ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌ను పూర్తి చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T00:45:43+05:30
ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, డిసెంబరు 14: ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్‌లో ఎన్నికల అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి.రవికిరణ్‌తో కలిసి కలెక్టర్‌లు, అదనపు కలెక్టర్‌లతో ఓటరు నమోదు, సవరణలకు సంబంధించిన ఫారం 6, 7, 8 ఆన్‌లైన్ డేటా ఎంట్రీ, ఓటర్ జాబితా రూపకల్పనపై వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో వచ్చిన దరఖాస్తుల డిజిటలైజేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతీ జిల్లాలో నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితా సవరణ కోసం వచ్చిన దరఖాస్తులను డిసెంబరు 26లోగా పరిశీలించి డిస్పోజ్ చేయాలని, అర్హత కల్గిన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని సూచించారు. ఉపాధి దృష్ట్యా కొంత మంది పట్టణాల్లో జీవిస్తున్నా గ్రామాల్లో వారికి ఓటు హక్కు ఉంటుందని, రెండు ప్రాంతాల్లో ఓటరుగా నమోదు చేసుకున్న వివరాలు పరిశీలించి, అధికారులతో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయని, అధిక సంఖ్యలో ఓటరు నమోదు ప్రక్రియ జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం పకడ్బందీగా ఓటరు జాబితా సిద్ధం చేస్తే, ఎన్నికల సమయంలో ప్రక్రియ సజావుగా జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఉన్న జనాభాకు ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో జెండర్ నిష్పత్తి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఉండే విధంగా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 18 సంవత్సరాల నిండిన దివ్యాంగులందరికీ ఓటు హక్కు కల్పించాలని, పోలింగ్ కేంద్రాల వారిగా మ్యాపింగ్ చేయాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల నిండిన ఓటర్ల సంఖ్య 6149 ఉందని, క్షేత్రస్థాయిలో సదరు వివరాలను మరోసారి ధ్రువీకరించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు టి.శ్రీనివాస్‌రావు, పవన్ కుమార్, ఎన్నికల విభాగం ఉప తహసీల్దార్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు
Updated Date - 2022-12-15T00:46:17+05:30 IST