రిమాండ్‌కు నవీన్‌రెడ్డి
ABN, First Publish Date - 2022-12-15T03:24:09+05:30
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు .....
నేరాన్ని అంగీకరించాడన్న పోలీసులు
వైశాలి కిడ్నాప్ కేసులో 39 మంది అరెస్టు
హైదరాబాద్ సిటీ/ఆదిభట్ల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మన్నెగూడ దంత వైద్యురాలు వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు కొడుదుల నవీన్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సాయంత్రం గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి, బుధవారం సాయంత్రం వరకు విచారణ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని, అతడి నుంచి ఐదు సెల్‌ఫోన్లు స్వాధీం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అలాగే కేసుతో సంబంధం ఉన్న మరో ఐదుగురు.. చంద్రశేఖర్ అలియాస్ చందు, ప్రవీణ్, ప్రకాశ్, యశ్వంత్, మహేశ్‌లను నగరంలోని హస్తినాపూర్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులను కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు ఈ కేసులో 39 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా రూమన్, పవన్ అనే మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నవీన్‌రెడ్డి కస్టడీ కోరుతూ పిటిషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిసింది. అతనిపై మొత్తం 4 కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.
చాకచక్యంగా వ్యవహరించి..
నవీన్‌రెడ్డిని అరెస్టు చేయడంలో పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. తన వద్ద ఉన్న ఫోన్‌లను వాడకపోవడంతో సాంకేతిక సాయంతో అతన్ని గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సాంకేతికత పని చేయని చోట మానవ తెలివిని ప్రయోగించాలన్న పోలీసు ప్రాథమిక సూత్రాన్ని పాటించారు. నవీన్ ఫోన్ లొకేషన్ కూడా నగర శివారు వరకే పరిమితమైంది. కారు కూడా శంషాబాద్ వరకే వెళ్లింది. ఆ తర్వాత అతను ఏమయ్యాడనేది పోలీసులకు సవాల్‌గా మారింది. తప్పించుకోడానికి అతనికి తెలిసిన ప్రాంతాలనే ఎంచుకునే అవకాశాలెక్కువగా ఉంటాయని భావించిన పోలీసులు.. తొలుత ఆ దిశలో స్కెచ్ వేశారు. నవీన్‌రెడ్డి గతంలో తిరిగిన ప్రాంతాల్లో మూడింటిని ఎంపిక చేసుకున్నారు. మూడు బృందాలుగా విడిపోయి విశాఖపట్నం, ఆదిలాబాద్, గోవా వెళ్లారు. గోవాకు వెళ్లిన బృందం నవీన్ గతంలో బస చేసిన హోటల్‌కు వెళ్లారు. అతను అక్కడే ఉన్నట్లు గుర్తించి, ఆదిభట్ల సీఐకి సమాచారం ఇచ్చారు. వెంటనే సీఐ గోవా చేరుకున్నారు. హోటల్ వాళ్లకు అనుమానం రాకుండా బయటే వేచి చూశారు. నవీన్‌రెడ్డి బయటకు వచ్చి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. పోలీసులు కారులో అతన్ని అనుసరించారు. కాండోలిమ్ బీచ్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి తప్పించుకున్న నవీన్.. ఓ బస్సులో బళ్లారి వెళ్లి, అక్కడి నుంచి గోవా చేరినట్లు సమాచారం. అయితే అక్కడ అతనికి డబ్బులు సమకూర్చిన వారెవరు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Updated Date - 2022-12-15T03:24:10+05:30 IST