగుట్ట గ్రామం వద్ద బూర్గంపాడు మండలంలోకి ప్రవేశిస్తారు. ఒడ్డుగూడెం, పినపాక క్రాస్‌రోడ్, ఉప్పుసాక, టేకులచెరువు, నకిరిపేట, గుట్ట లక్ష్మీపురం గ్రామాల మీదుగా ముసలిమడుగు గ్రామానికి చేరుకుని రాత్రి బస చేస్తారు. అయితే లక్ష్మీపురంలో మాటముచ్చట నిర్వహిస్తారు.
Updated Date - 2022-04-21T06:47:04+05:30 IST