అయ్యప్పపై అసభ్య వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-12-31T04:37:05+05:30
కోట్లాదిమంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని భారత నాస్తిక సమాజానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ రాయలేని భాషలో దూషించారు.
రాయలేని భాషలో దూషించిన నాస్తిక సంఘం అధ్యక్షుడు నరేశ్
అయ్యప్ప పుట్టుకపై అభ్యంతరకర పదజాలం
అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ఆగ్రహం
వివిధ జిల్లాల్లో ధర్నాలు.. పోలీసులకు ఫిర్యాదులు
పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్
అరెస్టు చేయకపోవడం చేతకానితనమే: సంజయ్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కోట్లాదిమంది హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించే అయ్యప్ప స్వామిని భారత నాస్తిక సమాజానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ రాయలేని భాషలో దూషించారు. అయ్యప్ప పుట్టుకపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈనెల 19న వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం రావుల్‌పల్లిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ, జాతర నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బైరి నరేశ్ మాట్లాడుతూ, ‘అజ్ఞానాన్ని, అంధకారాన్ని మన పిల్లల మెదళ్లలో పెట్టి ఒకడు రామరాజ్యం అంటాడు. ఒకడు జై శ్రీరాం అంటాడు. ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యప్ప చరిత్ర చదవండి’ అంటూ అయ్యప్ప స్వామి పుట్టుకపై అశ్లీల, అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. వాటికి సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నరేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ అయ్యప్ప భక్తులు, బీజేపీ, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్, హిందూ సంఘాల నాయకులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు చేశారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో రాస్తారోకోలు, బైక్ ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. హిందూ దేవతలను ఘోరంగా దూషించి, అవమానించిన బైరి నరేశ్‌పై పీడీ యాక్టు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వివిధ జిల్లాల్లో కలెక్టరేట్లు, పోలీసు స్టేషన్లకు ర్యాలీలుగా వెళ్లి.. అతనిని తక్షణమే అరెస్టు చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, పోలీసులకు పెద్దఎత్తున ఫిర్యాదులు చేశారు. అయ్యప్ప పుట్టుకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్లో డిమాండ్ చేశారు. ‘‘తాను నిజమైన హిందువునని సీఎం కేసీఆర్ చెప్పుకొంటారు.
ఆయన హిందుత్వ వాదనలు నిజమైతే.. కొడంగల్‌లో విష్ణువు, శివుడు, అయ్యప్ప స్వాములకు జరిగిన అవమానాలపై ఇప్పటి వరకూ ఎలాంటిచర్యలు తీసుకున్నారు? తెలంగాణలో హిందూ దేవుళ్లను ఎవరైనా దూషించవచ్చు. బహిష్కరించవచ్చు. ఎందుకంటే, అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా దైవ దూషణను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నారు’’ అని మండిపడ్డారు. సీతమ్మ దేవతను అవమానించిన మునవర్ ఫరూఖీకి ప్రభుత్వం భద్రత కల్పించి సభ నిర్వహించుకునేందుకు అనుమతించిందని గుర్తు చేశారు. ఇప్పటి దాకా ఆయనను అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ చేతకానితనమేనన్నారు. హిందువులే రోడ్లపైకి వచ్చి ఆ వ్యక్తిని పట్టుకునే అవకాశాన్ని పోలీసులు ఇవ్వవద్దని అన్నారు. హిందూ ధర్మాన్ని కించపరచడం, దేవతలను దూషించడం ఇటీవల కొందరికి ఫ్యాషన్‌గా మారిందని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోకపోవడం వల్లే రోజుకొకరు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను గాయపరిస్తే ఇప్పటిదాకా స్పందించకుండా సీఎం కేసీఆర్ ఏం ఘనకార్యం వెలగబెడుతున్నారని నిలదీశారు. పవిత్రమైన హిందూ దేవుళ్లను దూషించిన నరేశ్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని వీహెచ్‌పీ డిమాండ్ చేసింది. నాస్తికుల పేరిట సభలు, సమావేశాలు పెట్టి, హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిపై కమ్యూనల్ కేసులు పెట్టి పీడీ యాక్టు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
అయ్యప్ప స్వాముల ధర్నా ఉద్రిక్తం
అయ్యప్ప స్వామిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని అయ్యప్ప స్వాములు చేస్తున్న ధర్నా ఉద్రిక్తంగా మారింది. వారి ధర్నాను చిత్రీకరిస్తున్న నాస్తిక సమాజం సభ్యుడిపై అయ్యప్ప స్వాములు దాడి చేశారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో శుక్రవారం చోటుచేసుకుంది. నరేశ్ అసభ్య వ్యాఖ్యలకు నిరసనగా కోస్గిలో ధర్నా చేస్తుండగా నరేశ్ అనుచరుడు, గుండుమాల్‌కు చెందిన బాల్‌రాజ్ వీడియో తీయడం మొదలుపెట్టాడు. కోపోద్రిక్తులైన అయ్యప్ప మాలధారులు, స్థానికులు వెంబడించి బాల్‌రాజ్‌పై దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అయ్యప్ప మాలధారులను నిలువరించి, బాల్‌రాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
కేసు పెట్టాం: ఎస్పీ కోటిరెడ్డి
అయ్యప్ప స్వామి, ఇతర హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన బైరి నరేశ్‌పై కేసు నమోదు చేశామని, చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. కొడంగల్ పోలీసు స్టేషన్‌లో 153-ఏ, 295-ఏ, 298, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు (ఎఫ్‌ఐఆర్ 185/2022) నమోదైనట్లు చెప్పారు. అతని ఆచూకీ ఇప్పటి వరకూ దొరకలేదని, నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కాగా, బండి సంజయ్ ట్విటర్లో చేసిన డిమాండ్‌కు కూడా ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. కేసు నమోదు చేశామని, నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుంటామని రీట్వీట్ చేశారు.
Updated Date - 2022-12-31T04:37:06+05:30 IST