ఆపదలో అండగా ‘రైతు బీమా’
ABN, First Publish Date - 2022-12-26T00:51:21+05:30
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలను ఆపత్సమయంలో ఆదుకుంటోంది. పంట సాగుకు సాయమందించడానికి రైతుబంధును అమలు చేస్తూనే విధి వక్రిస్తే రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది.
- చనిపోయిన రైతు కుటుంబాలకు రూ. ఐదు లక్షల సాయం
- నాలుగేళ్లలో 1,810 మంది మృతి
- రూ. 90.5 కోట్ల సాయమందించిన ప్రభుత్వం
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
తెలంగాణ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభించిన రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలను ఆపత్సమయంలో ఆదుకుంటోంది. పంట సాగుకు సాయమందించడానికి రైతుబంధును అమలు చేస్తూనే విధి వక్రిస్తే రైతు కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తు ప్రమాదాల్లోకాని, ఇతరత్రా కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడిన సందర్భాల్లోకాని, వయస్సు మీద పడిన సందర్భాలలో కాని రైతులు మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిది కాకుండా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- 2019లో ఈ పథకం ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 1,810 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున 90 కోట్ల 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
- 2022 సంవత్సరంలో 164 మంది రైతులు మరణించగా ఇప్పటి వరకు 131 మంది కుటుంబాలకు 6 కోట్ల 55 లక్షల ఆర్థిక సహాయం అందింది. మరో 33 బాధిత రైతు కుటుంబాలకు ఇంకా సహాయం అందించాల్సి ఉన్నది.
ఫ 18 నుంచి 59 సంవత్సరాల రైతులకు వర్తింపు
ప్రతి ఆగస్టు 14 నుంచి తర్వాత సంవత్సరం ఆగస్టు 13 వరకు వర్తించేలా రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీ వరకు 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులను ఈ పథకం కిందికి తీసుకుంటారు. జూన్‌లోనే కటాఫ్ తేదీ పరిధిలోకి వచ్చే రైతుల పేర్లు నమోదు చేసుకోవడంతోపాటు మరణించిన వారి పేర్లను, 59 సంవత్సరాలు దాటిన వారి పేర్లను తొలగిస్తారు.
ఫ రైతుబీమా పరిధిలో 1,07,447 మంది
జిల్లాలో ప్రస్తుత సంవత్సరం రైతుబీమా పథకం పరిధిలో 1,07,447 మంది రైతులు ఉన్నారు. రైతు బంధు పథకం సాయం పొందడానికి అర్హులైన రైతుల సంఖ్య 1,93,330 ఉండగా వయో పరిమితి కారణమే కాకుండా వ్యవసాయ భూములను రెండు, మూడు గుంటల చొప్పున ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసినవారు ఈ బీమా పథకం పరిధిలోకి రావడం లేదు. దీంతో జిల్లాలో బీమా పథకం కింద అర్హత పొందిన వారు 1,07,447 మంది ఉన్నారు. ప్రభుత్వం రైతులకు బీమా ప్రీమియంగా ఒక్కొక్కరికి సుమారు 3,900 రూపాయలు చెల్లిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలోని కరీంనగర్ రూరల్ మండలంలో 5,339 మంది రైతులు, కొత్తపల్లి మండలంలో 3,759 మంది, ఇల్లందకుంటలో 6,578, హుజూరాబాద్‌లో 7,887, జమ్మికుంటలో 7,438, సైదాపూర్‌లో 8,729, వీణవంకలో 8,194, చొప్పదండిలో 6,987, రామడుగులో 7,378, గంగాధరలో 8,107, చిగురుమామిడిలో 7,628, గన్నేరువరంలో 3,931, మానకొండూర్‌లో 11,245, శంకరపట్నంలో 7,752, తిమ్మాపూర్‌లో 6,485 మంది రైతులు రైతు బీమా పథకం పరిధిలో నమోదై ఉన్నారు. 2019 సంవత్సరంలో 92,495 మంది రైతులు ఈ పథకం కింద నమోదు కాగా 472 మంది మరణించారు. వీరి కుటుంబాలకు 23 కోట్ల 60 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందింది. 2020లో 95,635 మంది రైతులు నమోదు కాగా 736 మంది మరణించారు. వీరి కుటుంబాలకు 36 కోట్ల 70 లక్షల రూపాయల సాయం అందింది. 2021లో 1,02,565 మంది రైతులు నమోదు కాగా 477 మంది, 2022లో 1,07,442 మంది రైతులు ఈ పథకం కింద నమోదు కాగా 164 మంది వివిధ కారణాలతో మరణించారు. 2021లో 23 కోట్ల 65 లక్షల రూపాయలు మృతి చెందిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా అందించగా, 2022లో 131 కుటుంబాలకు 6 కోట్ల 55 లక్షల సాయం అందించారు. మరో 33 కుటుంబాలకు కోటి 65 లక్షల రూపాయల సహాయం అందించాల్సి ఉన్నది. జిల్లాలో సాగునీటి వనరులు పెరగడం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అడపాదడపా పంట నష్టపోయిన సందర్భాలు మినహా రైతులకు పెద్దగా ఇబ్బందికర పరిస్థితులు లేవు. రైతుబంధు సాయం అందించడంతోపాటు ధాన్యం కొనుగోలును కూడా ప్రభుత్వమే చేపడుతున్నది. దీంతో మద్దతు ధరకు గ్యారంటీ ఏర్పడింది. పత్తిపంట సాగు విషయంలో రైతులు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు సాగుతున్నందున ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తగ్గిపోయాయి. 2020 సంవత్సరంలో మాత్రం ఎక్కువ మంది రైతులు వివిధ కారణాలతో చనిపోయారు.
Updated Date - 2022-12-26T00:51:30+05:30 IST