అన్నదాతల బలవన్మరణాల్లో తెలంగాణకు నాలుగో స్థానం
ABN, First Publish Date - 2022-12-31T03:12:00+05:30
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదా
రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు రైతుల ఆత్మహత్య
మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తర్వాత మన రాష్ట్రమే
ప్రభుత్వ లెక్కల ప్రకారమే 8 ఏళ్లలో 6,557 మంది బలి
అనధికారికంగా మరో 25ు మరణాలని అంచనా
గత 11నెలల్లో ప్రాణాలు తీసుకున్న మరో 512 మంది..
పంటనష్టం, రుణమాఫీ, కౌలు సమస్యలు ప్రధాన కారణం
అన్నదాతల ఆత్మహత్యల్లో 80 శాతం మంది కౌలు రైతులే
పరిహారం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధితులు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదా? రాష్ట్రవ్యాప్తంగా సగటున రోజుకు ఇద్దరు అన్నదాతలు బలవన్మరణానికి పాల్పడుతున్నారా? రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు లాంటి సంక్షేమ పథకాలు అమలవుతున్నా గత మూడేళ్లతో పోల్చితే రాష్ట్రంలో ఆత్మహత్యలు ఇంకా పెరిగాయా? ప్రభుత్వ గణాంకాలు ఇవే ఘోషిస్తున్నాయి! రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగో స్థానంలో ఉన్నదని జాతీయ క్రైం బ్యూరో (ఎన్సీఆర్బీ) లెక్కలు చెబుతున్నాయి. ఈ నివేదిక ప్రకారం గత ఎనిమిదేళ్లలో (2014 నుంచి 2021 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 6,557 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఏడాదిలో నవంబరు దాకా అంటే 11 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 512 మంది రైతులు ప్రాణాలు తీసుకున్నట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనం తేల్చింది. ఆ రకంగా గత మూడేళ్లతో పోలిస్తే 2022లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. మొత్తంగా 2014 నుంచి చూస్తే గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 7,069 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం... రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. తొలి మూడు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. రికార్డుల్లోకెక్కని ఆత్మహత్యలూ చాలానే ఉంటాయని.. రైతుల ఆత్మహత్యల సంఖ్యను తక్కువచేసి చూపించటానికి కొన్నింటిని ‘ఎఫ్ఐఆర్’లో నమోదుచేయటంలేదని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఆ రకంగా ఎన్సీఆర్బీ లెక్కలతో పోల్చితే అనధికారికంగా మరో 25శాతం ఆత్మహత్యలు ఉంటాయని వారు చెబుతున్నారు.
100కు 80 మంది కౌలు రైతులే!
రైతు ఆత్మహత్యల్లో ఎక్కువ కౌలు రైతులవే ఉంటున్నాయి. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులున్నా రు. కౌలుసాగు లాభదాయకంగా లేదనే ఆవేదన చా న్నాళ్లుగా ఆ రైతుల్లో ఉంది. కౌలుకు ఎకరాకు రూ15 వేల నుంచి రూ.18 వేల దాకా అవుతుండటం, ఎరువులు, విత్తనాలు, కూలీ ఖర్చుల రూపంలో పెట్టుబడులు ఏటికేడు పెరుగుతుండటం.. ప్రకృతి వైపరిత్యాల కారణంగా కౌలు రైతుల్లో చాలామంది నష్టాలపాలవుతున్నారు. ఫలితంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతుల్లో కౌలు రైతులే 80 శాతం ఉంటున్నారు. రైతుబందు, రైతుబీమా, పీఎం-కిసాన్ వంటి పథకాలేవీ కౌ లుదారులకు వర్తించడం లేదు.విత్తనాల సబ్సిడీ, ఫామ్ మెకనైజేషన్ (వ్యవసాయ యాంత్రీకరణ) కూడా కౌలు రైతులకు వర్తించటంలేదు. ఇతర రాష్ట్రాల్లో కౌలు రైతులకోసం ఏదోఒక పథకాన్ని అమలుచేస్తున్నారు. ఒడిసాలో ‘కాలియా’, కేరళలో ‘కుడుంబశ్రీ’, ఏపీలో ‘రైతు భరోసా’ పథకాలను కౌలు రైతులకు వర్తింపజేస్తున్నా రు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు ‘గుర్తింపు కార్డులు’ జారీ చేసేవారు. ఎల్ఈసీ(లోన్ ఎలిజిబిలిటీ కార్డులు) ఉంటే... కనీసం బ్యాంకుకు వెళ్లి పంట రుణాలైనా తీసుకునే పరిస్థితులుండేవి. ఇప్పుడు ఎలాంటి గుర్తింపు లేకపోవటంతో బ్యాంకుల్లో పంట రుణాలు కూడా తీసుకునే అవకాశమే లేకుండా పోయింది.
వరుసగా మూడేళ్లు పంట నష్టం
ఆకాల వర్షాలు, చీడపీడలకు పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో రైతులకు అది శరాఘాతమవుతోంది. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లు కురిసిన కుండపోత వ ర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటి లభ్యత, సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ.. పంటల దిగుబడి తగ్గిం ది. వరి, పత్తి, కంది, సోయాబీన్, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలన్నీ అతివృష్టి ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. 2020లో రాష్ట్రవ్యాప్తంగా 28.78 లక్షల ఎకరా ల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 50 లక్షల ఎకరాల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయి. మిగిలిన విస్తీర్ణంలో దిగుబడి గణనీయంగా తగ్గింది. 2021లో వర్షాల తాకిడికి 12.80 లక్షల ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఈ సంవత్సరం కూడా 11 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆశించినమేరకు పంటల దిగుబడి రాకపోవటం, పెట్టుబడి పెరగటం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవటం తో రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయారు. ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకా రం.. ఆదిలాబాద్ జిల్లాలో 29,805 మంది రైతులకు సంబంధించి 1,03,305ఎకరాల్లో.. భూపాలపల్లి జిల్లాలో 29,630 మంది రైతులకు సంబంధించి 92,310 ఎకరా ల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటలకు నష్టం జరిగితే మునుపు బీమా సొమ్ము వచ్చేది. రాష్ట్రం లో ‘పంటల బీమా పథకాలు’(క్రాప్ ఇన్సురెన్స్) అమలుచేయటంలేదు. ఫలితంగా రైతులకు నష్టపరిహారం కూడా అందటంలేదు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘ప్రధానమంత్రి ఫస ల్ బీమా యో జన’ పథకాన్ని కూడా తెలంగాణలో అమలుచేయటంలేదు. దే శంలో కొన్ని రాష్ట్రాలు ‘పీఎం- ఎఫ్బీవై’ పథకాన్ని అమలుచేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రా లు దీన్నుంచి బయటకొచ్చి సొంత పథకాలను అమలుచేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం ఏదీ అమలు చేయడం లేదు.
రుణమాఫీ లేదు.. అప్పులు పుట్టడం లేదు!
ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రైతులకు రుణమాఫీ అమలు కాకపోవడం రైతులకు ఇబ్బంది కరంగా మా రింది. 2014, 2018 ఎన్నికల్లో ‘లక్ష రూపాయల దాకా రుణమాఫీ’ పథకాన్ని ప్రకటించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పద్ధతిలో విడతలవారీగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభు త్వం ఏర్పడి నాలుగేళ్లయినా ఇంతవరకు రుణమాఫీ పథకం పూర్తిస్థాయిలో అమలుకాలేదు. కేవలం రూ. 37 వేల వరకున్న రుణాలు మాత్రమే మాఫీచేశారు.
జీవో 194తోనే ప్రయోజనం!
రైతుబీమా పథకం కింద పట్టా రైతులు చనిపోతే రూ.5లక్షలు చెల్లిస్తున్నారు. అయితే రైతుబీమా పథకం కంటే... గతంలో అమలుచేసిన జీవో నంబరు- 194 తోనే ప్రయోజనం ఎక్కువ ఉంటుందని రైతుసంఘాలు వాదిస్తున్నాయి. పాత జీవో ప్రకారమైతే... రైతు కుటుంబానికి రూ. 5 లక్షలు, అప్పులకోసం వన్ టైమ్ సెటిల్మెంట్ కింద రూ.లక్ష కలిపి మొత్తంగా రూ. 6 లక్షలు ఇచ్చేవారు. పిల్లల చదువు, ఇల్లు మంజూరుతోపాటు ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే నిబంధనలు ఉండేవి. రైతుబీమాలో ఇవన్నీ లేవు. ఫలితంగా కొందరు రైతులు పరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్నారు. జీవో నంబరు- 194 ప్రకారం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1,600 మంది రైతులకు రూ. 6 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది. ‘రైతు స్వరాజ్య వేదిక’ ఆధ్వర్యంలో 100 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మూడు నెలల విచారణ, తహసీల్దార్ చార్జిషీటు, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక, పోలీసు రికార్డులు.. ఇలా అన్ని అస్త్రాలతో హైకోర్టులో కేసు వేశారు. కేసు విచారణ జరుగుతోంది. మిగిలిన రైతులకు నష్టపరిహారం వచ్చేంతవరకు పోరాటంచేస్తామని ‘రైతు స్వరాజ్య వేదిక’ ప్రతినిధి బి. కొండల్ రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
Updated Date - 2022-12-31T08:25:28+05:30 IST