ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంచేసిన మూసీ

ABN, First Publish Date - 2022-07-28T06:46:39+05:30

జంట జలాశయాల నుంచి భారీ స్థాయిలో వరద చేరడంతో మూసీ ఉప్పొంగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలదిగ్బంధంలో తీర ప్రాంతాలు 

అల్లాడుతున్న శంకర్‌నగర్‌, మూసానగర్‌ బస్తీలు

కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్న ప్రజలు

కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు..

మూసారాంబాగ్‌ బ్రిడ్జి మూసివేత..

అప్రమత్తంగా అధికారులు.. నిరంతరం నిఘా


మూసీ ముంచెత్తడంతో తీర ప్రాంత ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. రక్షణ చర్యల్లో భాగంగా కొందరిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. మూసీ నలువైపులా నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రజల కంట కన్నీళ్లు కారుతున్నాయి. 


హైదరాబాద్‌ సిటీ/ మదీన/ చాదర్‌ఘట్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : జంట జలాశయాల నుంచి భారీ స్థాయిలో వరద చేరడంతో మూసీ ఉప్పొంగుతోంది. ఇళ్లల్లోకి కూడా నీళ్లు చేరడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు.   బహదూర్‌పురా తహసీల్దార్‌ జుబేదాబేగం బస్తీల్లో పర్యటించారు. మూసీ నదిని ఆనుకుని ఉన్న సుమారు 30 కుటుంబాల ప్రజలను రక్షణ చర్యల్లో భాగంగా బలవంతంగా సమీపంలోని ఫంక్షన్‌హాళ్లకు తరలించారు. 

మూసీ పరీవాహక ప్రాంతాలైన చాదర్‌ఘాట్‌లోని మూసానగర్‌, పద్మానగర్‌, ఓల్డ్‌మలక్‌పేటలోని శంకర్‌నగర్‌, వాహేద్‌నగర్‌ బస్తీలను వరద నీరు ముంచేసింది. దీంతో వందల కుటుంబాలు పునారావాస కేంద్రాలకు తరలివెళ్లాయి. ఆయా బస్తీల నుంచి దాదాపు 1300 మందిని కేంద్రాలకు తరలించారు. ముసానగర్‌ బస్తీలో దాదాపు 300 ఇళ్లు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఓల్డ్‌మలక్‌పేట శంకర్‌నగర్‌ బస్తీలోని సుమారు రెండు వందల ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదప్రాంతాల బస్తీవాసులకు పునరావాసకేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్నారు. చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి సమీపంలో మూసీ ఒడ్డున ఉన్న 50 ఇళ్లల్లోని వంట సామగ్రి, గృహాపకరణాలు నీళ్ల పాలయ్యాయి.  మహమూద్‌ నగర్‌, కిషన్‌బాగ్‌లో 20 ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి. ఉస్మానియా సమీపంలోని గ్యారేజీలో సుమారు 200 రిక్షాలు, పలు దేవాలయాలు నీటమునిగాయి. కాగా, చాదర్‌ఘాట్‌ కాజ్‌వే బ్రిడ్జిపై వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో బుధవారం ఉదయం 11.30 గంటల తర్వాత వాహనాల రాకపోకలను అనుమతించారు.  

నిలిచిన విద్యుత్‌, నీటి సరఫరా..

వరదలకు మూసీ పరీవాహక ప్రాంతాల్లో 15కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. శంకర్‌నగర్‌, ముసానగర్‌ బస్తీల్లో ముందు జాగ్రత్త చర్యగా మంగళవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. మంచినీరు కాలుష్యం అయ్యే అవకాశాలు ఉండటంతో నీటి సరఫరా కూడా ఆపేశారు. అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నారు.

ప్రమాదకర స్థాయిలో..

