Farmers: కన్నీటి కౌలు
ABN, First Publish Date - 2022-12-15T02:29:10+05:30
వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, కౌలు రేట్లు గణనీయంగా పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలేవీ వర్తించకపోవడం, ప్రైవేటు అప్పులకు అధిక వడ్డీ భారం..
అప్పులతో కౌలు రైతులు కుదేలు
రైతుల్లో 36 శాతం మంది కౌలుదారులే
రైతు ఆత్మహత్యల్లో 80ు వారివే
భూ యజమానుల్లో 55 శాతం మంది
ఉద్యోగులు, వ్యాపారులే
20 జిల్లాల్లో రైతు స్వరాజ్య వేదిక అధ్యయనం
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడం, కౌలు రేట్లు గణనీయంగా పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే రైతు సంక్షేమ పథకాలేవీ వర్తించకపోవడం, ప్రైవేటు అప్పులకు అధిక వడ్డీ భారం.. వెరసి కౌలు రైతులు పుట్టెడు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లోని 34 గ్రామాల్లో రైతు స్వరాజ్య వేదిక నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉందని ఆందోళన చెందితే... రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ పరంపర కొనసాగుతోందని ఆ నివేదిక పేర్కొంది. రైతు బంధు, రైతు బీమాతోపాటు పీఎం- కిసాన్ పథకం వాస్తవ సాగుదారులకు వర్తించకపోవడం, చివరకు రుణ అర్హత కార్డులు(ఎల్‌ఈసీలు) జారీ చేయకపోవడంతో ఆర్థికంగా కౌలు రైతులు కుదేలు అవుతున్నారని వెల్లడించింది. రాష్ట్రంలో రోజుకు సగటున ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుండగా... వాటిలో 80శాతం కౌలు రైతులవేనని వెల్లడించింది.
సర్వే జరిగిందిలా
తెలంగాణలో కౌలు రైతుల స్థితిగతులపై రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎస్వీ) క్షేత్రస్థాయిలో అధ్యయనం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 20 జిల్లాల్లోని 34 గ్రామాలకు చెందిన 7,744 మంది రైతులను ఆర్‌ఎస్వీ ప్రతినిధులు కలిశారు. 7,744 మంది రైతుల్లో 2,753 మంది కౌలు రైతులు ఉన్నట్లు ఆ సర్వేలో తేలింది. ఈ మేరకు రైతు స్వరాజ్య వేదిక రూపొందించిన అధ్యయన నివేదికను బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో విడుదల చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్వీ ప్రతినిధులు విస్సా కిరణ్ కుమార్, కన్నెగంటి రవి, ఆశాలత, కొండల్‌రెడ్డి, శ్రీహర్ష, నవీన్‌తోపాటు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఆకునూరి మురళి, గోపాల్‌రావు, ఆర్థిక వేత్త డి.నరసింహా రెడ్డి, వీక్షణం వేణుగోపాల్, చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.
7,744 మంది రైతుల్లో 2,753 మంది కౌలు రైతులు ఉన్నారు. అంటే 35.6 శాతం కౌలు రైతులే. ప్రతి ముగ్గురు రైతుల్లో ఒకరు కౌలుదారుడే.
2,753 మంది కౌలు రైతుల్లో 523 మందికి సొంతంగా ఒక గుంట భూమి కూడా లేదు. అంటే ఇలాంటి వారు 19 శాతం ఉన్నారు. మరో 81 శాతం మందికి ఎంతో కొంత భూమి ఉండి... మరింత భూమిని అదనంగా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు.
కౌలు రైతుల్లో 48శాతం సన్నకారు రైతులు, 24 శాతం మంది చిన్న రైతులు ఉన్నారు. 31శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాలకు మించి భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నారు. కౌలు రైతుల్లో 9.5శాతం మంది మహిళలు ఉన్నారు.
కౌలుదారుల్లో 60.9శాతం మంది బీసీలు, 22.9 శాతం మంది ఎస్సీలు, 9.7శాతం మంది ఎస్టీలు, 4.2శాతం మంది ఓసీలు ఉన్నారు.
భూ యజమానుల్లో 26 శాతం మంది వ్యవసాయదారులు ఉండగా... 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, కాంట్రాక్టర్లు, ఇతర వృత్తిదారులు ఉన్నారు. 25 శాతం మంది భూయజమానులు నగరాల్లో ఉంటున్నారు. వీరి లో 50 శాతం మందికి గ్రామాలతోగానీ, వ్యవసాయంతోగానీ సంబంధాలు లేవు. కానీ, ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం బీసీలు, 33 శాతం ఓసీలు, 10 శాతం ఎస్సీలు, 7శాతం ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. ఇక కౌలుకిచ్చే భూమి విస్తీర్ణంలో ఓసీలకు చెందిన భూమి 43 శాతం, బీసీలకు చెందిన భూమి 44 శాతం ఉండటం గమనార్హం.
