ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెలరేగుతున్న భూ మాఫియా

ABN, First Publish Date - 2022-10-17T05:33:05+05:30

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో నివేశన, వాణిజ్య స్థలాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఖాళీ స్థలం కనిపిస్తే అంతే..

- వివాదం లేకున్నా సృష్టించడమే..

- అక్రమార్కులకు అధికార అండదండలు

- లబోదిబోమంటున్న భూమి యజమానులు 

కరీంనగర్‌ క్రైం, అక్టోబరు 16: కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో నివేశన, వాణిజ్య స్థలాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. జిల్లా విస్తీర్ణంలో సగానికిపైగా శాతవాహన అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సుడా) పరిధిలోకి చేర్చడంతో నివేశన స్థలాలతోపాటు వ్యవసాయ భూముల ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. దీంతో ల్యాండ్‌ మాఫియా కళ్లు ఖాళీ స్థలాలపై పడ్డాయి. కరీంనగర్‌తోపాటు నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల డివిజన్లలో ఖాళీ స్థలాలు కనిపిస్తే చాలు ఎలాగైనా వాటిని కబ్జా చేయాలనే ఆలోచనతో భూ మాఫియా ఆక్రమణలపై దృష్టి సారిస్తోంది. ప్రజాప్రతినిధుల అండదండలతోనే భూమాఫియా పెట్రోగిపోతుండడంతో నిత్యం ఏదో ఒక చోట స్థలయజమానులు తమ ప్లాట్లను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారో లేక ఇల్లు కట్టుకోనివ్వడం లేదనో, తన ప్లాట్లలోకి చొచ్చుకొని వచ్చి తనకు తెలియకుండా ప్లాట్‌ను చదను చేసి ఆక్రమించారనో ఫిర్యాదులతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో లోకల్‌ లీడర్లే మాఫియాగా మారుతుండడంతో పోలీసులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

- శివారు కాలనీలపై దృష్టి

కరీంనగర్‌ శివారు ప్రాంతాల్లో భూమి విలువ పెరగడంతో ఆ డిమాండ్‌ను తమకు అనుకూలంగా మార్చుకుని లాభాలు పొందాలని కబ్జాదారుల కన్ను శివారు కాలనీల్లోని విలువైన భూములపై పడింది. ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు తమ పిల్లల భవిష్యత్తుకోసం, చదువుల కోసం, పెళ్లిళ్ల కోసం ఉపయోగపడుతుందనని ఎంతో కొంత భూమి కొనుగోలుచేసి భవిష్యత్తు అవసరాల కోసం పెట్టుకోగా ఆ  భూములపై కబ్జాదారులు కన్ను పడింది. తమకున్న పరిచయాలతో, అనుభవంతో తప్పుడు కాగితాలు సృష్టించి దొంగ రిజిస్ట్రేషన్లను చేయించుకుని ఆ భూములను కబ్జా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి వివాదాలు లేని స్థలాలకు కూడా కొన్ని స్థానిక ముఠాలు కావాలని వివాదాలను సృష్టించి వారి వద్దకు వచ్చేలా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మరికొన్ని సంఘటనల్లో బెదిరించి బలవతంగా 10 లక్షల నుంచి 20 లక్షలు తీసుకుని సెటిల్‌మెంట్‌ చేస్తున్నారు.  ఈ దందాల్లో అధికారపార్టీ లీడర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యజమానులను, భూకబ్జాదారులు ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటనలు అక్కడక్కడ బయటకు వస్తుండగా చాలా మంది లోలోపల ఉంచుకుని అంతర్మథనం చెందుతున్నారు. 

