హైదరాబాద్ బాలికకు 2.7కోట్ల స్కాలర్ షిప్
ABN, First Publish Date - 2022-07-18T00:14:32+05:30
హైదరాబాద్: హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన శ్రీయ సాయి లక్కప్రగడ (18) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ వెల్లెస్లీ కాలేజీ ఏకంగా 2.7 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది.
హైదరాబాద్: హైదరాబాద్ మల్కాజ్‌గిరికి చెందిన శ్రీయా లక్కాప్రగడ (18) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ వెల్లెస్లీ కాలేజీ ఏకంగా 2.7 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసింది. అమెరికా మసాచుసెట్స్‌లోని వెల్లెస్లీ కాలేజీలో 4 ఏళ్ల బ్యాచిలర్ డిగ్రీ( కంప్యూటర్ సైన్స్, సైకాలజీ) కోర్సులో అడ్మిషన్‌తో పాటు ఈ స్కాలర్‌షిప్‌ను ప్రకటించింది. అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు హిల్లరీ క్లింటన్ ఒకప్పుడు ఇదే కాలేజీలో చదువుకున్నారు. తనకు డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ అన్ని విధాలా సహకరించిందని శ్రీయా లక్కాప్రగడ తెలిపారు. డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ సీఈఓ శరద్ వివేక్ సాగర్ తనకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు తగిన విధంగా ప్రోత్సాహాన్నందించారని శ్రీయా చెప్పారు. పదోతరగతి వరకూ సైనిక్‌పురిలోని భారతీయ విద్యాభవన్‌లో, ఇంటర్మీడియట్ డెల్టా కాలేజీలో చదువుకున్నానని శ్రీయా తెలిపారు. రామకృష్ణ మఠం ప్రభావం కూడా తనపై ఉందన్నారు.
వంద మంది సరైన యువకులు ముందుకొస్తే తాను దేశ రాతనే మారుస్తానన్న స్వామి వివేకానంద స్ఫూర్తితో గత 14 సంవత్సరాలుగా రాబోయే తరాల నాయకులను సిద్ధం చేయడమే లక్ష్యంగా తమ డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ పనిచేస్తోందని శరద్ వివేక్ సాగర్ తెలిపారు. శ్రీయా లక్కాప్రగడ యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని ఆయన చెప్పారు. తమ సంస్థ ఇచ్చిన శిక్షణతో ఎంతో మంది కొలంబియా, యేల్ యూనివర్శిటీ, జార్జి టౌన్, టఫ్ట్స్, కేస్ వెస్టర్న్, నార్త్‌వెస్టర్న్, యూనివర్శిటీ ఆఫ్ టొరంటో, బోస్టన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్, తదితర ప్రపంచ ప్రఖ్యాత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందారని శరద్ వివేక్ సాగర్ చెప్పారు.
గత ఏడాది తమ డెక్స్‌టెరిటీ గ్లోబల్ సంస్థ ద్వారా తెలంగాణాకు చెందిన శ్వేతా రెడ్డి(17) అనే విద్యార్థినికి అమెరికాలోని ప్రముఖ లాఫాయేట్ కాలేజీ ఏకంగా 2 కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌ను ఆఫర్ చేసిన విషయాన్ని శరద్ వివేక్ సాగర్ గుర్తు చేశారు.
Updated Date - 2022-07-18T00:14:32+05:30 IST