ఏటా కౌలు రైతులు మారుతుంటారని అందుకే గుర్తించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకుభిన్నంగా 73 శాతం మంది రైతులు... ఒకే భూమిని మూడేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 39 శాతం మంది రైతులు ఐదేళ్లకు పైగా, 18 శాతం మంది రైతులు పదేళ్లకు పైగా ఒకే భూమిలో సాగు చేస్తున్నట్లు వెల్లడైంది.
కౌలు రైతుల్లో 91.1శాతం మంది కౌలు మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తున్నారు. 7.5 శాతం మంది పంట రూపంలో చెల్లిస్తున్నారు. అతి తక్కువ మంది పంటల భాగస్వామ్యం(పాలు) పద్ధతిలో చేస్తున్నారు. నగదు కౌలు ఇచ్చేవారిలో 38.3 శాతం మంది సీజన్ ఆరంభంలోనే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది సగం ముందుగా, మిగిలిన సగం తర్వాత చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు.
కౌలు రైతులు ఆదాయం సరిపోక ఇతర వృత్తులపైనా ఆధారపడుతున్నారు. వ్యవసాయ కూలీలుగా 69శాతం మంది, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలుగా 13 శాతం మంది పని చేస్తున్నారు. 9.6ు మంది పశుపోషణ, 3ు మంది గొర్రెల పెంపకంపై ఆధారపడుతున్నారు.
భూయజమానికి రైతుబంధు అందడం వల్ల కౌలు ధర తగ్గించారని కేవలం 0.6 శాతం(17 మంది) రైతులు, రైతుబంధు డబ్బును యాజమాని తీసుకోకుండా తమకే ఇచ్చారని కేవలం 10మంది రైతులు(0.4 శాతం), కొంత భాగం ఇచ్చారని 0.1 శాతం మంది రైతులు తెలిపారు.
ప్రతి కౌలు రైతు కుటుంబానికి సగటున రూ. 2.70 లక్షల అప్పు ఉంది. ఇందులో ప్రైవేటు అప్పు రూ.2 లక్షలు కావడం గమనార్హం. సొంత భూమి ఎంతో కొంత ఉన్న కౌలు రైతులకు మాత్రమే బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందుతు న్నాయి. ప్రైవేటు అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకూ ఉంది.
మూడేళ్లలో 77 శాతం మంది కౌలు రైతులు పంటలు నష్టపోగా, 3.5శాతం మందికి మాత్రమే భూయజమానులు కొంత కౌలు తగ్గించారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల 44 శాతం మంది సీసీఐకి పత్తి, పీపీసీల్లో ధాన్యం అమ్ముకోలేకపోయారు. ప్రైవేటు ట్రేడర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారు. క్రాప్ బుకింగ్‌లో కౌలు రైతుల పేర్లు నమోదు చేయడం లేదు.
ప్రభుత్వం గుర్తించకపోవడం విడ్డూరం
కౌలు రైతులు ఎవరు? వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కేసీఆర్ మాట్లాడడం, కనీసం గుర్తించకపోవడం చాలా విడ్డూరం. కౌలు రైతులకు పెట్టుబడి కోసం రుణాలు దొరకడం లేదు. రైతుబంధు అందడం లేదు. కౌలు రైతులు చనిపోతే ఎలాంటి పరిహారం దక్కడం లేదు. వడ్లు అమ్మిన పైసలు కూడా యజమానుల ఖాతాల్లోనే పడుతున్నాయి. ఇప్పటికైనా కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి.
- ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు
వ్యవసాయాన్ని నాశనం చేశారు
కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం నాశనమైంది. 65 లక్షల మంది పట్టాదారులు రాష్ట్రంలో ఉంటే... 22 లక్షల మంది కౌలు రైతులే ఉన్నారు. అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో ఉండే ఎన్‌ఆర్‌ఐలు, సినీ నటులకు కూడా రైతు బంధు ఖాతాల్లో వేస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని వదిలి పెట్టొద్దు. రైతులు, రైతుసంఘాలు రోడ్లమీదికి వచ్చి పోరాటాలు చేసి చట్టాలు అమలు చేసేలా ఒత్తిడి చేయాలి.
- ఆకునూరి మురళి, విశ్రాంత ఐఏఎస్
Updated Date - 2022-12-15T02:29:11+05:30 IST