432 ఫోన్లు చోరీ.. రెండే రికవరీ!
ABN, First Publish Date - 2022-10-07T17:05:09+05:30
బజాజ్ ఎలక్ర్టానిక్స్‌లో జరిగిన 432 సెల్‌ఫోన్ల భారీ చోరీ కేసు (విలువ రూ. 70 లక్షలు)ను రాచకొండ పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు.
బజాజ్ స్టోర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
ఇద్దరి అరెస్ట్.. మిగతా వారి కోసం గాలింపు
హైదరాబాద్ సిటీ: బజాజ్ ఎలక్ర్టానిక్స్‌లో జరిగిన 432 సెల్‌ఫోన్ల భారీ చోరీ కేసు (విలువ రూ. 70 లక్షలు)ను రాచకొండ పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. కానీ, పోలీసులు ప్రస్తుతానికి రెండు సెల్‌ఫోన్లు, రూ. 80వేల నగదు మాత్రమే రికవరీ చేశారు. గత నెల 20 అర్ధరాత్రి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ వద్ద ఉన్న బజాజ్ ఎలకా్ట్రనిక్స్ స్టోర్‌లో భారీ చోరీ జరిగింది. స్టోర్ జనరల్ మేనేజర్ మహమ్మద్ హబీబ్ ఫిర్యాదు మేరకు కుషాయిగూడ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ద్వారా ఆరుగురు నిందితులున్నట్లు గుర్తించారు. ఫేస్‌మాస్కులు ధరించి రాత్రి 11 గంటలకు లోనికి ప్రవేశించిన దుండగులు తెల్లవారు జాము మూడు గంటల వరకు లోపలే ఉండి బాక్స్‌లను తొలగించి ఫోన్లను తస్కరించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు మొత్తం పది బృందాలు ఏర్పాటు చేశారు. 500 సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈసీఐఎల్ - అంబేడ్కర్‌నగర్ మధ్య వారు వినియోగించిన ఆటోలను గుర్తించాయి.
ప్రధాన నిందితుడి గుర్తింపు
నిందితులు జార్ఖండ్ వాసులుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కుషాయిగూడ డీఐ గురవారెడ్డి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బాలు చౌహాన్‌లతో కలిపి ఓ ప్రత్యేక బృందం జార్ఖండ్‌కు వెళ్లింది. క్లూస్‌టీమ్ ఇచ్చిన ఆధారాలతో నిందితుల్లో ముంబైలోని ఆంటోప్ హిల్స్ పీఎస్ పరిధిలో అరెస్టు అయిన పాత నేరస్తుడు సత్తార్ షేక్ (40) కూడా ఉన్నాడని గుర్తించారు. జార్ఖండ్ చేరిన ప్రత్యేక బృందం సాహెబ్‌గంజ్ జిల్లా (రాధానగర్, రంగా పీఎస్‌లు)లో గత నెల 30న ప్రధాన నిందితుడు సత్తార్‌షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు.
రంగంలోకి మరో బృందం
సత్తార్ షేక్ ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడి కోసం జవహర్‌నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ కె.చంద్రశేఖర్ నేతృత్వంలో మరో ప్రత్యేక బృందం పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వెళ్లింది. స్థానిక పోలీసుల సహకారంతో రెండో నిందితుడు మహమ్మద్ అసిదుల్ షేక్ (20)ను అదుపులోకి తీసుకుంది. నిందితులిద్దరూ జార్ఖండ్ రాష్ట్రం, సాహెబ్‌గంజ్ జిల్లాకు చెందిన ఆలం గ్యాంగ్ సభ్యులుగా పోలీసులు నిర్ధారించారు. వారిని నగరానికి తీసుకొచ్చి విచారించగా చోరీ ఘటనలో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్లు తెలిసింది. మిగతా నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరు నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ. 80వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2022-10-07T17:05:09+05:30 IST