ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తూటా పేల్చి దోపిడీ

ABN, First Publish Date - 2022-02-01T08:02:45+05:30

అది సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం.. సమయం మధ్యాహ్నం ఒంటిగంట.. భూముల ధరల పెరుగుదల నేపథ్యంలో, ఒక్కరోజు ముందు రిజిస్ట్రేషన్లకు పెరిగిన రద్దీ.. వందల మంది జనం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సిద్దిపేటలో కాల్పుల కలకలం..
  • సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద ఘటన
  • క్షణాల్లో రూ. 43.50 లక్షలు దోచుకుని, బైక్‌పై పరారైన దుండగులు
  • అడ్డుకోబోయిన డ్రైవర్‌ తొడలోకి దూసుకెళ్లిన తూటా


సిద్దిపేట/సిద్దిపేట క్రైం, జనవరి31(ఆంధ్రజ్యోతి): అది సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం.. సమయం మధ్యాహ్నం ఒంటిగంట.. భూముల ధరల పెరుగుదల నేపథ్యంలో, ఒక్కరోజు ముందు రిజిస్ట్రేషన్లకు పెరిగిన రద్దీ.. వందల మంది జనం.. అంతలోనే ‘ఢాం..’ అంటూ తుపాకీ పేలుళ్లు..! అక్కడున్న వారు తేరుకునేలోపే.. సినీఫక్కీలో బైక్‌పై వచ్చిన దుండగులు రూ. 43.50 లక్షలను దోచుకుని పరారయ్యారు. సంచలనం సృష్టించిన ఈ ఘటన వివరాలు పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఇలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన వకుళాభరణం నర్సయ్యకు స్థానిక హౌసింగ్‌బోర్డులో ఓపెన్‌ ప్లాటు ఉంది.


దీన్ని తొగుట మండలం గుడికందులకు చెందిన శ్రీధర్‌రెడ్డికి విక్రయించారు. సోమవారం సిద్దిపేట సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ పెట్టుకున్నారు. శ్రీధర్‌రెడ్డి అప్పటికే కొంత నగదును నర్సయ్యకు అందజేయగా.. మిగతా మొత్తం రూ.43.50 లక్షల నగదును రిజిస్ట్రేషన్‌కు కొద్ది సమయం ముందు అప్పగించారు. ఈ మొత్తాన్ని నర్సయ్య తన కారులో పెట్టి డ్రైవర్‌ పరశురామ్‌కు జాగ్రత్తలు చెప్పి.. సంతకం పెట్టేందుకు సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వెళ్లారు.


రెండే రెండు నిమిషాల్లో..

డ్రైవర్‌ పరశురాం తన సీట్లో కూర్చుని ఉండగా ఇద్దరు ఆగంతుకులు బైక్‌పై వచ్చారు. కారు డోర్లు దించాలని పరశురామ్‌కు సైగ చేశారు. అతను అడ్డంగా తలూపుతూ వారి తీరును అనుమానించాడు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో కారును స్టార్ట్‌ చేసి, ముందుకు పోనిచ్చాడు. అంతే.. ఇద్దరు ఆగంతుకుల్లో ఒకడు తుపాకీతో డ్రైవర్‌ వైపున్న కారు విండోను పగులగొట్టాడు. డబ్బున్న బ్యాగును తీసుకునేందుకు యత్నించగా.. పరశురామ్‌ అడ్డుకున్నాడు. దాంతో.. డ్రైవర్‌ తొడపై దుండగుడు తుపాకీతో కాల్చాడు. మరో దుండగుడు వెనకవైపు డోర్‌ నుంచి డబ్బు సంచీని తీసుకున్నాడు. ఇద్దరు ఆగంతుకులు డబ్బు సంచీతో బైక్‌పై పారిపోయారు. డ్రైవర్‌ పరశురామ్‌ బుల్లెట్‌ గాయంతోనే సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి పరుగెత్తి.. తన యజమాని నర్సయ్యకు విషయం చెప్పాడు.


