ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిబంధనలు బేఖాతరు

ABN, First Publish Date - 2022-10-18T05:03:42+05:30

మానేరు నది నుంచి ఇసుకను తోడి విక్రయించేందుకు ప్రభుత్వం రీచులను ఏర్పాటు చేసింది.

ఓదెల మండలం పొత్కపల్లి సమీపంలో లారీల్లో ఇసుక లోడింగ్‌(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మానేరులో భారీగా ఇసుక తవ్వకాలు

- రెండు మీటర్లకు పైగా లోతు నుంచి సేకరణ

- ఓవర్‌ లోడ్‌తో ఇసుక తరలింపు

- పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి

- ఇసుక రీచులపై కరువైన అధికారుల నిఘా

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మానేరు నది నుంచి ఇసుకను తోడి విక్రయించేందుకు ప్రభుత్వం రీచులను ఏర్పాటు చేసింది. వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వేస్తున్నా టీఎస్‌ఎండీసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తవ్వాల్సిన లోతుకు మించి ఇసుక తీయడమే గాకుండా అదనపు బకెట్ల పేరిట ఇసుకను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. రాత్రి వేళల్లో ఓవర్‌లోడ్‌తో ఇసుకను తరలిస్తుండడంతో రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయి. ఒకే వేబిల్లుపై రెండు, మూడు ట్రిప్పుల ఇసుకను తరలిస్తున్నారని తెలుస్తున్నది. మానేరులో ఇసుక తవ్వకాలను స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మానేరు సంరక్షణ సమితి పేరిట కొందరు పోరాటం చేస్తున్నా కూడా ఇసుక తవ్వకాలను ప్రభుత్వం ఆపడం లేదు. 

చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం కోసం..

మానేరు నదిపై ప్రభుత్వం సుమారు 20కి పైగా చెక్‌ డ్యామ్‌లను నిర్మిస్తున్నది. వీటి లోపల ఇసుక 6 మీటర్ల మేరకు పేరుకు పోయిందని, 2 మీటర్ల లోతు వరకు ఇసుకను తొలగిస్తే చెక్‌డ్యామ్‌లు పటిష్టంగా ఉండడంతో పాటు నీటిని నిల్వచేయవచ్చని జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. డీ సిల్టేషన్‌ కింద టీఎస్‌ఎండీసీ ద్వారా 25 ఇసుక రీచులను గుర్తించి టెండర్లను ఆహ్వానించింది. సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి, గట్టెపల్లి 1, గట్టెపల్లి 2, కదంబాపూర్‌, తొగర్రాయి. ఓదెల మండలం గుండ్లపల్లి 1, గుండ్లపల్లి 2, కనగర్తి 1, కనగర్తి 2, మడక 1, మడక 2, పొత్కపల్లి 1, పొత్కపల్లి 2, రూప్‌నారాయణపేట్‌, ఇందుర్తి 1, ఇందుర్తి 2, గుంపుల, కాల్వశ్రీరాంపూర్‌ మండలం మీర్జంపేట్‌, కిష్టంపేట్‌, మొట్లపల్లి, ముత్తారం మండలం ఓడేడు 1, ఓడేడు 2, అడవి శ్రీరాంపూర్‌, మంథని మండలం గోపాల్‌పూర్‌, చిన్న ఓదాలలో ఇసుక రీచులను గుర్తించారు. టెండర్లను ఫైనల్‌ చేసి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కూడా చేసుకున్నారు. గుర్తించిన ఇసుక రీచుల నుంచి కోటి 32 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను తరలించేందుకు టెండర్లు కట్టబెట్టారు. తద్వారా ప్రభుత్వానికి 750 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రెండు రీచులు మినహా 23 రీచుల్లో ఇసుక తవ్వకాలు ప్రారంభమయ్యాయి. ఇందుర్తి 1, ఇందుర్తి 2 రీచుల డంపింగ్‌ యార్డులను అవతలి ఒడ్డునగల కరీంనగర్‌ జిల్లా తనుగుల గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. మీర్జంపేట డంపింగ్‌ యార్డును వావిలాల సమీపంలో, చిన్నఓదాల క్వారీ డంపింగ్‌ యార్డును జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మల్హర్‌ మండలం మల్లారం గ్రామం వద్ద ఏర్పాటు చేశారు. అటు నుంచి అటే ఇసుకను తరలిస్తున్నారు. ఏప్రిల్‌ మాసం నుంచి క్రమంగా ఇసుక క్వారీలు ప్రారంభం కాగా, మధ్యలో కురిసిన భారీ వర్షాలతో క్వారీలను తాత్కాలికంగా నిలిపివేశారు. 

