నిండు వెలుగుల జాతర
ABN, First Publish Date - 2022-03-05T07:41:48+05:30
నిండు వెలుగుల జాతర
వరాల వనదేవతలకు మనసారా మొక్కులు
పగిడిద్దరాజు జాతరకు పోటెత్తిన భక్తులు
నేడు దేవతల వన ప్రవేశం
గుండాల, మార్చి 4: గద్దెనెక్కిన ఇలవేల్పులను దర్శించి తరించేందుకు పగడిద్దరాజు జాతరకు మూడవ రోజు భక్తులు పోటెత్తారు. జాతర పరిసరాలు జనసంద్రంగా మారాయి.. మది లో తలచినా నిండు మనసుతో ఆశీర్వచనాలిచ్చే వనదేవతల ఆశీస్సులు అందుకునేందుకు మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క భర్త అర్రెం వంశీయుడు పగడిద్దరాజు జాతర వేడుకలు గుండాల మండలం వేపలగడ్డలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం బర్లగుట్ట నుంచి పగిడిద్దరాజును ముక్కు పుడక రూపంలో తీసుకువచ్చిన తల పతులు గురువారం కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్క తల్లి మాడిమోరి గుట్ట నుంచి గద్దెలపైకి చేర్చారు. వనం జనంలోకి అడుగిడగా గద్దెలపైకి చేరిన దేవతలతో నిండు జాతర ఆరంభమైంది. శుక్రవారం వన దేవతలను కొలిచి మొక్కే భక్తులతో జాతర కళకళలాడింది. గిరిజన ఆదివాసీల ఆరధ్య దేవతలు సమ్మక్క, పగడిద్దరాజు గద్దెపై కొలువుదీరడంతో భక్తలు పులకించారు. ఆదివాసీ సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు తెల్ల బంగారం, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు సమర్పిస్తూ తీరొక్కవిధంగా భక్తితో పూజాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. జయహో సమ్మక్క తల్లి అంటూ ఆనంద పారవశ్యంతో సాష్టాంగ దండాలు పెడుతూ మహిమగల వన దేవతలను ఽధర్శించుకున్నారు. శనివారం దేవతలు వన ప్రవేశం చేయనుండటంతో భక్తులు ధర్శనానికి పోటీపడ్డారు. భక్తి భావంతో దేవతల దర్శనం చేసుకొని ఆశీర్వదించమ్మా.. చల్లంగా చూడంమ్మా అంటూ మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తుల పూనకాలతో జయజయ ద్వానాలతో ప్రాంగణం మార్మోగిపోయింది.. గిరిజన యువతీ, యువకుల సంప్రదాయ నృత్యాలతో డప్పువాయిద్యాలతో సందడి చేశారు. పూజారులు, వడ్డెలు, తలపతులు అప్పయ్య, నాగయ్య, భిక్షం, బుచ్చయ్యలు దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - 2022-03-05T07:41:48+05:30 IST