Revanth Reddy: రేవంత్ పాదయాత్ర భద్రాచలం నుంచి!
ABN, First Publish Date - 2022-12-31T03:19:22+05:30
‘హాత్‌సే హాత్ జోడో’ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చే నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి..
26న ప్రారంభం.. జూన్ 2న ముగింపు
యాత్ర, ధరణి తదితర అంశాలపై అవగాహన కోసం జనవరి 4న హైదరాబాద్‌లో శిక్షణ కార్యక్రమాలు
పాల్గొననున్న టీపీసీసీ కార్యవర్గం, డీసీసీ చీఫ్‌లు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘హాత్‌సే హాత్ జోడో’ కార్యక్రమంలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వచ్చే నెల 26న భద్రాచలంలోని రాములవారి సన్నిధి నుంచి తన పాదయాత్రను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 99 రూరల్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న పాదయాత్రను భద్రాచలం నుంచి ప్రారంభించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో జూన్ 2 వరకు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పాదయాత్ర కోసం రేవంత్ సన్నాహాలు చేసుకుంటున్నా.. ఏదో ఒక అవాంతరంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా జనవరి 26 నుంచి రెండు నెలలపాటు దేశవ్యాప్తంగా ‘హాత్‌సే హాత్ జోడో’ కార్యక్రమాన్ని ఏఐసీసీ తలపెట్టింది. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ పాదయాత్రలు నిర్వహించాలని సూచించింది.
2023లో ఎన్నికలు ఉన్న రాష్ట్రాల్లో పాదయాత్రలను పొడిగించుకోవచ్చనీ స్పష్టం చేసింది. తెలంగాణలోనూ వచ్చే ఏడాదిలో ఎన్నికలున్న నేపథ్యంలో జనవరి 26న ప్రారంభించనున్న పాదయాత్రను జూన్ 2 వరకూ రేవంత్ కొనసాగించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పాదయాత్రను రాష్ట్రంలోని ఏదో ఒక దేవస్థానం నుంచి ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్న రేవంత్‌రెడ్డి.. భద్రాచలంను ఎంచుకోవాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. భద్రాచలంలో ప్రారంభించి గోదావరి బెల్ట్ మీదుగా రాష్ట్రం మొత్తం చుట్టేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. పాదయాత్రకు సంబంధించిన షెడ్యూల్‌పై రేవంత్‌రెడ్డి స్వయంగా కసరత్తు చేస్తున్నారు. కాగా హాత్‌సే హాత్ జోడో యాత్ర, ధరణి తదితర అంశాలపైన టీపీసీసీ విస్తృత కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులకు అవగాహన కోసం జనవరి 4న హైదరాబాద్‌లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమాల నాటికి రేవంత్ పాదయాత్ర రూట్ మ్యాప్‌పై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-12-31T07:15:13+05:30 IST