ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీ దందా.. కొత్త పంథా!

ABN, First Publish Date - 2022-04-18T06:04:38+05:30

వడ్డీ దందా.. కొత్త పంథా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగదుకు హామీగా ఆస్తులు తాకట్టు పెట్టాల్సిందే..

ఆలస్యమైతే అసలుకు రెట్టింపు వసూలు

ఇవ్వని పక్షంలో ఆస్తులివ్వమంటూ బెదిరింపులు

దందాలో టీచర్లు, కొందరు పోలీసు సిబ్బంది కూడా?

సీపీ ఆదేశాలున్నా... ఆగని ఆగడాలు

రోడ్డున పడుతున్న సాధారణ, మధ్యతరగతి కుటుంబాలు

వడ్డీ వ్యాపారం ముసుగులో దౌర్జన్యం చేస్తే ఉపేక్షించేది లేదు. జిల్లాలో జరుగుతున్న అక్రమ వడ్డీ వ్యాపారంపై నిఘా పటిష్టం చేశాం. బాధితులకు చట్టపరమైన సహాయ సహకారాలను అందిస్తాం. ఎదుటివారి ఆర్థిక అవసరాలను, కష్టాలను ఆసరాగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అప్పులిస్తూ సకాలంలో చెల్లించని వారిని వేధిస్తున్నారు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. అధిక వడ్డీలు చెల్లించలేక మానసిక, ఆర్థిక ఒత్తిడితో అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేయడం, ఖాళీ చెక్కులు, ఏటిఏం కార్డులు, బంగారు ఆభరణాలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇళ్లు, ఖాళీస్థలాలు, వాహనాలు  కుదవ పెట్టుకుని ఇచ్చే దళారులే అత్యధికంగా ఉన్నారు. వారిపై దృష్టిసారించాం. 

ఇదీ ఖమ్మం సీపీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఈ ఏడాది జనవరిలో విడుదల చేసిన ప్రకటనలోని సారాంశం. అయినా జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఆయన ఆదేశాలను జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోకపోవడంతోనే బాధితులకు న్యాయం జరగడంలేదన్న వాదన వినిపిస్తోంది. 

ఖమ్మం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): అధిక వడ్డీ వ్యాపారం సామాన్యుడి నడ్డి విరుస్తోంది. రూ.10 నుంచి రూ.30 వడ్డీ వసూలు చేస్తూ కొందరు వ్యాపారులు జిల్లాలో వడ్డీ దందా చేస్తున్నారు. నగదు అవసరం ఉన్న వ్యక్తులే టార్గెట్‌గా ఈ దందా సాగిస్తున్నారు. గతంలో తమ వద్ద ఖాళీ ప్రామిసరీ నోట్లు, చెక్కులు పెట్టుకుని వడ్డీ దందా చేసేవారు. కానీ రానురాను ఆ దందా కొత్త రూపం దాల్చింది. నగదు అవసరమున్న వారి నుంచి ఇళ్లు, లేదా ఖాళీస్థలాలు కుదవ పెట్టుకుని నగదు ఇచ్చే స్థాయి నుంచి ఏకంగా సేల్‌డీడ్‌లు రాయించుకుని దందాకు పాల్పడుతున్నారు జిల్లాలోని కొందరు వడ్డీ వ్యాపా రులు. అనంతరం వాటిని అడ్డుగా పెట్టుకుని తాము అడిగినంత నగదు చెల్లించాలని బెదిరింపులకు దిగడం ప్రారంభిస్తున్నారు. అంతమొత్తంలో నగదు ఇవ్వని పక్షంలో తమ పేరిట చేసిన సేల్‌డీడ్‌ను రిలీజ్‌ చేసేది లేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే అధిక వడ్డీ వ్యాపారం నిర్వహించే వారిలో కొందరు కిందిస్థాయి పోలీసు సిబ్బంది ఉండగా.. అత్యధికశాతం టీచర్లు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఖమ్మం నగరంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌ సిబ్బంది ఈ దందాకు తెరలేపినట్టు విమర్శలు లేకపోవు. కొన్నిప్రాంతాల్లో పోలీసు అధికారుల అండదండలతోనే వడ్డీ వ్యాపారులు తమ ఆగడాలను విస్తృతం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

హామీ పెట్టిన ఆస్తులకు హక్కులు..

