చెత్తలో పేలుడు..
ABN, First Publish Date - 2022-12-16T01:28:26+05:30
లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చెత్త డంపింగ్ యార్డు (టీబీటీ ట్రాన్స్ పోర్టు సెక్షన్)లో శుక్రవారం పేలుడు సంభవించింది.
తండ్రీ కుమారులకు తీవ్రగాయాలు
విషమంగా కుమారుడి పరిస్థితి
గాంధీ ఆస్పత్రికి తరలింపు
లోయర్‌ట్యాంక్‌బండ్ చెత్తడంపింగ్ యార్డులో ఘటన
బాంబు, డాగ్ స్వాడ్, క్లూస్ టీం తనిఖీలు
పరిశీలించిన సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర
కవాడిగూడ, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చెత్త డంపింగ్ యార్డు (టీబీటీ ట్రాన్స్ పోర్టు సెక్షన్)లో శుక్రవారం పేలుడు సంభవించింది. అదే సమయంలో అక్కడే చిత్తుకాగితాలు ఏరుకుంటున్న తండ్రీకుమారులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే, కుమారుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ పేలుడు సంఘటన నగరంలో కలకలం సృష్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
పలు ప్రాంతాల్లో ఆటో రిక్షాల్లో సేకరించిన చెత్తను లోయర్ ట్యాంక్‌బండ్‌లోని చెత్త డంపింగ్ యార్డులో డంప్ చేస్తుంటారు. గురువారం డంపింగ్ చేసిన చెత్తలో మడ్ ఫోర్టు ప్రాంతంలో ఉంటున్న కర్నూలు జిల్లా నంచర్లకు చెందిన చంద్రన్న(42), ఆయన కుమారుడు సురేష్(14) చిత్తు కాగితాలు ఏరుకొంటున్నారు. మధ్యాహ్న మూడు గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. దీంతో తండ్రీకుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడుతో పరిసర ప్రాంతాల ప్రజలు, కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇద్దరూ రక్తపుమడుగులో ఉన్నారు. తండ్రి ఎడమ చేతిమణికట్టు పూర్తిగా తెగిపోగా, కుమారుడు సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 ద్వారా గాంధీ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన సురేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పేలుడు జరిగిన వెంటనే సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. బాంబు స్వాడ్, డాగ్స్వాడ్, క్లూస్‌టీంలను రప్పించారు. పేలుడు ఏ విధంగా జరిగింది.. దానిలో ఉపయోగించిన రసాయనాలను తనిఖీ చేశారు. సెంట్రల్‌జోన్ డీసీపీ రాజేష్ చంద్ర, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, గాంధీనగర్ సీఐ మోహన్‌రావులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ యాదగిరి మాట్లాడుతూ చెత్తలో పెయింట్, టిన్నర్ డబ్బాల వల్ల పేలుడు సంభవించి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి విచారణ జరుపుతున్నామన్నారు. ఈ పేలుడు పెయింట్ డబ్బాల వల్ల జరిగిందా, లేక మరేదైనా పేలుడు పదార్థాల వల్ల జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషయం తెలిసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, కార్మిక సంఘం నాయకులు బండారి యాదగిరిలు డంపింగ్ యార్డుకు చేరుకుని పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యమే కారణమా..?
లోయర్ ట్యాంక్‌బండ్ చెత్త డంపింగ్ యార్డులో జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్లే పేలుడు జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చెత్త డంపింగ్ యార్డులో కేవలం పరిసర ప్రాంతాలనుంచి సేకరించిన చెత్తను మాత్రమే డంప్ చేయాల్సి ఉండగా.. వివిధ కంపెనీల వ్యర్థ రసాయనాలను కూడా ఇక్కడ డంప్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీలోని కొంతమంది అధికారులతో ఫార్మసీ కంపెనీ నిర్వాహకులు కుమ్మక్కై రసాయనాల వ్యర్థాలను డంప్ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. వీటి వల్ల కూడా పేలుడు సంభివించిందన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ రసాయన వ్యర్థాల డంపింగ్‌పై పూర్తి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
Updated Date - 2022-12-16T01:28:30+05:30 IST