డీఏవీ ప్రిన్సిపాల్ మాధవి అరెస్టు
ABN, First Publish Date - 2022-10-20T09:29:10+05:30
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ స్కూల్‌లో ఎల్‌కేజీ బాలికపై అత్యాచారం కేసులో..
రిమాండ్‌కు నిందితుడు రజనీకుమార్
స్కూల్ గుర్తింపు రద్దు చేయాలంటూ ఏబీవీపీ ధర్నా
యాజమాన్యంపై కేసు పెట్టాలి: తల్లిదండ్రులు
బంజారాహిల్స్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని డీఏవీ స్కూల్‌లో ఎల్‌కేజీ బాలికపై అత్యాచారం కేసులో.. పోలీసులు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ మాధవిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ వెల్లడించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు. ‘‘బాధిత బాలికను ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఆ బాలికను పాఠశాలలోని డిజిటల్ రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను, సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించాం. ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజనీకాంత్ డీఏవీ స్కూల్‌లో స్వేచ్ఛగా తిరిగేవాడు. ఈ విషయంలో ప్రిన్సిపాల్ మాధవి నిర్లక్ష్యం ఉంది. అందువల్లే ఈ ఘటన జరిగింది. మాధవిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, అరెస్టు చేశాం’’ అని ఏసీపీ సుదర్శన్ వివరించారు. కాగా, బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఘటన ఎప్పుడు జరిగిందన్నదానిపై స్పష్టత వస్తే.. మరికొన్ని ఆధారాలు సేకరించే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఘటనలో ఇతరుల పాత్రపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడు రజనీకుమార్ సెల్‌ఫోన్‌ను విశ్లేషిస్తున్నారు.
3గంటల పాటు ఆందోళన
రజనీకుమార్‌ను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి, పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ ఎదుట మూడుగంటల పాటు ఆందోళన చేపట్టారు. వీరికి ఏబీవీపీ, టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. పోలీసులకు, పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్ మాధవికి తెలిసే ఈ దారుణం జరుగుతున్నా.. చూసీ చూడనట్టు వ్యవహరించారని ఆరోపించారు. ఆ పాఠశాల అనుమతి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాలిక తండ్రి మాట్లాడుతూ దిశ కేసులో మాదిరిగా న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. ‘‘నా కుమార్తె భవిష్యత్‌ను తలచుకుంటే భయమేస్తోంది. స్కూల్‌లో కూడా పిల్లలకు భద్రత లేకుంటే.. వారిని ఎక్కడ చదివించాలి?’’ అని ప్రశ్నించారు. తమ పిల్లలను బడికి పంపాలంటే భయమేస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. బాలికల పట్ల రజనీకుమార్ ప్రవర్తనపై గతంలో అనేకమార్లు ఫిర్యాదు చేశామని, ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని విమర్శించారు.
Updated Date - 2022-10-20T09:29:10+05:30 IST