హైదరాబాద్‌ సిటీ, జూలై27 (ఆంధ్రజ్యోతి): ఉస్మాన్‌సాగర్‌ 13 గేట్ల ద్వారా 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్‌ 8 గేట్ల ద్వారా 10,700 క్యూసెక్కుల వరద నీరు బాపూఘాట్‌ సమీపంలోని సంగమం వద్ద జత కలిసింది. దీంతో మూసీనది ప్రమాదకర స్థాయిలో ప్రహహిస్తోంది. హుస్సేనీఆలంలోని శివాలయం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. అఫ్జల్‌గంజ్‌, చాదర్‌ఘాట్‌ వద్ద ఆరు అడుగుల మేర నీటి ప్రవాహం కొనసాగుతోంది. చాదర్‌ఘాట్‌, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా మూసీ వరద చేరడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, జీహెచ్‌ఎంసీ డీఆర్‌ఎఫ్‌ బృందాలు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

అంబర్‌పేట వద్ద ఉధృతం

అంబర్‌పేట, గోల్నాక డివిజన్‌లో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్‌ నుంచి అలీ కేఫ్‌ వైపు ఉన్న బ్రిడ్జిపై నుంచి సుమారు నాలుగు అడుగులకు పైగా మూసీ నీరు పారుతోంది. దీంతో మంగళవారం సాయంత్రం నుంచి రాకపోకలు నిలిపేశారు. 

ఉన్నతాధికారుల అలర్ట్‌

జంట జలాశయాలను 

సందర్శించిన సీపీ, వాటర్‌బోర్డు ఎండీ 

హైదరాబాద్‌ సిటీ/నార్సింగ్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): వరదల నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. జంట జలాశయాల వద్ద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.  సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గండిపేట, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను బుధవారం సందర్శించారు. కల్వర్టుల వద్ద, నీరు ఉధృతంగా ఉన్న గ్రామాల వద ్ద పికెట్‌లు కొనసాగించాలని సిబ్బందిని ఆదేశించారు. జలాశయం బండ్‌(కట్ట)పైకి సందర్శకులను అనుమతించవద్దని  సూచించారు. 

గతేడాది కంటే తక్కువ నీరే..

వాటర్‌బోర్డు ఎండీ దానకిశోర్‌ కూడా జంట జలాశయాలను సందర్శించారు. గతేడాది ఒక్క హిమాయత్‌ సాగర్‌ నుంచే 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ఈసారి రెండు జలాశయాల నుంచి కలిపినా గతేడాది కంటే తక్కువ నీటిని విడుదల చేస్తున్నామని దానకిశోర్‌ తెలిపారు. వరద ఉధృతి నేపథ్యంలో జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని పోలీసులకు సూచించారు. మూడు పోలీస్‌ కమిషనరేట్లతో వాటర్‌బోర్డు నిరంతరం సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. 

శభాష్‌ పోలీస్‌

ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన పోలీసులు 

మంగళ్‌హాట్‌, జూలై 27(ఆంధ్రజ్యోతి): వరదల్లో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని ప్రాణాలకు తెగించిన పోలీసులు రక్షించారు. మంగళవారం రాత్రి హబీబ్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదాబాబు, మంగళ్‌హాట్‌ ఎస్‌ఐ రాంబాబు కుల్సుంపురా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మూసీ పరివాహక ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పురానాపూల్‌ మూసీ వద్ద ఓ వ్యక్తి కొట్టుకుపోతున్నట్లు గమనించారు. ఎస్‌ఐ రాంబాబు నీటిలోకి దిగి యువకుడిని కాపాడి తన భుజానా వేసుకుని ఒడ్డుకు తీసుకువచ్చారు. అసస్మారక స్థితిలో ఉన్న బాధితుడిని పోలీసు వాహనంలో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం యువకుడి పరిస్థితి మెరుగుపడినట్లు తెలిసింది. యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది.

సాహస పోలీసులకు రివార్డులు

హిమాయత్‌సాగర్‌ సర్వీస్‌ రోడ్డు వంతెన దాటుతుండగా వరదల్లో చిక్కుకున్న బీటెక్‌ విద్యార్థి అరవింద్‌ గౌడ్‌ను కాపాడిన హెడ్‌ కానిస్టేబుల్‌ బేగ్‌, డ్రైవర్‌ ముల్లాంగ్‌షా, హెల్పర్స్‌ రాకేష్‌, విజయ్‌లను సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు. బుధవారం కమిషనరేట్‌లో ఇద్దరు సాహస పోలీసులను రివార్డులు అందజేశారు. అరవింద్‌ గౌడ్‌ మంగళవారం రెయిలింగ్‌ను పట్టుకుని ఆర్తనాదాలు చేస్తుండగా అతడిని కాపాడిన విషయం తెలిసిందే. 

ట్రాఫిక్‌ దిగ్బంధం 

హైదరాబాద్‌ సిటీ/గోల్నాక, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : వాహనాల మళ్లింపుతో గోల్నాక ట్రాఫిక్‌ దిగ్బంధంగా మారిపోయింది. మూసారాంబాగ్‌, చాదర్‌ఘాట్‌ కాజ్‌ వే బ్రిడ్జిలపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ అటు మళ్లుతున్నాయి. అలాగే అంబర్‌పేట్‌/కాచిగూడ నుంచి మలక్‌పేట్‌ వైపు వచ్చే రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ప్రత్యామ్నాయాల ద్వారా ప్రయాణించారు. దీంతో దిల్‌సుక్‌నగర్‌, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, ఇమ్లిబన్‌, కాచిగూడ, అంబర్‌పేట్‌, ఛే నెంబర్‌, తిలక్‌నగర్‌, విద్యానగర్‌ రోడ్లు ట్రాఫిక్‌ వలయంగా మారిపోయాయి. అత్తాపూర్‌ పిల్లర్‌ నెంబర్‌ 180 పరిసరాల్లోనూ అదే పరిస్థితి. 

నీట మునిగిన  సబ్‌ స్టేషన్‌

హైదరాబాద్‌ సిటీ, జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ఇబ్రహీంబాగ్‌ డివిజన్‌ నార్సింగ్‌ సెక్షన్‌ పరిధిలోని 11 కేవీ గండిపేట ఫీడర్‌ సహా 33/11 కేవీ సీబీఐటీ సబ్‌స్టేషన్‌ వరదల్లో మునిగింది. బాపూఘాట్‌, లంగర్‌హౌస్‌ ట్రుప్‌ఖాన్‌ బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో ఆరు విద్యుత్‌ స్తంభాలు కొట్టుకుపోయాయి.  సరూర్‌నగర్‌ ఆర్కేపురం ప్రజయ్‌నివాస్‌ అపార్ట్‌మెంట్స్‌ ఫేజ్‌-1 మూడు ట్రాన్స్‌ఫార్మర్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లో సుమారు 20 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 

ఆక్రమణలు.. కబ్జాలు

హైదరాబాద్‌ సిటీ / రాజేంద్రనగర్‌ / రామంతాపూర్‌ / చాదర్‌ఘాట్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): మహానగర ప్రధాన వరద ప్రవాహ వ్యవస్థగా ఉన్న మూసీ ముంపునకు ఆక్రమణలు, కబ్జాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మూసీని మూసేసి ఆక్రమణదారులు లే అవుట్లు చేసి ఇష్టానికి విక్రయించే దందా ఇప్పటికీ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. బాపూఘాట్‌ మొదలు నాగోల్‌ వరకు మూసీకి ఇరువైపులా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా జరుగుతోంది. ప్రస్తుత ముంపు ప్రాంతాల్లో మెజార్టీ మూసీని ఆక్రమించి నిర్మించినవే అని అధికారులు చెబుతున్నారు. అయినా.. చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెకిస్తున్నారు. వరదలు వచ్చినప్పుడు హడావిడి చేసి.. అనంతరం ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు. సర్వేలు నిర్వహించి గుర్తించిన ఆక్రమణల తొలగింపు దిశగా అడుగు కూడా ముందుకు పడడం లేదు. గుడిసెలు మాత్రమే కాదు.. భారీ వెంచర్లు మూసీ బఫర్‌ జోన్‌లో వస్తుండటం గమనార్హం. 

