ప్రసూతి ఆస్పత్రిలో డీజే మోత.. గర్భిణికి కడుపుకోత
ABN, First Publish Date - 2022-06-28T14:41:04+05:30
ప్రసూతి ఆస్పత్రి భవనంపై నిర్వహించిన పెళ్లి వేడుక ఓ గర్భిణికి తీరని శోకాన్ని మిగిల్చింది. డీజే సంగీతానికి స్టెప్పులేస్తూ ఆనందంలో మునిగిపోయిన
సకాలంలో వైద్యం అందక గర్భంలోనే శిశువు మృతి
వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసు కేసు నమోదు
హైదరాబాద్/చాదర్‌ఘాట్: ప్రసూతి ఆస్పత్రి భవనంపై నిర్వహించిన పెళ్లి వేడుక ఓ గర్భిణికి తీరని శోకాన్ని మిగిల్చింది. డీజే సంగీతానికి స్టెప్పులేస్తూ ఆనందంలో మునిగిపోయిన వైద్యులు ఆమెకు సకాలంలో వైద్యసాయం అందించ పోవడంతో గర్భంలోని శిశువు ప్రసవానికి ముందే మరణించింది. చాదర్‌ఘాట్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గోల్నాక ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆరీఫ్ గర్భవతి అయిన తన భార్య సురయ్య ఫాతిమా (24)ను ఈనెల 24న న్యూమలక్‌పేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తపోటు అధికంగా ఉండటంతో ఆమెకు ఇంజక్షన్ చేసి వైద్యులు ఇంటికి పంపేశారు. చలికి వణికిపోతూ వెన్నునొప్పితో బాధపడుతున్న ఫాతిమాను 25న తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు. 26న ఆమెను లేబర్ రూంకు తరలించి వైద్యులు ఎనిమా ఇచ్చారు.
నొప్పులు రాకపోవడంతో రాత్రి 8గంటలకు జనరల్ వార్డుకు తరలించి విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే, 9గంటల ప్రాంతంలో ఫాతిమాకు నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబసభ్యులు వైద్యుల కోసం చూడగా అందుబాటులో లేరు. వైద్యులు, ఇతర సిబ్బంది అంతా భవనం మూడో అంతస్తులో జరుగుతున్న ఆస్పత్రి ఎండీ మనవరాలి పెళ్లి సందడిలో మునిగిపోయారు. డీజే శబ్ధంలో డ్యాన్సులు వేస్తూ ఉన్న ఆస్పత్రి సిబ్బంది ఫాతిమా కుటుంబసభ్యుల పిలుపునకు చాలా ఆలస్యంగా స్పందించారు. అనంతరం ఆమెకు ప్రసవం చేసిన వైద్యులు శిశువు గర్భంలోనే మరణించిందని వెల్లడించారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసులు వచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సయ్యద్ ఆరీఫ్ ఫిర్యాదు మేరకు ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఆస్పత్రి యాజమాన్యంపై డీఎంహెచ్‌వో కూడా ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-06-28T14:41:04+05:30 IST