Weapon License: 40 వేలు ఇచ్చుకో.. ఆయుధ లైసెన్స్ తీసుకో
ABN, First Publish Date - 2022-11-18T04:04:42+05:30
స్వస్థలం బిహార్..! ఆయుధ లైసెన్స్ కశ్మీర్‌లో..
హైదరాబాద్ అడ్డాగా నకిలీ ఆయుధ లైసెన్సుల దందా
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ కలెక్టర్ సంతకం ఫోర్జరీ
ఫేక్ పత్రాలతో లైసెన్సులు
పలునగరాల్లో ఆయుధాల కొనుగోళ్లు
టాస్క్‌ఫోర్స్ అదుపులో ఒకరు
హైదరాబాద్ సిటీ, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): స్వస్థలం బిహార్..! ఆయుధ లైసెన్స్ కశ్మీర్‌లో..! తుపాకీ కొనుగోలు పుణెలో..! పనిచేసేది హైదరాబాద్‌లో..! ఇదీ.. హైదరాబాద్ కేంద్రంగా నకిలీ ఆయుధ లైసెన్సుల ముఠా తీరు..! నకిలీ వెపన్ లైసెన్సులు తయారు చేస్తూ.. వాటిని అంగట్లో ఒక్కోదానికి రూ. 40 వేల వెలకట్టి విక్రయిస్తున్న ఘరానా ముఠా ఆటను హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు కట్టించారు. ఈ ముఠాకు చెందిన ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి.. 34 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా నుంచి నకిలీ ఆయుధ లైసెన్సులు తీసుకున్నవారు పలు రాష్ట్రాల్లో సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని వేర్పాటువాదుల ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో పౌరులకు తమ భద్రత కోసం సులభంగా ఆయుధ లైసెన్సులు జారీ చేస్తుంటారు. పోలీసులు కాకుండా.. జిల్లా కలెక్టర్‌కు ఆయుధ లైసెన్స్ జారీ చేసే అధికారం ఉంటుంది. ఇలా జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ అనే వ్యక్తి 2013లో నగరానికి వచ్చి, గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసె్‌సలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. అల్తా్‌ఫకు రాజౌరీ కలెక్టర్ నుంచి జారీ అయిన ఆయుధ లైసెన్స్ ఉంది. దాని సాయంతో ఓ తుపాకీని కొనుగోలు చేశాడు. అతనికి ఆయుధ లైసెన్స్ ఉండడంతో వెస్ట్ మారేడ్‌పల్లిలోని సిస్ క్యాష్ సర్వీ్‌సలో గన్‌మన్‌గా బాధ్యతలు అప్పగించారు.
సాధారణంగా సెక్యూరిటీ గార్డుల జీతం రూ. 12 వేల నుంచి రూ. 20 వేల వరకు ఉంటుంది. అదే తుపాకీ లైసెన్స్ ఉంటే.. రూ. 40 వేల నుంచి రూ. 60 వేల దాకా వేతనం లభిస్తుంది. నకిలీ ఆయుధ లైసెన్సు జారీ ప్రక్రియను క్షుణ్ణంగా తెలుసుకున్న అల్తాఫ్.. సికింద్రాబాద్‌కు చెందిన స్టాంప్ విక్రయదారుడు హఫీజుద్దీన్, మరో ఐదుగురితో కలిసి నకిలీ ఆయుధ లైసెన్సుల జారీ ముఠాను ఏర్పాటు చేశాడు. ఆయుధ లైసెన్సు నకలు పుస్తకాల తయారీ, రాజౌరీ కలెక్టర్ స్టాంపు, రాజౌరీ పోలీ్‌సస్టేషన్ ఎస్‌హెచ్‌వో స్టాంపు, ఫోర్జరీ సంతకాల బాధ్యతను హఫీజుద్దీన్ చేపట్టేవాడు. వీరంతా.. జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన యువతను ఉద్యోగాల పేరిట నగరానికి రప్పించి, వారి వద్ద నుంచి రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు తీసుకుని, ‘ఆల్ ఇండియా పర్మిట్’ ముద్రతో నకిలీ ఆయుధ లైసెన్సులు ఇచ్చేవాడు. అలా లైసెన్సులు తీసుకున్న యువకులు.. వేర్వేరు రాష్ట్రాల్లో ఆయుధాలను కొనుగోలు చేసి, హైదరాబాద్‌తోపాటు.. వేర్వేరు నగరాల్లోని బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, ఆభరణాల దుకాణాలు.. ఇలా పలు ప్రాంతాల్లో సెక్యూరిటీగార్డులుగా, ప్రముఖుల వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసెస్ రీజనల్ మేనేజర్ వెంకట కొండారెడ్డి, వెస్ట్‌మారేడ్ పల్లిలోని జిరాక్స్ దుకాణం యజమాని ఐ.శ్రీనివాస్ పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీరు ఇప్పటి వరకు చాలా మందికి ఏషియన్ సెక్యూరిటీ సర్వీసెస్, నందమూరి సెక్యూరిటీ సర్వీసెస్, గ్రేస్ మేనేజ్‌మెంట్ సెక్యూరిటీ సర్వీసె్‌సలలో వారికి అవకాశం కల్పించారు.
ఉగ్రకోణంపై అప్రమత్తం!
ప్రధాన నిందితుడు అల్తాఫ్ జమ్మూకశ్మీర్‌కు చెందినవాడు కావడంతో.. గతంలో ఉగ్రవాద మూకలకు ఇలా ఆయుధ లైసెన్సులు ఇచ్చాడా? అనే కోణంపైనా పోలీసులు దృష్టిసారించారు. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని, విచారించే అవకాశాలున్నాయి.
గుట్టు రట్టయిందిలా..!
ఇటీవల ఓ సెక్యూరిటీగార్డు తన తుపాకీని అడ్డదిడ్డంగా పట్టుకుని, రోడ్డుపై నడుస్తుండగా.. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఒకరికి అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా, డీసీపీ రాధాకిషన్‌రావు అతణ్ని ప్రశ్నించారు. ఆ సెక్యూరిటీ గార్డు స్వస్థలం బిహార్ కాగా.. ఆయుధ లైసెన్సు జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో జారీ అయినట్లు ఉంది. డబుల్ బోర్ గన్‌ను పుణెలో కొనుగోలు చేశాడు. ఎక్కడా లింకు దొరక్కపోవడంతో.. ఆ లైసెన్స్‌పై ఆరా తీసేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులను సంప్రదించారు. అది నకిలీది అని తేలడంతో.. తీగలాగారు. ఈలోగా పంజాగుట్టలో సాయి వెంకట్‌రెడ్డి అనే ఓ సెక్యూరిటీగార్డు తాగిన మత్తులో పోలీసుల పైకి తుపాకీ ఎక్కుపెట్టిన కేసు నమోదైంది. అతను తెలుగువాడే అయినా.. తుపాకీ లైసెన్సు జారీ అయ్యింది రాజౌరి నుంచి అని తేలింది. వీరిని విచారించగా.. అల్తాఫ్ ముఠా గుట్టు రట్టయింది. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 34 తుపాకులు, 140 రౌండ్ల తూటాలు, 34 నకిలీ ఆయుధ లైసెన్సుల పుస్తకాలు, 29 ఖాళీ లైసెన్సు పుస్తకాలు, 6 రబ్బర్ స్టాంపులు, ఎన్వోసీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఫోర్జరీ, చీటింగ్, నకిలీ స్టాంపుల తయారీ సెక్షన్లతోపాటు.. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ సంస్థల్లో రాజౌరీ నుంచి ఆయుధ లైసెన్స్‌తో పనిచేస్తున్న వారిని గుర్తించేందుకు పోలీసులు జల్లెడపడుతున్నారు.
ఆయుధ లైసెన్సుకు దరఖాస్తు చేసుకోండి: సీవీ ఆనంద్
ఇలాంటి మూకల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సీవీ ఆనంద్ సెక్యూరిటీ సంస్థలను హెచ్చరించారు. ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థల నియంత్రణ చట్టం(పిసారా)కు లోబడి పనిచేయాలని సూచించారు. ఆయుధాలున్న గార్డులను నియమించుకోవడం కంటే.. ఆ అవసరం ఉన్న ఏజెన్సీలు నేరుగా ఆయుధ లైసెన్స్ కోసం తమకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ విషయంపై ఇతర పోలీసు కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించి, లైసెన్సుల జారీలో వెసులుబాటు కల్పిస్తామని పేర్కొన్నారు.
Updated Date - 2022-11-18T10:43:50+05:30 IST