డీఎంఎఫ్‌టీ నిధులు జిల్లాలకే..
ABN, First Publish Date - 2022-02-06T05:40:50+05:30
సింగరేణి గనులు, తదితర ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్(డీఎంఎఫ్‌టీ)కి నిధులు జమవుతాయి.
- అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కార్యాలయం
- గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
సింగరేణి గనులు, తదితర ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్(డీఎంఎఫ్‌టీ)కి నిధులు జమవుతాయి. ఇకనుంచి ఆ నిధులను ఆయా జిల్లాల్లోనే వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఇటీవల ఆయా జిల్లాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సింగరేణి గనులు విస్తరించి ఉన్న జిల్లాల్లో డీఎంఎఫ్‌టీకి జమవుతున్న నిధులను ఉమ్మడి జిల్లాలకు పంపిణీ చేశారు. దీనిపై ఆయా జిల్లాల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత కూడా తమ జిల్లాల్లోగల ఖనిజ వనరుల ద్వారా సీనరేజీ రూపంలో డీఎంఎఫ్‌టీకి సమకూరే నిధులను ఇతర జిల్లాలకు ఎలా పంపిణీ చేస్తారనే విమర్శలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. దీంతో సీఎం కేసీఆర్ సింగరేణి గనులు గల జిల్లాల్లో డీఎంఎఫ్‌టీకి జమవుతున్న నిధులను ఆయా జిల్లాల్లోనే సద్వినియోగం చేసుకోవాలని కీలక నిర్ణయం తీసుకున్నారు.
30 శాతం సొమ్ము జమ..
బొగ్గు, సిమెంట్, ఇసుక, గ్రానైట్ వంటి ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి నిర్వాహకులు సీనరేజీ పన్నులను చెల్లిస్తున్నారు. ఈ సొమ్ము నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరుతున్నది. 2014లో కేంద్ర ప్రభుత్వం ఖనిజ వనరుల నిర్వహణ ద్వారా ప్రభుత్వాలకు జమయ్యే నిధుల్లో 30 శాతం సొమ్మును డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్టు ఫండ్ (డీఎంఎఫ్‌టీ) జమ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విధంగా జమయ్యే డబ్బులను ఖనిజ వనరుల తరలింపు ద్వారా ప్రభావితానికి గురవుతున్న ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులకు వెచ్చించాలని పేర్కొన్నారు. 2015 జనవరి 1 నుంచి డీఎంఎఫ్‌టీని అమల్లోకి తీసుకవచ్చారు. రాష్ట్రంలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాను కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలుగా విభజించారు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం, గోదావరిఖని, యైుటింక్లయిన్ కాలనీ ప్రాంతాల్లో సింగరేణి గనులు విస్తరించగా, బసంత్‌నగర్‌లో సిమెంట్ పరిశ్రమ, కంకర క్వారీలు, క్రషర్లు, ఇసుక రీచుల ద్వారా ఆదాయం సమకూరుతున్నది. 2015 నుంచి 2018 నాటికి డీఎంఎఫ్‌టీకి సుమారు 700 కోట్ల రూపాయలు జమయ్యాయి. వాస్తవానికి ఈ నిధులన్నింటినీ పెద్దపల్లి జిల్లాలోనే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల్లోకి ఇతర జిల్లాలకు కూడా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు పెద్దపల్లి జిల్లాలో 1119 పనులకు 272 కోట్ల 56 లక్షల రూపాయలను కేటాయించారు. కరీంనగర్ జిల్లాలో 2121 పనులకు 130 కోట్ల 6 లక్షలు, జగిత్యాల జిల్లాలో 2724 పనులకు 114 కోట్ల 78 లక్షలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 849 పనులకు 54 కోట్ల 56 లక్షలు, సిద్ధిపేటలో కలిసిన పాత జిల్లాల్లోని పలు గ్రామాల్లో 309 పనులకు 15 కోట్ల 54 లక్షలు, వరంగల్ అర్బన్ జిల్లాలో కలిసిన గ్రామాల్లో 306 పనులకు 16 కోట్ల 44 లక్షల రూపాయల నిధులను కేటాయించారు. అంతేగాకుండా సీఎం సహాయ నిధికి కూడా కొన్ని నిధులను మళ్లించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పనులను మంజూరు చేశారు. ఇప్పటికీ ఈ పనులు నడుస్తున్నాయి. 2018 తర్వాత కూడా డీఎంఎఫ్‌టీకి మరిన్ని నిధులు జమయ్యాయి. ఇందులో సింగరేణి సంస్థ నుంచి 122 కోట్ల రూపాయల వరకు నేరుగా సీఎం సహాయ నిధికి జమ అయినట్లు సమాచారం. గడిచిన మూడేళ్లలో డీఎంఎఫ్‌టీకి జమ అయిన నిధులను ఆయా జిల్లాల్లోనే వెచ్చించేందుకు అవకాశం కల్పించారు. సింగరేణి గనులు విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీఎంఎఫ్‌టీ నిధులను వారివారి జిల్లాల్లోనే ఖర్చు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. దీంతో జిల్లాల్లో గల సింగరేణి ప్రభావిత గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశాలున్నాయి.
Updated Date - 2022-02-06T05:40:50+05:30 IST