 - అధికార పార్టీ నాయకులపైనే ఆరోపణలు

భగత్‌నగర్‌లో ఓ సింగరేణి రిటైర్డు ఉద్యోగి స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా ఆయనకు మద్దతు ఇచ్చిన పొరిగింటి వ్యక్తిపై అక్రమ కేసు పెట్టించారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి హస్తం ఉందని తెలియడంతో  ప్రజలు ఇక తమ ఆస్తులకు రక్షణ ఎవరు కల్పిస్తారని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన సీతారాంపూర్‌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మూడు ఇళ్లను మున్సిపల్‌ అనుమతి తీసుకొని నిర్మించుకుంటుండగా స్లాబ్‌ దశలోనే ఆ డివిజన్‌ కార్పొరేటర్‌, ఆయన అనుచరులు అర్ధరాత్రి ఎక్స్‌కావేటర్‌తో కూల్చివేసిన ఘటన కలకలం రేపింది. ఇలాంటి సంఘటనలు నగరంలో కోకోల్లలుగా జరుగుతుండడం శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పలువురు అంటున్నారు. సీతారాంపూర్‌లో కార్పొరేటర్‌, ఆయన అనుచరుల దౌర్జన్యం, అరాచకం పెరిగిందని, ఇళ్లు నిర్మించుకుంటే వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నిర్మాణాలను అడ్డుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉండాల్సిన ప్రజాప్రతినిధే ఏకంగా చట్టాన్ని చేతులోకి తీసుకుని కూల్చివేతకు పాల్పడిన ఘటనపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. కాని అతడిని అరెస్టు చేయకుండా వదిలేశారని బాధితులు అంటున్నారు. 2019 ఏప్రిల్‌ 25న  కరీంనగర్‌లోని రామచంద్రాపూర్‌ కాలనీలో సర్వే నంబర్‌ 965లో రెండు గుంటల స్థలంలో యజమాని శ్రీనివాస్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతోకలిసి నిర్మాణ పనులు చేస్తుండగా నలుగురు వ్యక్తులు అతడిపై దాడి చేశారు.  అడ్డువచ్చిన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు నిందితులను వెంటనే అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం 2019 మే 7న నిందితులపై పీడీ యాక్టు అమలు చేసి కటకటాల్లోకి పంపించారు. ఆ తరువాత కొంతకాలంపాటు భూ మాఫియా ఆగడాలు కొంత తగ్గినప్పటికీ ఇటీవల మళ్లీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో భూకబ్జాలు, ఆక్రమణలు, భూవివాదాలకు సంబంధించిన కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. అయినా కబ్జాదారులు భయపడకుండా అధికారపార్టీ అండ చూసుకుని విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేస్తున్నారని, వీరి ఆటకట్టించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యానగర్‌, భగత్‌నగర్‌, రాంచంద్రాపూర్‌ కాలనీ, హౌసింగ్‌బోర్డ్‌ కాలనీ, రేకుర్తి, తీగలగుట్టపల్లి, కొత్తపల్లి, చింతకుంట, సీతారాంపూర్‌, బొమ్మకల్‌, మల్కాపూర్‌, లక్ష్మీపూర్‌ తదితర ప్రాంతాల్లో భూ వివాదాలు అధికమయ్యాయి. 

- నకిలీ పత్రాలతో వివాదాలు

ఈ లాండ్‌ మాఫియా ఖాళీ స్థలాలను, చిన్నపాటి వివాదం ఉన్న స్థలాలను గుర్తించి వాటికి సంబంధించిన పత్రాలను చూసి నకిలీ పత్రాలను తయారు చేస్తుంటారు. అందుకు గాను నకిలీ స్టాంపులు కూడా తయారు చేస్తున్నారు. ఇటువంటి నేరాలకు పాల్పడిన కొందరిని గతంలో కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి పీడీ యాక్టు కూడా నమోదు చేశారు. ఈ నకిలీ పత్రాల ఆదారంగా కోర్టులో దావా దాఖలు చేసి ఆ భూమిపై వివాదం ఉందంటూ తెరమీదకు తీసుకువస్తారు. అప్పటి నుంచి భూమి యజమానులకు తిప్పలు తప్పవు. ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారిని బెదిరించడం, వారి స్థలంలోనే షెడ్లు నిర్మిస్తారు. వీరి బాధ పడలేక కొందరు భూములను వదులుకుంటున్నారు.

- హత్యలకు దారితీస్తున్న భూ వివాదాలు...

భూ వివాదాలు తీవ్రమైన సందర్భాలలో హత్యలకు దారితీస్తున్నాయి. గతంలో కరీంనగర్‌లో పలు సంఘటనలు జరిగాయి. 2006 నవంబరులో నగర శివారులోని తీగలగుట్టపల్లెకు చెందిన మూల కిషన్‌రెడ్డిని ల్యాండ్‌ మాఫియాకు సంబంధించిన కిరాయి ముఠా తపంచాతో అతని ఇంటి వద్దనే కాల్చి చంపింది. 2010లో ఆదర్శనగర్‌ ప్రాంతానికి చెందిన షౌకత్‌ అలీని దుండగులు దారి కాచి గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఐదేళ్ల కిందట మేన్నేని కిషన్‌రావును ల్యాండ్‌ మాఫియా హత్య చేసింది. ఆ తరువాత కూడా పలు సంఘటనల్లో భూమాఫియా ముఠాలు చాలా మందిపై దాడులు చేశాయి. 

Updated Date - 2022-10-17T05:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising