నిధులివ్వకపోతే బీజేపీలో చేరతాం
ABN, First Publish Date - 2022-10-17T09:40:46+05:30
మునుగోడు నియోజకవర్గ ఓటర్లు.. మంత్రి, ఎమ్మెల్యే, నాయకుడు అని ఎవరినీ చూడడం లేదు.
- టీఆర్‌ఎస్ నేతలతో గౌడ కుల పెద్దల వాగ్వాదం
- సముదాయించిన మంత్రి మల్లారెడ్డి
చౌటుప్పల్ రూరల్, అక్టోబరు 16: మునుగోడు నియోజకవర్గ ఓటర్లు.. మంత్రి, ఎమ్మెల్యే, నాయకుడు అని ఎవరినీ చూడడం లేదు. ఏమాత్రం అసౌకర్యం జరిగినా, తక్కువగా చూసినా నాయకులకు ముచ్చెమటలు పట్టించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో మంత్రి మల్లారెడ్డి గౌడ కుల పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘‘గౌడ కమ్యూనిటీ హాల్, కాటమయ్య గుడి అభివృద్ధికి నిధులు కావాలి. మా సమస్యల్ని పట్టించుకోకపోతే మేం బీజేపీలో చేరుతాం’’ అని గౌడ కులపెద్దలు స్పష్టం చేశారు. బుధవారం సమావేశమై నిధుల విషయమై మాట్లాడతామంటూ మంత్రి పేర్కొనగా.. ఇప్పుడే మాట్లాడాలంటూ గౌడ కుల పెద్దలు పట్టుబట్టారు. ఒకరిద్దరు టీఆర్‌ఎస్ నాయకులు మధ్యలో జోక్యం చేసుకొని రెండు రోజులు ఆగలేరా.. అని గౌడ కులస్థులను ఉద్దేశించి అన్నారు. ఆ టీఆర్‌ఎస్ నాయకులపై గౌడ కుల పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి మల్లారెడ్డి ఎంత సముదాయించినా ఆగకుండా, బీజేపీలో చేరతామని హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత శాంతించిన వారు మంత్రి మల్లారెడ్డితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌడ కులస్థులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
Updated Date - 2022-10-17T09:40:46+05:30 IST