కూర్మావతారంలో భద్రాద్రి రామయ్య
ABN, First Publish Date - 2022-01-05T04:38:56+05:30
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తు
కూర్మావతారంలో కోదండరాముడు
భద్రాచలంలో భక్తిశ్రద్ధలతో ముక్కోటి అధ్యయనోత్సవాలు
నేడు వరాహావతారంలో రామయ్య
భద్రాచలం/దుమ్ముగూడెం, జనవరి 4: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీరామచంద్రుడు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకు ముందు స్వామివారిని కూర్మవతారంలో అలంకరించి ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించి నిత్యకల్యాణమండపానికి తీసుకొచ్చారు. అక్కడ పూజా కార్యక్రమాల అనంతరం వేదపండితులు స్వామివారికి వేద విన్నపాలు సమర్పించారు. అనంతరం నాళాయర దివ్య ప్రబందం, వేద పారాయణం పఠించారు.అనంతరం స్వామి వారికి నివేదన చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో వి.శ్రవణ్‌కుమార్, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయరాఘవన, పరిపాలన, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.
నేడు వరాహావతారం
ప్రజా సృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని, బ్రహ్మాదుల మొరవిన్న నారాయణుడు నీటిలో మునిగి ఉన్న భూమిని పైకి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యక్రమంలో ఆటంకం కలిగించిన లోక కంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుని సంహరించి, భూమిని రక్షించాడు. రాహు, గ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని చూస్తే ఆ బాధలు నుంచి విముక్తులవుతారు.
పర్ణశాల రామాలయంలో..
ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి దేవస్థానం అనుబంధ ఆలయమైన పర్ణశాల రామాలయంలో స్వామివారు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో అర్చక స్వాములు కిరణ్‌కుమారాచార్యులు, భార్గవాచార్యులు, నర్సింహాచార్యులు, వెంకటాచార్యులు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-01-05T04:38:56+05:30 IST