రైతు వేదికలకు నిధులు మంజూరు
ABN, First Publish Date - 2022-12-07T00:11:20+05:30
నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ సలహాలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణకు సర్కారు ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. వేదికల్లో నెలకు విద్యుత్ చార్జీలకు రూ.1000, తాగునీటికి రూ.500, పారిశుధ్య
ఒక్కోవేదికకు రూ.9వేలు
నెలవారీగా ఖర్చుకు ప్రతిపాదనలు
ఖమ్మంవ్యవసాయం, డిసెంబరు6: నిత్యం రైతులకు అందుబాటులో ఉంటూ వ్యవసాయ సలహాలు అందించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు వేదికల నిర్వహణకు సర్కారు ఎట్టకేలకు నిధులు విడుదల చేసింది. వేదికల్లో నెలకు విద్యుత్ చార్జీలకు రూ.1000, తాగునీటికి రూ.500, పారిశుధ్య పనివారికి రూ.3000, స్టేసరీకి రూ. 1000, రైతుశిక్షణ శిబిరాల నిర్వహణకు రూ.2500, మినీ లైబ్రరీ, మరమ్మతులకు రూ.1000 ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదించారు. నిర్మించిన భవనాల వద్ద కనీస వసతులు కల్పించేందుకు ఒక్కో వేదికకు నెలకు రూ.9 వేల చొప్పున ఖర్చు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఐదు నెలలకు సంబంధించిన నిధులు జిల్లాలో 129 వేదికలకు అందనున్నాయి. ప్రస్తుతం వీటిని జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయానికి జమ చేశారు. త్వరలో క్లస్టర్ల వారీగా అందజేయనున్నారు. రైతువేదిక పేరిట స్థానిక బ్యాంకుల్లో పొదుపు ఖాతా తీయాల్సి ఉంటుంది. ఏఈవోలు ప్రభుత్వం చెప్పిన మార్గదర్శకాల ప్రకారం డీఏవో పర్యవేక్షణలో ఖర్చు చేస్తారు.
ఇదీ పరిస్థితి..
సాగుకు సంబంధించి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు వీటిని ఏర్పాటు చేసినట్లు సీఎం కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, అవసరమైన అవగాహన సదస్సులు నిర్వహించేందుకు దోహదపడతాయని చెప్పారు. 5 వేల ఎకరాలకు ఒకటి చొప్పున జిల్లాలో 129 వేదికలు నిర్మించారు. ఒక్కోదానికి సుమారు రూ.22 లక్షల వరకు ఖర్చు చేశారు. బీరువా, కుర్చీలు, బల్లలు, మైకుసెట్ తదితర సామగ్రి సమకూర్చారు. అయితే పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్తు తదితర వసతుల కల్పనకు నిధుల లేమి ఏర్పడింది. కొన్ని చోట్ల కనీసం భగిరథ కనెక్షన్లు సైతం ఇవ్వలేదు. సగానికి పైగా నామమాత్రంగా మిగిలి పోయాయి. ప్రభుత్వం 2020లో నెలకు రూ.2 వేల చొప్పున ఇస్తామని ప్రకటించింది. తొలి ఏడాది ఇచ్చి తర్వాత ఆ ఊసెత్తలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగీతే నిత్యం ఉదయం రెండు గంటల పాటు ఏఈవోలు రైతులతో సాగు వివరాలు చర్చించి, తదుపరి క్షేత్ర పర్యటన చేయాల్సి ఉంటుంది. గ్రామాల్లో పంటల వారీగా ఏం జరుగుతుందో తెలిసి సర్కారాలకు పట్టు పెరుగుతుంది. ప్రస్తుతం ఈ నిధులతో పరిసరాలు శుభ్రత, వారానికి రెండు సార్లు శాస్త్రవేత్తలు, అధికారులతో అవగాహన సదస్సులు నిర్వహించే అవకాశం ఏర్పడింది. రైతుబంధు సభ్యులు సైతం తమ భాగస్వామ్యాన్ని సహచరులతో పంచుకునే వీలుంది.
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
సరిత,జేడీఏ
ప్రభుత్వం కేటాయించిన నిధులు పారదర్శకంగా ఖర్చు చేయాలని సిబ్బందికి సూచించాం. అన్నిచోట్ల సౌకర్యాలు, అవసరమైన వసతులు కల్పించాం. నెలవారీగా ఏయే పనులకు ఎంత ఖర్చు చేయాలో స్పష్టత వచ్చింది. ఇకపై వేదికల ద్వారానే ఏఈవోలు ేసవలందించాలని ఆదేశించాం. రైతులు రైతు వేదికలో ఇచ్చే సలహాలను సద్వినియోగం చేసుకోవాలి
Updated Date - 2022-12-07T00:11:24+05:30 IST