అన్నీ అనుమానాలే..!

ఈ ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు చేతులు మారుతుందని తెలిసిన వ్యక్తులే ఈ చర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అమ్మిన వ్యక్తి నర్సయ్య తనకెవరూ శత్రువులు లేరని.. ప్లాటు కొన్న వ్యక్తి శ్రీధర్‌రెడ్డిపైనే అనుమానం ఉందని చెప్పారు.


శ్రీధర్‌రెడ్డి మాత్రం తనకేం సంబంధం లేదని కొట్టిపారేస్తున్నట్లు తెలిసింది. డాక్యుమెంట్‌ రైటర్లు, ఇతర సిబ్బంది, మధ్యవర్తుల పాత్రపైనా పోలీసులు దృష్టి సారించారు. సిద్దిపేట సీపీ శ్వేత రంగంలోకి దిగి, ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక ఆధారాలతో దుండగులను పట్టుకునేలా ఓ బృందాన్ని నియమించారు. క్లూస్‌ టీంతో కొన్ని ఆధారాలు సేకరించారు. 9 ఎంఎం పిస్టల్‌తోపాటు సంఘటన వద్ద పడిన బుల్లెట్‌(పరశురామ్‌ తొడలోంచి దూసుకుపోయి.. బయట పడ్డ తూటా), బుల్లెట్‌ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పరశురామ్‌ను సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘‘ఈ సంఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాం. దుండగులను పట్టుకోవడానికి 15 బృందాలను నియమించాం. 24 గంటల్లో దుండగులను పట్టుకుంటాం’’ అని సిద్దిపేట పోలీసు కమిషనర్‌ శ్వేత తెలిపారు.




ఆదాయపన్ను శాఖ ఆరా?

సిద్దిపేట కాల్పుల ఉదంతంపై ఆదాయపన్ను శాఖలోని సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌(సీఐయూ) అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం న్యూస్‌ చానళ్లలో ఈ బ్రేకింగ్‌ రాగానే.. వారు ఈ వార్తల అప్‌డేట్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకున్నట్లు సమాచారం. 2016 నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు(డీమానిటైజేషన్‌) తర్వాత.. నగదు లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించిన విషయం తెలిసిందే. రూ. 2 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరపడం నేరం. అందుకే.. రిజిస్ట్రేషన్ల సమయంలో డాక్యుమెంట్లలో భూములను అమ్మిన వారికి.. కొన్న వారు ఏ రూపంలో నగదును అందజేశారు? చెక్కు/డీడీల నంబర్లను కూడా పేర్కొనడాన్ని తప్పనిసరి చేశారు. ఈ నేపథ్యంలో రూ. 43.50 లక్షల నగదు లావాదేవీలపై ఐటీ అధికారులు కూడా ఇరువర్గాలకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి.


దోపిడీ జరిగిందిలా... 

ఉదయం 11:45: రిజిస్ట్రేషన్‌ కోసం నర్సయ్య తన డ్రైవర్‌ పరశురాంతో కలిసి డాక్యుమెంట్‌ రైటర్‌ 

శ్రీకాంత్‌ వద్దకు వచ్చారు

మధ్యాహ్నం 12:15: శ్రీధర్‌రెడ్డి ఇచ్చిన డబ్బును నర్సయ్య లెక్క పెట్టుకున్నారు

మధ్యాహ్నం 12:45: ఆ డబ్బు తీసుకుని డ్రైవర్‌ పరశురాంకు ఇచ్చారు. పరశురాం ఆ డబ్బుతో కారులోనే ఉన్నారు.

మధ్యాహ్నం 1:00: నర్సయ్య రిజిస్ట్రేషన్‌ కోసం సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి వెళ్లారు.

మధ్యాహ్నం 1:15: డ్రైవర్‌పై కాల్పులు జరిగాయి.

మధ్యాహ్నం 1:17: డబ్బుతో దుండగులు పరార్‌.

Updated Date - 2022-02-01T08:02:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising