Naseer Car : నసీర్ కార్దాన్
ABN, First Publish Date - 2022-12-16T00:48:05+05:30
డలు.. పర్యటనలు.. పుస్తక పఠనం.. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి. కానీ, అతడిది మాత్రం అత్యంత ఖరీదైన వ్యాపకం.. లగ్జరీ కార్ల సేకరణ.. వాటిలో ప్రత్యేక డ్రైవ్..
రూ.12 కోట్ల విలువైన కారు కొనుగోలు
ఇప్పటికే అతడి వద్ద పలు లగ్జరీ కార్లు
పాతబస్తీ వ్యాపారి ప్రత్యేకత
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): క్రీడలు.. పర్యటనలు.. పుస్తక పఠనం.. ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి. కానీ, అతడిది మాత్రం అత్యంత ఖరీదైన వ్యాపకం.. లగ్జరీ కార్ల సేకరణ.. వాటిలో ప్రత్యేక డ్రైవ్.. జామ్మని అతడి కార్లు వెళ్తుంటే కళ్లన్నీ అటు వైపే.. వాటి వీడియోలను సోషల్ మీడియాలో ఇలా పెడితే అలా వేలాది వ్యూస్.. ఇంటిని మించిన విశాలమైన ప్రదేశంలో.. హంగులతో షెడ్డు.. ఇదంతా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన నసీర్ ఖాన్ (37) ‘‘కార్’’దాన్. తాజాగా అతడు రూ.12 కోట్ల విలువైన ‘మెక్లారెన్ 765 ఎల్టీ’ని కొన్నాడు. ముంబైలో ఇటీవల తొలి షో రూమ్‌ను తెరిచిన మెక్లారెన్.. 765 ఎల్టీ కారును 3 రోజుల కిందట నసీర్‌కు అందజేసింది.
డ్రైవ్కెళ్తే దద్దరిల్లాల్సిందే..
ప్రముఖ వ్యాపారి కుమారుడు అయిన నసీర్‌ఖాన్ ఫలక్‌నుమాలో ఉంటారు. ప్రధాన రహదారిపై ఓ పెద్ద భవనంలో నివసించే అతడు కారులో బయటకు వస్తే చాలామంది అటువైపే చూస్తారు. తన దగ్గర ఉన్నవాటిలో ఒక్కోసారి ఒక్కో కారుతో డ్రైవ్‌కు వెళ్లడం నసీర్ అలవాటు. కొన్ని సందర్భాల్లో నసీర్, అతడి ఇద్దరు సోదరులు కూడా షికారుకు వెళ్తుంటారు.
ఫలక్‌నుమా చెంతను తాళం అందుకుని
దేశంలోనే ఖరీదైన మెక్లారెన్ 765 ఎల్టీ స్పైడర్ కారును కొనడం మాత్రమే కాదు.. దాని తాళాలను కంపెనీ ప్రతినిధుల చేతుల మీదుగా చార్మినార్ చెంతనున్న ఫలక్‌నుమా ప్యాలెస్ వద్ద అందుకున్నాడు నసీర్‌ఖాన్. కాగా, నసీర్ ఇన్‌స్టా, ట్విట్టర్ ఖాతాల్లో ఖరీదైన కార్ల ఫొటోలు, వీడియోలు చూస్తుంటే మరో ప్రపంచంలో ఉన్నట్లే అనిపిస్తుంది. ‘‘బయటకు వెళ్లేటప్పుడు ఒక్కో సందర్భంలో ఒక్కో కారు తీయడం నా అభిరుచి. ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రాంగణంలో మెక్లారెన్ కారును అందుకోవడం ఎంతో ఆనందాన్నిచ్చింది’’ అంటూ అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ కారు గురించి చేసిన వీడియో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. దేశంలో మెక్లారెన్ 765 ఎల్టీ తొలి కారును కోల్‌కతాకు చెందిన ఓ వ్యాపారి కొన్నాడు.
Updated Date - 2022-12-16T00:48:06+05:30 IST