జగిత్యాల బీజేపీలో జోష్
ABN, First Publish Date - 2022-12-15T00:51:45+05:30
జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కమల నాథుల్లో నూతనోత్తేజం నింపింది. జిల్లాలో వారం రోజుల పాటు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్ర సాగింది. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపాయి.
జగిత్యాల, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కమల నాథుల్లో నూతనోత్తేజం నింపింది. జిల్లాలో వారం రోజుల పాటు నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో పాదయాత్ర సాగింది. టీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితలను లక్ష్యంగా చేసుకుంటూ చేసిన విమర్శలు రాజకీయంగా దుమారం రేపాయి. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ, ప్రజలకు సందే శం ఇస్తూ.. టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ బండి సంజయ్ యాత్ర నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై దృష్టి సారించి సంబందిత వ్యక్తులు, ప్రజలను కలిశారు. అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా అందించారు. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని కోరుట్ల నియోజక వర్గం మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్‌లో ప్రారంభమైన అయిదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈనెల 13వ తేదిన చొప్పదండి నియోజక వర్గం పరిధిలోని కొడిమ్యాల మండలం పూడూరు వరకు కొనసాగింది. జిల్లాలో వారం రోజుల పాటు సుమారు 82 కిలో మీటర్ల దూరం బండి సంజయ్ పాదయాత్ర జరిగింది.
ప్రధాన పట్టణాల్లో బహిరంగ సభలు
జిల్లాలోని ప్రధాన పట్టణాలు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ కేంద్రాల్లో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ నిర్వహించిన బహిరంగ సభలు సక్కెస్ అయ్యాయి. యాత్రలో భాగంగా ఆయా పట్టణాలు కాషాయమయమయ్యాయి. మూడు పట్టణాల్లో పాదయాత్ర చేసి కార్యకర్తల్లో కొత్త జోష్ నింపారు. వీటితో పాటు పాదయాత్ర నిర్వహించిన ఆయా గ్రామాల్లో ప్రధాన చౌరస్తాల వద్ద రోడ్ షోలు నిర్వహించారు. అధికార పార్టీపై ఘాటైన విమర్శలు గుప్పించి.. టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని తన పాదయాత్రలో ప్రజలకు చేరేలా చేశారు. ప్రధాన సమస్యలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, రైతు రుణ మాఫీ, నిరు ద్యోగ భృతి, ఉద్యోగాల నియామకం, ఆసరా పింఛన్లు తదితర అంశాలపై ప్రభుత్వం ఎలా నిర్లక్ష్యం వహిస్తుందో వివరిస్తూ ప్రజలకు సందేశాలను ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ శ్రేణులు నిర్వహించిన సంబరాల్లో భాగస్వామ్యమయ్యారు.
క్యాడర్‌కు దిశా నిర్ధేశం
జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితిని ఆరా తీయడమే కాకుండా భవిష్యత్తులో ఎలా పనిచేయాలనే దానిపై సుశిక్షితులు కావాలని, క్రమ శిక్షణగా మెలగాలని ఉద్బోదించడం, శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఆయా సెగ్మెంట్లలో బీజేపీకి అనుకూలించే పరిస్థితులు ఏమిటీ..?మార్చుకోవాల్సిన ప్రతికూలత అంశాలేమిటీ..?అనే దానిపై నియోజకవర్గాల వారిగా వివరించడం కార్యకర్తల్లో ఆలోచనను రేకెత్తించింది. నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మరోసారి కైవసం చేసుకోవడం ఖాయం. దీని పరిదిలోని జిల్లాలో గల జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల్లో అంకిత భావంతో పనిచేస్తే అసెంబ్లీ సెగ్మెంట్లలో సైతం విజయం సాధించడం కష్టమేమీ కాదంటూ కార్యకర్తల్లో బండి సంజయ్ ఉత్సాహాన్ని నింపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులకు కర్తవ్యబోధ చేశారు. వారం రోజుల పాటు పాదయాత్ర యువతలో ఉత్సాహాన్ని నింపింది. రైతులతో కలిసి ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నడం, గీతా కార్మికులతో కలిసి కల్లు సేవించడం వంటివి జరిపి ఆయా వర్గాలకు ఉత్సాహ పరిచారు. ఖాదీ బోర్డు చైర్మన్ పదవిని పద్మశాలీలకు ఇవ్వాలని ప్రస్తావించి ఆ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ప్రభుత్వ బాధ్యతలపై ప్రశ్నిస్తూ పాదయాత్ర కొనసాగించారు.
ముత్యంపేట, కొండగట్టులపై ప్రత్యేక దృష్టి
ముత్యంపేట నిజాందక్కన్ షుగర్ లిమిటెడ్ మూసివేతపై, కొండగట్టు బస్సు ప్రమాద సంఘటనపై బండి సంజయ్ ప్రత్యేక దృష్టి సారించారు. ముత్యంపేట చక్కర కర్మాగారాన్ని సందర్శించి రైతులతో భేటీ అయ్యారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో కర్మాగారాన్ని తెరిపిస్తామన్న సీఎం కేసీఆర్ హామీ ఏమైందని నిలదీశారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వంతో చాతగావడం లేదని రాసిస్తే కేంద్రాన్ని ఒప్పించి తాము తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి నాలుగేళ్లు అయినా బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని ఆరోపిం చారు. కొండగట్టు ప్రమాద బాధితులతో ముచ్చటించి కష్టాలను అడిగితెలుసుకున్నారు. చల్గల్లో ఓ బీడీ పరిశ్రమను సందర్శించి కార్మి కుల గోసను తెలుసుకున్నారు. జగిత్యాల నుంచి ముంబాయి వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు ఎక్కి వలస వెళ్తున్న యువకులతో ముచ్చటించి సమస్య లను ఆలంకించారు. జగిత్యాలలో పీఎఫ్ఐ కార్యకలాపాలను పసిగట్టడం, అనిచివేయడంపై ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రేక్షకపాత్ర వహించాయని ధ్వజమెత్తారు. ఈనెల 15వ తేదీన కరీంనగర్లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ సక్సెస్ చేయడంపై బండి సంజయ్ ప్రధానంగా దృష్టి సారించారు.
ప్రజా సమస్యలు వెలుగులోకి వచ్చాయి
- మోరపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు
జిల్లాలో వారం రోజుల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్రలో అనేక ప్రజా సమస్య లు వెలుగులోకి వచ్చాయి. ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయడానికే సంగ్రామ యాత్ర నిర్వహించాం. రానున్న ఎన్నికల్లో ప్రజల సమస్యలకు పరిష్కారం సూచిస్తూ మెనిఫెస్టోలో పొందు పరు స్తాం.
Updated Date - 2022-12-15T00:52:17+05:30 IST