భూములిచ్చిన రైతులకు ప్లాట్లు
ABN, First Publish Date - 2022-12-15T00:51:10+05:30
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు, రాగన్నగూడ మన్నెగూడలో హెచ్ఎండీఏకు భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్లను కేటాయించారు. అందులో భాగంగా బుధవారం తుర్కయంజాల్‌లోని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో లాటరీ ద్వారా ప్లాట్ల నంబర్లను కేటాయించారు. స్వయంగా లబ్ధిదారులే తమ స్వహస్తాలతో లాటరీ తీసి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
హయత్‌నగర్, డిసెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు, రాగన్నగూడ మన్నెగూడలో హెచ్ఎండీఏకు భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన లేఅవుట్లో ప్లాట్లను కేటాయించారు. అందులో భాగంగా బుధవారం తుర్కయంజాల్‌లోని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కార్యాలయంలో లాటరీ ద్వారా ప్లాట్ల నంబర్లను కేటాయించారు. స్వయంగా లబ్ధిదారులే తమ స్వహస్తాలతో లాటరీ తీసి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ సందర్భంగా వారికి వచ్చిన నంబర్‌ను లేఅవుట్లో కేటాయించారు. దాదాపు 100 మంది లబ్ధిదారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ అనితారెడ్డిలు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి లాటరీ పద్ధతిలో నంబర్లను తీసి లబ్ధిదారులకు కేటాయించారు. మునగనూర్‌లోని ప్రభుత్వ భూమి సర్వేనంబర్ 120లోని 63 ఎకరాలలో కబ్జాలో ఉన్న 20మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 500 గజాల ప్లాట్లను కేటాయించారు. రాగన్నగూడ మన్నెగూడలోని ప్రభుత్వ భూమి సర్వేనంబర్ 27లోని 43 ఎకరాల కబ్జాలో ఉన్న 51 మంది రైతులకు ప్లాట్ల నంబర్లను కేటాయించారు. అర ఎకరం కబ్జా ఉన్న వారికి 200 గజాల ప్లాటు, 1 ఎకరం కబ్జాలో ఉన్న వారికి 400 గజాల ప్లాటును కేటాయించడం జరిగింది. లబ్ధిదారుల ఆధార్ కార్డు, ఫొటోలను అధికారులు తీసుకున్నారు. ఎకరం భూమి కబ్జాలో ఉన్న వారికి వచ్చే రెండు ప్లాట్లను అందరి ఆమోదంతో పక్క పక్కన వచ్చేల కేటాయింపులు చేశారు. దీని వల్ల లబ్ధిదారులు పంచుకునేందుకు వీలుగా ఉంటుందన్నారు. చాలా ప్లాట్లల్లో ఇద్దరు, ముగ్గురు నలుగురు భాగస్వాములు అయి ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో వెంకటాచారి మాట్లాడుతూ ప్లాట్లు పొం దిన లబ్ధిదారులు గొడవలకు వెళ్లకుండా సామరస్యంగా అందరు భాగస్వాములు సమానంగా వాటా తీసుకోవాలన్నారు. అందుకోసమే జాయింట్ పట్టాను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్లాట్లను అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. నిషేధిత జాబితాలో ఇవి ఉండవన్నారు. వారి అవసరాలకు వారు విక్రయించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు చెప్పారు. విలువైన ఈ ప్లాట్లను అమ్ముకోకుండా భద్రంగా ఉంచుకున్నట్లయితే భవిష్యత్‌లో మరింత ఎక్కువ ధర పలుకుతుందన్నారు. సాగుదారులందరిని గుర్తించి వారికి కూడా ప్లాట్లను కేటాయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మునగనూర్ కౌన్సిలర్లు వేముల స్వాతి అమరేందర్‌రెడ్డి, సంగీత మోహన్‌గుప్తా, మర్రి మాధవి మహేందర్‌రెడ్డి, కుంట ఉదయశ్రీ గోపాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, కో- ఆప్షన్ సభ్యుడు పోరెడ్డి నర్సింహారెడ్డి, మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T00:51:11+05:30 IST