లేబర్ అడ్డా ఏది?
ABN, First Publish Date - 2022-11-18T01:08:10+05:30
పొద్దంతా కష్టపడితేనే పూట గడిచే పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులతో పాటు దినసరి పనులు చేసే అనేక మంది కూలీలు ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
పొద్దంతా కష్టపడితేనే పూట గడిచే పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులతో పాటు దినసరి పనులు చేసే అనేక మంది కూలీలు ప్రత్యేకంగా ఒక స్థలం అంటూ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, వానలో సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా పనికోసం ఎదురు చూస్తున్న కూలీల దయనీయ స్థితి అందరికి అవేదన కలిగిస్తోంది. తెల్లవారుజామునే సిరిసిల్ల, వేములవాడ పట్టణాలకు కూలీలు తరలివస్తారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కూలీలే కాకుండా సిద్ధిపేట, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల శివారు గ్రామాల కూలీలు కూడా జిల్లాకు పనికోసం వస్తారు. వీరికి ప్రత్యేక పని ప్రదేశం లేకపోవడంతో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల ఎదుట ప్రధాన రహదారిపైనే పని ఉందా అంటూ వచ్చిపోయే వారిని అడుగుతూ పడిగాపులు కాస్తారు. ఉదయం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ప్రధాన రహదారి ముందు కూలీలతో జన సందోహంగానే కనిపిస్తుంది. సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ఈ రహదారిపై నిత్యం వాహనాలు పరుగులు తీస్తుంటాయి. కార్మికులు ప్రమాదాలకు కూడా గురవుతున్నారు. వీరు నిలబడే చోట దుకాణాలు తెరిచిన వెంటనే యజమానులు వీరిని అక్కడి నుంచి వెల్లగోడుతున్నారు. ఎక్కడా నిలబడి కూలీ కోసం వెతుక్కోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 5.52 లక్షల జనాభాలో 66,751 మంది వ్యవసాయ దారులు, 1,01,737 వ్యవసాయ కార్మికులు, 46,647 మంది ఇళ్లలో పనిచేసే వారు ఉన్నారు. 83,528 మంది కార్మికులు భవన నిర్మాణాలు, ఇతర పనులు చేస్తుంటారు. ఇందులో ప్రధానంగా జిల్లా కేంద్రానికి రోజు ఎక్కువ సంఖ్యలో కార్మికులు వస్తారు. వీరితో పాటు ఆంధ్రా, తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కూలీలు కూడా సిరిసిల్లలోనే ఉంటూ రోజువారీ పనుల కోసం ఎదురు చూసేవారు ఉన్నారు. ఎక్కువగా భవన నిర్మాణ పనులకే కూలీలు వస్తుంటారు.
మహిళలకు రక్షణ కరువు...
జిల్లా కేంద్రానికి మగ కూలీలతో పాటు మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. వీరు కూడా రోడ్ల మీద ఎదురు చూస్తున్న క్రమంలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. వీటికి తోడుగా రక్షణ కూడా లేకుండా పోతుంది. పనిపేరుతో పిలిచే యజమానులు వారితో అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. బుధవారం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళ కూలీని పనికి కోసం అని తీసుకవెళ్లి లైంగికంగా వేధింపులకు ఒడిగట్టిన సంఘటన మహిళా కూలీల్లో అందోళనను నింపింది. కూలీలు ఎక్కడికి వెళ్తున్నారో వివరాలు కూడా నమోదు చేసే పరిస్థితి లేకపోవడంతో మహిళలు పనులకు వెళ్లడానికి భయపడుతున్న సందర్భాలు ఉన్నాయి.
ప్రత్యేక స్థలాలు కేటాయించాలి
జిల్లాలో ప్రధానంగా సిరిసిల్ల, వేములవాడ కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులతో పాటు రోజువారీ కూలీ పనులకు వచ్చే కార్మికులకు ప్రత్యేక లేబర్ అడ్డాలకు స్థలాలు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థలాలు కేటాయించడంతో పాటు కూర్చోవడానికి షెల్టర్లు, అత్యవసర పరిస్థితుల్లో తిరిగి రాత్రి వేళల్లో ఊళ్లలోకి వెళ్లలేని వారికి విశ్రాంతి గదులు ఏర్పాటు చేయానలి కోరుతున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించాలని మహిళలకు రక్షణ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
Updated Date - 2022-11-18T01:08:13+05:30 IST