26న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
ABN, First Publish Date - 2022-12-15T03:29:06+05:30
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదు రోజులు పర్యటించనున్నారు.
5 రోజుల పాటు రాష్ట్రంలో పర్యటన
తొలిరోజు రాజ్‌భవన్‌లో గవర్నర్ విందుకు హాజరు
27న ఎన్పీఏలో విదేశీ అధికారులతో భేటీ
28న భద్రాద్రి, రామప్ప ఆలయాల సందర్శన
ప్రసాద్ పథకాన్ని ప్రారంభించనున్న ద్రౌపది ముర్ము
హైదరాబాద్/మేడ్చల్ అర్బన్/భద్రాచలం/ములుగు, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఐదు రోజులు పర్యటించనున్నారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా రాష్ట్రంలో డిసెంబరు 26 నుంచి 30 వరకు 5 రోజులపాటు జరిగే పర్యటనలో పలు కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొననున్నారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. ఈనెల 26న రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇచ్చే విందుకు రాష్ట్రపతి హాజరవుతారు. మరుసటి రోజు(27న) హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ శిక్షణ కేంద్రం(ఎన్పీఏ)లో శిక్షణ పొందుతున్న నేపాల్, భూటాన్, మాల్దీవులకు చెందిన విదేశీ అధికారులతో భేటీ అవుతారు. డిసెంబరు 28న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు.
అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయాన్ని రాష్ట్రపతి ముర్ము సందర్శిస్తారు. రామప్ప ఆలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా దక్కిన నేపథ్యంలో రామప్ప ఆలయాన్ని సందర్శించి ఇక్కడా ప్రసాద్ స్కీంను ప్రారంభిస్తారు. 29న శంషాబాద్‌లోని సమతామూర్తి విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శిస్తారు. నాలుగు రోజుల పర్యటనలో చివరిరోజైన డిసెంబరు 30న రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లతో సమావేశం అవుతారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులకు రాష్ట్రపతి విందు(మధ్యాహ్న భోజనం)తో ఆమె పర్యటన ముగుస్తుంది. ఐదు రోజుల పర్యటనలో భాగంగా పలు ప్రైవేటు విద్యాసంస్థల్లో నిర్వహించే పలు కార్యక్రమాల్లోనూ రాష్ట్రపతి పాల్గొననున్నారు.
Updated Date - 2022-12-15T03:29:07+05:30 IST