50 మీటర్లుగా బఫర్‌ జోన్‌

మూసీ ఒక్కో చోట ఒక్కో విస్తీర్ణంలో ఉంటుంది. పలు ఏరియాల్లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే నిర్మాణాలు రాగా.. ఇంకొన్ని చోట్ల బఫర్‌ జోన్‌ ఆక్రమిస్తున్నారు. 2020లో భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల ఆధారంగా మూసీ ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించారు. ఎఫ్‌టీఎల్‌ నుంచి ఒక్కో వైపు 50 మీటర్ల మేర బఫర్‌ జోన్‌గా గుర్తిస్తూ జీఓ-7ను 2016లో ప్రభుత్వం జారీ చేసింది. అంతకుముందు మూసీ ఎఫ్‌టీఎల్‌ ఒక్కో వైపు 100 మీటర్లుగా ఉండేది. దీనిని తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఎఫ్‌టీఎల్‌ నుంచి 150 అడుగుల మేర(బఫర్‌ జోన్‌) నిర్మాణాలకు అనుమతి ఉండదు. కుల్సుంపురా, జియాగూడ, అఫ్జల్‌గంజ్‌, పురానాపూల్‌, పేట్ల బురుజు, మహమూద్‌నగర్‌, జుబేదాబేగం బస్తీ, బండ్లగూడ, సన్‌సిటీ, గోల్నాక, అంబర్‌పేట, రామంతాపూర్‌ ప్రాంతాల్లో మూసీ పక్కనే బస్తీలు, కాలనీలు వెలిశాయి. పలు చోట్ల బహుళ అంతస్తుల భవనాలు, పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేశారు. ముసారాంబాగ్‌ వద్ద బ్రిడ్జిపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లడంతో పెట్రోల్‌ బంక్‌లోకి నీళ్లు వచ్చాయి. అంబర్‌పేట వైపు చికెన్‌, స్ర్కాప్‌, ఇతరత్రా దుకాణాలు నీట మునిగాయి. 

అక్రమ కట్టడాలు గుర్తింపు

చాదర్‌ఘాట్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాలైన ముసానగర్‌, శంకర్‌నగర్‌ బస్తీలు మూసీ నది బఫర్‌ జోన్‌లోనే ఉన్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. గత మార్చిలో ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఫైనల్‌ నోటిపికేషన్‌ జారీ చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా పరిధిలో 14 కి.మీల పొడవునా గోల్కొండ, ఆసిఫ్‌నగర్‌, బహదూర్‌పురా, చార్మినార్‌, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, అంబర్‌పేట, సైదాబాద్‌ మండలాలను కలుపుతూ ప్రవహించే నదికి ఇరువైపులా వేలాది ఆక్రమణలున్నాయి. చాదర్‌ఘాట్‌లో మూసీ ప్రవాహాన్ని ఆనుకొని మూసానగర్‌, శంకర్‌నగర్‌ బస్తీలు వెలిశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా బస్తీల్లో విద్యుత్‌, తాగునీరు, రోడ్లు వంటి సదుపాయాలు కల్పించేలా కొందరు ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంబర్‌పేట మండలం పరిఽధిలోకి వచ్చే శంకర్‌నగర్‌, ముసానగర్‌ బస్తీల్లో 1,100 అక్రమ కట్టడాలు వెలిసినట్లుగా రెవెన్యూ అధికారులే అధికారికంగా గుర్తించారు. సైదాబాద్‌ మండలం పరిధిలోని వడ్డెరబస్తీ, అజయ్‌హట్స్‌, శాలివాహనహట్స్‌, అంబేడ్కర్‌ హట్స్‌ పేరుతో వెలిసిన 600 అక్రమ కట్టడాలను గుర్తించారు. వీటిపై నివేదిక తయారు చేసిన రెవెన్యూ అధికారులు మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీ)కి అందించారు. ముంపునకు గురయ్యే బస్తీ వాసులకు పక్కా ఇళ్లు ఇచ్చే అంశంపై ఉన్నత స్థాయిలో స్పష్టత రావడం లేదు.  అలాగే, పక్కా గృహాలు ఇస్తామన్నా కొందరు వెళ్లేందుకు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. 

ఈసా నదిపై...

బాపూఘాట్‌ వరకు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి.  ప్రస్తుతం జనచైతన్య ఫేజ్‌-2 వద్ద ఈసా నది బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలు మొదలయ్యాయి. అయినా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎంఆర్‌డీసీ ఏర్పాటచేసినా.. మూసీ పరిస్థితి మారడం లేదు.





Updated Date - 2022-07-28T06:46:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising