మళ్లీ గైర్హాజరు
ABN, First Publish Date - 2022-12-31T04:34:34+05:30
ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు.
ఈడీ విచారణకు హాజరుకాని రోహిత్‌రెడ్డి
కీలకం కానున్న ఈడీ కౌంటర్
వచ్చేవారం మరి కొందరికి నోటీసులు
రాజకీయ ప్రముఖులకూ అందే అవకాశం?
కేసు నమోదు చేయనున్న సీబీఐ
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మరోసారి గైర్హాజరయ్యారు. శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు చెప్పినా ఆయన వెళ్లలేదు. ఈ నెల 27న కూడా విచారణకు ఆయన గైర్హాజరైన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఈ కేసుతో ముడిపడి ఉన్న మాణిక్‌చంద్ గుట్కా కేసులోనూ దర్యాప్తు చేపట్టిన ఈడీ.. 15న ఈసీఐఆర్ నమోదు చేసింది. ఈ నెల 19, 20వ తేదీల్లో వరుసగా రెండు రోజులు రోహిత్‌రెడ్డిని విచారించిన ఈడీ అఽధికారులు.. ఈ నెల 27న మరోసారి విచారణకు రావాలని చెప్పి పంపించారు. అయితే ఆయన విచారణకు హాజరు కాకుండా.. హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో డబ్బులు చేతులు మారలేదని, అలాంటప్పుడు మనీలాండరింగ్ కింద ఈడీ విచారణ ఎలా జరుపుతుందని ప్రశ్నించారు. ఈడీ విచారణ నిలిపివేయాలంటూ కోర్టును అభ్యర్థించారు. కానీ, ఇందుకు నిరాకరించిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మరోవైపు 27న విచారణకు రోహిత్‌రెడ్డి హాజరు కాకపోవడంతో.. 30న రావాలంటూ ఈడీ మరోసారి ఆయనకు సూచించింది. అయినా రోహిత్‌రెడ్డి రాకపోవడంతో ఆయన విషయంలో ఈడీ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. జనవరి 5న హైకోర్టులో ఈడీ అధికారులు దాఖలు చేసే కౌంటర్ కీలకంగా మారనుంది. ఇదిలా ఉండగా.. వచ్చేవారం మరికొందరికి నోటీసులు జారీ చేసి సమాచారం సేకరించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను హైకోర్టు రద్దు చేస్తూ దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయడంతో వచ్చేవారం సీబీఐ కేసు నమోదు చేయనున్నట్లు తెలిసింది. కేసు తీవ్రత నేపథ్యంలో ఈడీ, సీబీఐ నుంచి నోటీసులు అందుకునే వారిలో రాజకీయ ప్రముఖులు ఉండే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు.
సొంత ఊళ్లకు స్వామీజీలు..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ, సింహయాజి స్వామి సొంత ఊళ్లకు వెళ్లినట్లు తెలిసింది. కోర్టు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటికే వీరు జైలు నుంచి విడుదలయ్యారు. అయితే కోర్టు విధించిన షరతుల్లో భాగంగా ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు ఏకంగా సిట్ రద్దు కావడంతో వీరిద్దరి హాజరు అవసరం లేకుండా పోయింది. దీంతో ఢిల్లీకి సమీపంలో ఉండే రామచంద్రభారతి, తిరుపతిలో ఉండే సింహయాజి స్వామి తమ సొంత ఊళ్లకు వెళ్లినట్లు సమాచారం. ్ఞ్ఠఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల చేతికి వెళ్లడంతో... అవి స్వామీజీలకు నోటీసులు జారీ చేసి విచారించనున్నాయి.
Updated Date - 2022-12-31T04:34:49+05:30 IST