దెబ్బతింటున్న రోడ్లు..

నిబంధనల ప్రకారం ఆయా రీచుల్లో 2 మీటర్ల లోతుకు మించి ఇసుకను తోడరాదని, కానీ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా ఇసుకను తోడుతున్నారని ఓదెల, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున ఇసుక తరలుతున్నది. ఇసుక బుకింగ్‌ చేసుకున్న దానికి మించి అదనంగా 4 నుంచి 8 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను ఓవర్‌ లోడ్‌తో తీసుక వెళుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో ఎలాంటి వే బిల్లులు లేకుండా జమ్మికుంట మీదుగా హైదరాబాద్‌కు ఇసుక తరలిస్తున్నారని సమాచారం. మూడు రోజుల క్రితం గండ్రపల్లి గ్రామస్తులు రాత్రి వేళలో ఓవర్‌ లోడ్‌తో కాన్వాయ్‌లా వెళుతున్న లారీలను అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాదాపు 11 లారీలను పోలీసులు సీజ్‌ చేసి విజిలెన్స్‌ అధికారులకు అప్పగించారు. మడక, పొత్కపల్లి, కిష్టంపేట, మీర్జంపేట, గుండ్లపల్లి, కదంబాపూర్‌, అడవి శ్రీరాంపూర్‌, ఓడేడు, ఇందుర్తి1, ఇందుర్తి2, తదితర రీచుల నుంచి ఓవర్‌ లోడ్‌తో పెద్దఎత్తున ఇసుకను తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పలు క్వారీల వద్ద తూకం వేసే యంత్రాలు లేకపోవడం గమనార్హం. బుకింగ్‌ చేసుకున్న ఇసుక పరిమాణానికి మించి తరలిస్తున్న ఇసుకను కాంట్రాక్టర్లు విక్రయించుకుంటున్నారు. టీఎస్‌ఎండీసీతో కాంట్రాక్టర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మానేరు 2 మీటర్ల వరకు మాత్రమే ఇసుక తోడి డంపింగ్‌ యార్డులో నిల్వచేయాలి. అక్కడి నుంచి బుకింగ్‌ చేసుకున్న మేరకు మాత్రమే ఇసుకను లారీల్లో పోయాలి. కానీ కాంట్రాక్టర్లు నిబంధనలను తుంగలో తొక్కి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి జేబులు నింపుకుంటున్నారు. ఈ రీచుల వల్ల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్లు మొత్తం ధ్వంసం అవుతున్నాయి. ఓదెల, సుల్తానాబాద్‌, కాల్వశ్రీరాంపూర్‌, ముత్తారం, మంథని మండలాల్లోని ఆయా గ్రామాల రోడ్లు ఇసుక లారీల వల్ల దెబ్బతింటున్నాయి. ప్రమాదాలు కూడా చోటు చేసుకోవడంతో పాటు దుమ్ము రేగుతుండడంతో ప్రజల ఆరోగ్యాలు పాడవుతున్నాయి. ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్లు నిబంధనలను పాటిస్తున్నారా, లేదా అని చూడాల్సిన టీఎస్‌ఎండీసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇసుక క్వారీలను రద్దు చేయాలని మానేరు తీర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-10-18T05:03:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising