ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ గొర్రెలే..!

ABN, First Publish Date - 2022-11-08T04:24:38+05:30

మునుగోడు ఉప ఎన్నికతో పాటే ‘గొర్రెల పంపిణీకి నగదు బదిలీ’ పథకం కూడా ముగిసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొర్రెల పంపిణీ పాత పద్ధతిలోనే..

నగదు బదిలీపై ప్రభుత్వం యూటర్న్‌

ఉప ఎన్నికతో పాటే ముగిసిన బదిలీ

మునుగోడు నియోజకవర్గ లబ్ధిదారులకూ గొర్రెలు కొని ఇచ్చుడే

ఖాతాల్లో వేసిన డబ్బు ఇప్పటికే ఫ్రీజ్‌

నిధులు సర్దుబాటయ్యాకే రెండో విడత గొర్రెల పంపిణీ

హైదరాబాద్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నికతో పాటే ‘గొర్రెల పంపిణీకి నగదు బదిలీ’ పథకం కూడా ముగిసింది. మళ్లీ పాత పద్ధతిలోనే గొర్రెలను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తే.. వారు ఇతర రాష్ట్రాలకు వెళ్లి గొర్రెలు కొనలేరని, స్థానికంగా కొనుగోలు చేస్తే గొర్రెల పంపిణీ పథకం అసలు లక్ష్యం దెబ్బతింటుందని అభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. గొల్ల, కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించింది. మొదటి విడుతలో 3,91,388 మంది లబ్ధిదారులకు యూనిట్లను(20 గొర్రెలు+ఒక పొట్టేలు) పంపిణీ చేసింది. ఇంకా 3,54,791 మంది లబ్ధిదారులకు రెండో విడుతలో గొర్రెలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. అయితే, నిధుల కొరత కారణంగా రెండో విడుత గొర్రెల పంపిణీ వాయిదా పడుతూ వస్తోంది. హుజూర్‌నగర్‌, దుబ్బాక, నాగార్జునసాగర్‌, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. గొర్రెల పంపిణీకి ‘నగదు బదిలీ(డీబీటీ)’ విధానాన్ని అమలు చేయాలని కొంతకాలంగా లబ్ధిదారులు కోరుతున్నారు. మునుగోడులో ఆ పద్ధతి అమలు చేయడంతో రాష్ట్రమంతటా అదే పద్ధతిని అమలు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్కారు యూటర్న్‌ తీసుకోవటం చర్చనీయాంశమైంది.

ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రయోగం

గొర్రెల పంపిణీ పథకం మార్గదర్శకాల ప్రకారం గొల్ల, కురుమ లబ్ధిదారులను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి గొర్రెలు కొనుగోలు చేసివ్వాలి. అయితే, గొర్రెలను కొనివ్వడం కాకుండా.. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేస్తే లబ్ధిదారులే గొర్రెలను కొనుగోలు చేస్తారని ప్రభుత్వం భావించింది. ఈ విధానాన్ని పరీక్షించడం కోసం మునుగోడు నియోజకవర్గాన్ని ఎంచుకుంది. మునుగోడులో ఉప ఎన్నిక ఉన్నందునే టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శలొచ్చాయి. నగదు బదిలీలో భాగంగా మునుగోడు పరిధిలో ఉన్న 4,739 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖతాల్లో అధికారులు నగదు జమ చేశారు. మరో 1,525 మంది లబ్ధిదారులకు నగదు బదిలీ చేయాల్సి ఉండగా.. ఎన్నికల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో నగదు బదిలీకి బ్రేక్‌ పడింది. అప్పటికే బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమైన లబ్ధిదారులు తమ అకౌంట్ల నుంచి డబ్బు విత్‌ డ్రా చేసుకోకుండా కూడా ఫ్రీజ్‌ చేశారు. ఎన్నిక పూర్తైన తర్వాత లబ్ధిదారులు డబ్బులు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని అధికారులు చెప్పారు. ఇప్పుడు, సర్కారు యూటర్న్‌ తీసుకోవడంతో మునుగోడులోని లబ్ధిదారులూ నగదు విత్‌డ్రా చేసుకొనే అవకాశం లేకుండా పోయింది.

లక్ష్యం దెబ్బతినే ప్రమాదం

గొర్రెల పెంపకందారులను ఆర్థికంగా పరిపుష్ఠం చేయటంతోపాటు మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని తెచ్చింది. మొదటి విడతలో అవినీతి, రీ-సైక్లింగ్‌ జరిగినప్పటికీ గొర్రెల సంపద గణనీయంగా పెరిగింది. అక్రమాలకు తావు లేకుండా నగదు బదిలీ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ... ఆ డబ్బుతో లబ్ధిదారులు గొర్రెలు కొంటారా.. ఒక వేళ కొన్నా ఇతర రాష్ట్రాలకు వెళ్తారా.. అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. స్థానికంగా కొనుగోలు చేస్తే గొర్రెల సంపద పెరగదని, అనుకున్న లక్ష్యం నెరవేరదని అధికారులు సూచించినట్లు తెలిసింది. దీంతో నిబంధనలను కఠినతరం చేసి పాతపద్ధతిలోనే గొర్రెలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గొర్రెల కొనుగోళ్లకు నిధుల కొరత

గతంలో గొర్రెల యూనిట్‌ ధర రూ.1.25 లక్షలు ఉండగా... ఇటీవల రూ.1.75 లక్షలకు పెంచారు. ఇందులో లబ్ధిదారుని వాటా రూ.43,750 పోగా, ప్రభుత్వం రూ.1,31,250 సబ్సిడీ ఇస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి ప్రభుత్వం రూ.3,723 కోట్లు ఖర్చు చేసింది. లబ్ధిదారులు తమ వాటాధనం రూపంలో రూ.1,241 కోట్లు చెల్లించారు. మొత్తం కలిపి రూ.4,964 కోట్లు అయింది. గొర్రెల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం ‘ఎన్‌సీడీసీ(నేషనల్‌ కో-ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌’ నుంచి ఇదివరకు రూ. 4 వేల కోట్లు అప్పు తీసుకుంది. మరో రూ.4,600 కోట్ల రుణాన్ని కూడా తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ నిధులు సర్దుబాటు అయిన తర్వాతనే రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. గతంలో డీడీలు తీసిన లబ్ధిదారులకు కూడా ఇంకా గొర్రెలు పంపిణీ చేయలేదు. దీంతో వాటాధనం చెల్లించడానికి కూడా లబ్ధిదారులు వెనకడుగేస్తున్నారు.

Updated Date - 2022-11-08T04:24:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising