వరద నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు
ABN, First Publish Date - 2022-10-18T05:00:16+05:30
నగరంలోని లోతట్టు ప్రాంతాలతోపాటు వర్షం అధికంగా కురిసిన సమయంలో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు.
- మేయర్ యాదగిరి సునీల్‌రావు
కరీంనగర్ టౌన్, అక్టోబర్ 17: నగరంలోని లోతట్టు ప్రాంతాలతోపాటు వర్షం అధికంగా కురిసిన సమయంలో వరద నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని మేయర్ యాదగిరి సునీల్‌రావు తెలిపారు. సోమవారం కరీంనగర్ 52వ డివిజన్ ముకరంపురాలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ సునీల్‌రావు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరవాసులకు కావలసిన మౌలిక సౌకర్యాలను కల్పించడం బల్దియా ప్రధాన కర్తవ్యమని అన్నారు. ఈ ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజీలు శిథిలావస్థకు చేరాయని, వాటి స్థానంలో మున్సిపల్ నిధులతో కొత్తవాటిని నిర్మిస్తున్నామని చెప్పారు. పురాతనమైన ఈ డివిజన్‌లో ఎక్కువగా ఇరుకురోడ్లు ఉన్నాయని, వాటిని విస్తరించడంతోపాటు ఓపెన్ డ్రైనేజీ కాకుండా వాల్ టూ వాల్ ఎస్‌డబ్ల్యూజీ పైపులైన్ డ్రైనేజీ నిర్మిస్తామని అన్నారు. వరద నీరు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా మ్యాన్‌హోల్స్‌కు మరమ్మత్తులు చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. నగరపాలక సంస్థ చేపడుతున్న ముందస్తు చర్యలతో జూన్ నుంచి ఇప్పటి వరకు ఇంకా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ కూడా ఎలాంటి నష్టం జరుగలేదని, ప్రజలు ఇబ్బందులు కలగలేదని అన్నారు. వచ్చే వర్షాకాలం వరకు ఎక్కడ కూడా వరద నీటి సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్, షర్ఫొద్దీన్, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ షమీ, ఈఈ మహేందర్, డీఈ మసూద్ అలీ పాల్గొన్నారు.
Updated Date - 2022-10-18T05:00:16+05:30 IST