ఎవరైనా అవసరాలకు నగదు తీసుకున్న తర్వాత సదరు వడ్డీ వ్యాపారులు చట్టబద్ధం కాని వడ్డీ వసూలు చేస్తారు. కానీ ఆయా వసూళ్లు మాత్రం కనబడవు. తీసుకున్న నగదు మొత్తంతో పాటు వడ్డీ చెల్లించినా వారికి ఆ నగదు సరిపోదు. వారం పది రోజులు లేటయిందా ఇక అంతే.. మళ్లీ వడ్డీ నగదు, అసలు నగదుకు సమానమవుతోంది. నగదు తీసుకునే సమయంలో ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకుని దగ్గర పెట్టుకునే సదరు వ్యాపారులు, వడ్డీకి నగదు తీసుకునే వారి పేరుమీద ఉన్న ఆస్తులను కూడా తమ పేరుమీద మార్చుకునే హక్కును పొందుతున్నారు. కొద్దీ గొప్ప వడ్డీ చెల్లించాల్సి ఉన్న సమయంలో దానికి రెండింతలు చెల్లించాలని లేదంటే అంతకంటే ఎక్కువ విలువచేసే తమ ఆస్తులను వారిపేరుమీద మార్చుకుంటామని బెదిరింపులకు పాల్పడటం జిల్లాలో పరిపాటిగా మారినట్టు తెలుస్తోంది. అంతేనా ప్రస్తుతం భూముల విలువలు పెరిగిన క్రమంలో కొందరు అక్రమ వ్యాపారం చేసే వడ్డీ వ్యాపారులు ఆయా సేల్‌ డీడ్‌లను ఇతరుల దగ్గర, బ్యాంకుల్లో పెట్టి అసలు యజమానికి ఇచ్చిన నగదుకంటే నాలుగింతల నగదు తీసుకుంటున్నారు. తీరా అసలు యజమానులు తమ పత్రాలు ఇవ్వాలని అడిగితే వారు వేరేచోట తీసుకున్న నగదు మొత్తం చెల్లిస్తేనే ఇస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

గతంలో ఉక్కుపాదం మోపిన పోలీసులు.. 

గతంలో ఎస్పీగా రంగనాథ్‌ పనిచేసిన సమయంలో కాల్‌మనీ వ్యవహారం తెరపైకి వచ్చింది. వడ్డీ వ్యాపారులు చేసే ఆరాచకాలపై ఉక్కుపాదం మోపేలా ఆయన ఆదేశాలు జారీచేశారు. అంతే జిల్లా వ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై తనిఖీలు జరిపి కొంతమందిపై కేసులు కూడా పెట్టారు. అప్పుడు చట్టబద్దం కాని కొన్ని చెక్కులు, ప్రాంసరీ నోట్లను కూడా స్వాధీనం చేసుకుని ఆయా అక్రమ వడ్డీ దందాలపై ఉక్కుపాదం మోపారు. అనంతరం కొద్ది రోజులపాటు సద్దుమణిగిన ఈ దందా ఇటీవల జోరుగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో నేరుగా సీపీ విష్ణు వారియర్‌నే వడ్డీ దందా నిర్వహించే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటన విడుదల చేశారంటే జిల్లాలో వడ్డీ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆస్తులు కుదవ పెట్టుకుని ఇబ్బందులకు పాల్పడుతున్న అంశాలు కూడా ఆయన దృష్టికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన ఆదేశాలు జారీ చేసినా జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లినా వాటిని పట్టించుకోకపోవడంతో ఈ దందా చాపకింద నీరులా పాకుతూ సాధారణ, మధ్యతరగతి ప్రజల జీవితాలను రోడ్డుకీడుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఆస్తులు గుప్పిట్లో పెట్టుకుని తమ జీవితాలతో ఆడుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-04-18T06:04:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising