ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రేజ్‌కల్చర్‌

ABN, First Publish Date - 2022-01-15T05:47:21+05:30

క్రేజ్‌కల్చర్‌

ప్రయోగాత్మక కేజ్‌కల్చర్‌ విధానం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంజర విధానంలో చేపల పెంపకంపై పెరుగుతున్న ఆసక్తి 

సంప్రదాయపద్ధతులను తలదన్నేలా అధికదిగుబడులు

మత్స్యశాఖ తోడ్పాటుతో మత్స్యకారుల ముందడుగు

క్రమంగా పెరుగుతున్న యూనిట్ల సంఖ్య

కూసుమంచి, జనవరి 14 : చేపల పెంపకంలో ఓ విధానమైన కేజ్‌కల్చర్‌ అంటే ఐదేళ్ల క్రితం వరకు అంతగా అవగాహన లేదు. అలాంటి ఇప్పుడు ఆ విధానంమే మత్స్యకారులకు లాభాలపంటను తెస్తోంది. సంప్రదాయ చేపల పెంపకంతో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మత్స్యకారులకు కేజ్‌కల్చర్‌ కొత్తలాభాలను తెచ్చిపెడుతుండటంతో యూనిట్ల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. ఖమ్మంజిల్లా పాలేరు జలాశయంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటుచేసిన కేజ్‌కల్చర్‌ విధానం సక్సెస్‌ కావడంతో మత్స్యకారులు కేజ్‌ కల్చర్‌వైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధిపై దృష్టి పెట్టి.. రాష్ట్రవ్యాప్తంగా నూతన విధానంలో చేపలపెంపకానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో కేజ్‌కల్చర్‌(పంజర) విధానం ద్వారా చేపల పెంపకానికి ప్రభుత్వం నాంది పలికింది. 

పాలేరులో విజయవంతం..

నీటినాణ్యత, చేపల పెంపకానికి అనుకూలంగా ఉండటం, నీటి నిల్వ, లోతు, ప్రవాహం అన్నీ అనుకూలంగా ఉండటంతో ప్రభుత్వం కేజ్‌కల్చర్‌ విధానానికి పాలేరు జలాశయాన్ని ఎంచుకుంది. 2016 జూలై 11న అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడ కేజ్‌కల్చర్‌ను ప్రారంభించారు. ఆతర్వాత పాలేరు జలాశయంలో ఈ విధానంలో చేపల పెంపకం సక్సెస్‌ కావడంతో మత్స్యకారులు కూడా మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో  ఒక్క యూనిట్‌తో ప్రారంభమైన కేజ్‌కల్చర్‌ ఇప్పుడు పది యూనిట్లకు పెరిగింది. ప్రారంభంలో ఫైబర్‌ డబ్బాల కేజ్‌ తయారీకి ఒక్కో యూనిట్‌కు సుమారు రు.30లక్షలకు పైగా నిధులు కేటాయించారు. మొదట ఒక్క యూనిట్‌ మాత్రమే ఉండగా మత్స్యకారుల విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మరో తొమ్మిది యూనిట్లు మంజూరు చేయించారు. ఇందులో ఫంగాసియస్‌, తిలాపియా చేపల పెంపకం చేపడుతున్నారు. ఒక్కో యూనిట్‌లో 50వేల తిలాపియా చేప పిల్లలు పెంచవచ్చు. ఈవిధానంలో చేపపిల్లల ఎదుగుదలను నిత్యం చూసుకోవడం తేలిక. ఈచేపలకు రోగనిరోధకశక్తి అధికంగా ఉండటంతో పాటు ఒకే ఒక ముల్లు ఉంటుంది. నీళ్లలో నుండి బయటకు తీసినప్పటి తరువాత సుమారు రెండు గంటలకు పైగా బతుకుతుంది. లైవ్‌ఫిష్‌గా కూడా దీనిని విక్రయిస్తుంటారు. జిల్లాలో ఇవి కొత్తరకం కావడంతో డిమాండ్‌ తక్కువగా ఉండటంతో రవ్వ, బొచ్చ రకాలుకూడా పెంచుతున్నారు. విడతకు సుమారు 30టన్నులు ఉత్పత్తి అవుతాయి. మార్కెట్‌లో ఈ చేప ధర కిలో రూ.150 వరకు పలుకుతుంది. పాలేరు జలాశయంలో ప్రస్తుతం 10యూనిట్ల ద్వారా సుమారు 100మంది మత్స్యకారులు లబ్ధిపొందుతున్నారు. మత్స్యకారులను ప్రోత్సహించేందుకు రెండేళ్లక్రితం మరో పది యూనిట్లు మంజూరయ్యాయి. మరో 100మంది 10గ్రూపులుగా ఏర్పడి తమవాటా ధనాన్ని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేశారు. ఇవికూడ ఏర్పాటుచేస్తే మొత్తం యూనిట్ల సంఖ్య 20కు చేరుతుంది. కానీ ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో కేజ్‌కల్చర్‌ యూనిట్ల ఏర్పాటులో కొంతజాప్యంజరుగుతోందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

కేజ్‌కల్చర్‌ విధానంపై ప్రత్యేకశిక్షణ

పాలేరు జలాశయంలో అమలవుతున్న కేజ్‌కల్చర్‌ విధానంపై ఇక్కడి మత్స్యపరిశోధనాకేంద్రంలో ఔత్సాహికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సీనియర్‌ శాస్త్రవేత్త విద్యాసాగర్‌రెడ్డి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు కేజ్‌విధానంలో మెరుగైన యాజమాన్య పద్ధతుల ద్వారా చేపల పెంపకం, వ్యాధులు, వాటి నియంత్రణ, మార్కెటింగ్‌, ప్రభుత్వం నుంచి అందేరాయితీలు లాంటి పలు అంశాలపై శిక్షణనిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మత్స్యకారులకు అనేకమందికి శిక్షణనిచ్చారు. 

యూనిట్లను మరింత విస్తరిస్తాం..

షకీలాభాను, జిల్లా మత్స్యశాఖ అధికారి, ఖమ్మం

మత్స్యకారుల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయోగాత్మకంగా ఐదేళ్లక్రితం ఏర్పాటుచేసిన కేజ్‌కల్చర్‌ విధానం సక్సెస్‌ కావడంతో యూనిట్లను మరింత విస్తరించేందుకు కృషిచేస్తున్నాం. ఇక్కడ మరోపది యూనిట్లు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరయిన యూనిట్లు కూడా త్వరలో నెలకొల్పుతాం. కేజ్‌విధానంలో చేపల పెంపకం మత్స్యకారులకు లాభాలను తెచ్చిపెడుతుంది. ప్రభుత్వం నుంచి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తాం.

మంచి లాభాలు వస్తున్నాయి: బత్తుల ఉప్పయ్య

పాలేరు జలాశయంలో ఏర్పాటుచేసిన కేజ్‌కల్చర్‌ విధానంలో చేపలపెంపకంతో మంచి లాభాలు వస్తున్నాయి. ఈ యూనిట్లు మంజూరయ్యాక మేం కొంత ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. ప్రభుత్వం చేపలపెంపకానికి అవసరమయ్యే వనరులపై దృష్టి పెట్టి.. మరికొన్ని రాయితీలు ఇస్తేబాగుంటుంది. ఉచితంగా దాణా అందించాలి.




Updated Date - 2022-01-15T05:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising