‘కుష్ఠు’పై సమరం
ABN, First Publish Date - 2022-12-04T00:31:41+05:30
కుష్ఠు’ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సమరం చేస్తోంది. వ్యాధి పేరు వినగానే భయపడే రోజులు పోయాయి. గతంతో పోల్చుకుంటే వ్యాధి తీవ్రతతోపాటు బాధితులు తగ్గిపోయారు. మిగిలిన శాతాన్ని కూడా అరికట్టడానికి జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక సర్వేకు సిద్ధమైంది.
- జిల్లాలో 6 నుంచి 22 వరకు సర్వే
- 479 బృందాల ఏర్పాటు
- లక్షణాలు ఉన్నవారికి మందులు
- ఇప్పటికే ఈ ఏడాది 18 మందికి గుర్తింపు
- జిల్లాలో 206 మంది బాధితులు
(ఆంఽధ్రజ్యోతి సిరిసిల్ల)
‘కుష్ఠు’ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం సమరం చేస్తోంది. వ్యాధి పేరు వినగానే భయపడే రోజులు పోయాయి. గతంతో పోల్చుకుంటే వ్యాధి తీవ్రతతోపాటు బాధితులు తగ్గిపోయారు. మిగిలిన శాతాన్ని కూడా అరికట్టడానికి జాతీయ వైద్య ఆరోగ్య మిషన్ ద్వారా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రత్యేక సర్వేకు సిద్ధమైంది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 6 నుంచి 22 వరకు ఇంటింటా లెప్రసీ సర్వే చేయనుంది. జాతీయ ‘కుష్ఠు’ నిర్మూలన కార్యక్రమాన్ని 1983లో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘కుష్ఠు’ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చింది. వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించడం. వారికి మందులు పంపిణీ చేయడం, వ్యాధి తగ్గేవరకు పర్యవేక్షించడం వంటివి లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2020 కొవిడ్ సమయంలో సర్వే నామమాత్రంగా సాగింది. 2021లో సర్వే జరగనేలేదు. ఈ క్రమంలో వ్యాధి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయని భావించి సర్వే చేయాలని నిర్ణయించారు. సర్వేలో లక్షణాలు కనిపించిన వారికి పరీక్షలు జరిపి మందులు ఇవ్వనున్నారు. కుష్ఠు వ్యాధి ప్రాణాంతకం కాకపోయినా అంగవైకల్యానికి దారి తీస్తుంది. ముందుగానే గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా అరికట్టడం సులువు అవుతుందని భావిస్తున్నారు. వ్యాధి అరికట్టడం చాలా సులువుగా మారినా వారి పట్ల ప్రజల్లో, కుటుంబ సభ్యుల్లో చిన్నచూపు ఉంటోంది.
జిల్లాలో 479 సర్వే బృందాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లాలో 5 లక్షల 52 వేల జనాభా ఉంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 4.35 లక్షల జనాభా ఉంది. వీటి ఆధారంగా 14 రోజులపాటు 479 బృందాలుగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేయనున్నారు. బృందాల్లో ఆశావర్కర్లు సర్వే చేయనుండగా ఒక్కో బృందాన్ని ఏఎన్‌ఎంలు పర్యవేక్షించనున్నారు. మొత్తం 87 ఆరోగ్య ఉప కేంద్రాలు, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాల పరిధిలో 15 మంది నోడల్ సూపర్‌వైజర్లు పర్యవేక్షిస్తారు. దీంతోపాటు 20 వేల కరపత్రాలు, 331 బ్యానర్ల ద్వారా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 206 మంది బాధితులు
జిల్లాలో గతంలో కంటే కుష్ఠు వ్యాధి తగ్గుతోంది. ప్రస్తుతం 206 మంది బాధితులు ఉన్నారు. గత సంవత్సరం 15 కేసులు రాగా, ఈ సంవత్సరం తాజాగా 18 మందిని గుర్తించారు. వీరికి అవసరమైన మందులు ఇచ్చారు. శాశ్వత అంగవైకల్యానికి గురికాకుండా అవసరమైన వారికి హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స కూడా చేయిస్తున్నారు. శస్త్ర చికిత్సల అనంతరం వారికి పౌష్టికాహారం, ఇతర అవసరాలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పరంగా పింఛన్లతోపాటు ఎంసీఆర్ చెప్పులు, మందుల కిట్లు పంపిణీ చేస్తున్నారు.
లెప్రసీకి కారణాలు.. లక్షణాలు
కుష్ఠు వ్యాది మైక్రో బాక్టీరియం లేప్రే అనే బాక్టీరియాతో వస్తుంది. ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు. వ్యాధిక్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత రెండు నుంచి ఏడు రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడుతాయి. ఈ వ్యాధితో చర్మం, మ్యూకస్ మెంబ్రేన్‌నరాలు రోగానికి గురవుతాయి. రోగ నిరోధకశక్తిని బట్టి లక్షణాలు మారుతుంటాయి. రోగి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే దుమ్ము ధూళి, ఊపిరిద్వారా లోపలికి చేరుకొని రోగ నిరోధకశక్తి తగ్గుతుంది. వ్యాధిని చాలా ముందుగా తేలికగా తెలుసుకోవచ్చు. రంగు తగ్గిన మచ్చలు, చుట్టూ ఉన్న చర్మంతో పోలిస్తే మచ్చలు పాలిపోయినట్లు ఉంటాయి. మచ్చలు గుండ్రటి ఆకారంలో ఉంటాయి. వేడి, నొప్పి, స్పర్శ తెలియవు. ప్రధానంగా స్పర్శ జ్ఞానం కనిపించదు. చర్మం మీద మచ్చలు ప్రాంతానికి వచ్చే నాడులు వాపు తేలడం, మోకాలి వెలుపల పక్కన, మోచేయి లోతట్టున, మెడలోనూ లావెక్కిన నాడులు తెలుస్తాయి. నాడులు వాయడం జరుగుతుంది. నొప్పి, దురద, పుండ్లు వచ్చి మానకపోవడం, ముఖం మీద చర్మం మందంగా తేలి ఉండడం, కనుబొమ్మలు వెంట్రుకలు రాలిపోవడం, పాదాలు, చేతులు శక్తి హీనమై వంకరలు తిరుగుతుంటాయి. తెల్లమచ్చలు ఉన్నచోట స్కిన్ క్లిప్ పరీక్ష చేసి క్రిములను గుర్తించి వైద్యాన్ని అందిస్తారు. కుష్ఠు లక్షణాలు ఉన్నావారు కంటి విషయంలో, అవయవాలపై జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా సురక్షితమైన మందులను అందిస్తున్నారు.
సకాలంలో గుర్తిస్తే తగ్గించుకోవచ్చు
- డాక్టర్ సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి
కుష్ఠు వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. సకాలంలో గుర్తిస్తే మందులతో సులువుగా తగ్గించుకోవచ్చు. వ్యాధి లక్షణాలను గుర్తించి వారికి మందులు అందించడానికి డిసెంబరు 6 నుంచి సర్వే చేపడుతున్నాం. సర్వేకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తే కుష్ఠును సంపూర్ణంగా నివారించుకోవచ్చు.
Updated Date - 2022-12-04T00:31:47+05:30 IST