విద్యాశాఖలో సమస్యలు

ABN , First Publish Date - 2022-12-07T01:16:38+05:30 IST

విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల విద్యను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 విద్యాశాఖలో సమస్యలు

- రెగ్యులర్‌ ఎంఈవోలు లేకపోవడంతో పర్యవేక్షణ కరులు

- ఇబ్బంది పడుతున్న విద్యార్థులు

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబర్‌ 6: విద్య, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. పాఠశాల విద్యను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందంటూ ఉపాధ్యాయులు, విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర సిబ్బందితోపాటు పర్యవేక్షణాధికారుల కొరతతోపాటు పాఠశాలల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులతోపాటు డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యాబోధనతోపాటు పర్యవేక్షణ పూర్తిగా కుంటుపడింది.

ఫ 2017 నుంచి నిలిచిన ఉపాధ్యాయ నియామకాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసి 2017లో వారికి పోస్టింగ్‌ ఇచ్చారు. అప్పటి నుంచి అనేక మంది ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం పదవీ విరమణ చేస్తుండగా వారి పోస్టులను భర్తీ చేయలేదు. ఏడేళ్లుగా పదోన్నతులు, 2018 నుంచి ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టలేదు. కొవిడ్‌ కారణంగా తొలగించిన విద్యా వలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. దీంతో జిల్లాలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యాబోధన అంతంతమాత్రంగానే సాగుతోంది.

ఫ అదనపు బాధ్యతలతో ప్రధానోపాధ్యాయులు సతమతం

ఆయా మండలాల్లో ఎంఈవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయకుండా హైస్కూల్‌ హెడ్మాస్టర్లకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలను అప్పగించారు. ఒక్కో హెడ్మాస్టర్‌కు మూడు, నాలుగు మండలాల ఎంఈవో బాధ్యతలను అదనంగా అప్పగించడంతో ఇబ్బంది పడుతున్నారు. హెచ్‌ఎం, ఎంఈవో విధులను సక్రమంగా నిర్వహించ లేకపోతున్నామని వాపోతున్నారు. దీంతో ప్రాథమిక, ప్రాథమికోన్న పాఠశాలల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారుతోంది. హైస్కూల్స్‌ను పర్యవేక్షించాల్సిన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (డీప్యూటీ ఈవో), జడ్పీ స్కూల్స్‌ను పర్యవేక్షించాల్సిన పరిషత్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ (పీఈవో) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్యూటీ ఈవో పోస్టులు ఖాళీగా ఉండడంతో హైస్కూల్స్‌కు వెళ్ళాల్సిన ఏడుగురు సబ్జెక్టు ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన ఉపాధ్యాయుల బృందం ప్యానల్‌ పర్యవేక్షణ లేకుండాపోయింది. దశాబ్దకాలంగా హైస్కూల్స్‌కు ప్యానల్‌ పర్యవేక్షణ లేక పోవడంతో అసలు దీని గురించి పూర్తిగా మరిచిపోయారు.

ఫ డైట్‌లోనూ ఖాళీలు

కరీంనగర్‌లోని డైట్‌ కళాశాలలో 20 మంది అధ్యాపకులకు ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. వారిలో ఒకరికి జగిత్యాల డీఈవోగా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. జిల్లాలో 643 హైస్కూల్స్‌లో హెడ్మాస్టర్‌ పోస్టులు దాదాపు ఇన్‌చార్జీలుగానే ఉండడంతో సహ ఉపాధ్యాయులపై వారు అంతగా ప్రభావం చూపలేక పోతున్నారనే భావన వ్యక్తమవుతోంది. 2017 తర్వాత డీఎస్సీ లేదా టీఆర్టీ నిర్వహించక పోవడంతో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తూ నెట్టుకువస్తోంది. ఈ సంవత్సరం జిల్లాలో ఇంకా సర్దుబాటు చేయక పోవడంతో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది.

ఫ పూర్తి స్థాయిలో అందని పాఠ్య పుస్తకాలు

విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలైనా 25 నుంచి 30 శాతం విద్యార్థులకు ఉంకా పాఠ్యపుస్తకాలే అందలేదని, ఇటు ఉపాధ్యాయులు లేక, అటు పుస్తకాలు లేక వార్షిక పరీక్షలు ఎలా రాస్తారని, తమ పిల్లల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారిందంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఫ తమ సమస్యలు పరిష్కరించాలంటున్న ఉపాధ్యాఉలు

రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మోడల్‌ స్కూల్‌, కేజీబీవీ పాఠశాలల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమి లేదు. మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే ఉపాధ్యాయులకు సర్వీస్‌ రూల్స్‌ లేవు, పదేళ్ళుగా వారికి బదిలీలు, పదోన్నతులు లేనే లేవు. కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయినులు సమాన పనికి సమాన వేతనం చెల్లించడం లేదని, రెగ్యులర్‌ టీచర్లకు 27 సీఎల్స్‌ ఇస్తున్నట్లు తమకూ ఇవ్వాలని కోరుతున్నారు. మోడల్‌ స్కూల్స్‌లో వార్డెన్‌ బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగించడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బోధనేతర సిబ్బందితోపాటు స్వీపర్లు, స్కావెంజర్లను కూడా నియమించక పోవడంతో ఉపాధ్యాయులే ఆయా పనులను చేయించుకోవలసిన దుస్థితి నెలకొన్నది. భార్యభర్తలు ఉద్యోగులైతే వారికి స్పౌస్‌ కోటాలో ఒకే చోట పోస్టింగ్‌ ఇవ్వక పోవడంతో భార్య ఒక చోట, భర్త మరో చోట ఇలా పనిచేస్తుండడంతో ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాఠశాల విద్యారంగంలో అనేక సమస్యలు తిష్ట వేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల భవిష్యత్‌ ఆగమ్యగోచరంగా మారుతోందని ఇటు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా అదనపు బాధ్యతలను అప్పగిస్తుండడంతో పనిభారంతో పాటు విధులను సక్రమంగా నిర్వహించ లేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-12-07T01:16:38+05:30 IST

Read more