వరంగల్‌లో రైతుల తుఫాను సృష్టించాలి
ABN, First Publish Date - 2022-04-30T07:08:40+05:30
‘‘మే 6న వరంగల్ జిల్లాను కప్పేయాలి. రైతుల తుఫాను సృష్టించాలి. ఉప్పెనలా
- ఆత్మహత్య చేసుకున్న రైతుల
- కుటుంబాలతో రాహుల్ మాటామంతి!
- ఉప్పెనలా కేసీఆర్ సర్కారును కమ్మేయాలి
- రైతుకు న్యాయం జరగాలంటే
- రాహుల్‌గాంధీ సభకు కదిలిరావాలి
- మంత్రి జగదీశ్‌రెడ్డిది ఇసుక మాఫియా
- భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి
- మాకు జానారెడ్డి రింగు మాస్టర్: రేవంత్‌రెడ్డి
- మాలో విభేదాలు లేవు: జానారెడ్డి
- సాగర్‌లో కాంగ్రెస్ సమన్వయ భేటీ సక్సెస్
- హాజరుకాని కోమటిరెడ్డి బ్రదర్స్
నల్లగొండ, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘మే 6న వరంగల్ జిల్లాను కప్పేయాలి. రైతుల తుఫాను సృష్టించాలి. ఉప్పెనలా కేసీఆర్ ప్రభుత్వాన్ని కమ్మేయాలి. ఆ ఉప్పెనలో కేసీఆర్ పతనానికి నాంది పలకాలి’’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ హాజరయ్యే వరంగల్ సభకు 34,684 బూత్‌లలో ఉన్న 48వేల మంది ముఖ్య కార్యకర్తలు.. ప్రతీ ఒక్కరు కనీసం తొమ్మిది మంది చొప్పున తీసుకురావాలని సూచించారు. రైతు ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ సభకు ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్క రైతు అయినా రావాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా వరంగల్ సభకు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే కార్యాచరణను కాంగ్రెస్ తీసుకుందని చెప్పారు.
రాహుల్‌గాంధీ సభకు జనసమీకరణ కోసం శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు ఓ చరిత్ర ఉందని, ఇక్కడి ప్రజల రక్తంలో పోరాట పటిమ, తిరుగుబాటు చేసే శక్తి ఈ మట్టిలో ఉందన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఈ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నుంచి తొమ్మిది మంది గెలిచారని చెప్పారు. తొమ్మిది మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో సోయి, అవగాహన ఉన్నోళ్లు ఒక్కరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు.
దేశంలోనే అత్యధికంగా కాంగ్రెస్ సభ్యత్వాలను చేసిన చరిత్ర నల్లగొండ జిల్లాకు ఉందన్నారు. కాంగ్రెస్ పెద్దలు కట్టించిన నాగార్జునసాగర్ డ్యామ్‌పై నిలబడి తలెత్తుకొని ఇవాళ మాట్లాడుతున్నానన్నారు. నాటి ప్రధాని నెహ్రూ సాగర్ ప్రాజెక్టును ఆధునిక దేవాలయంగా భావించారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయిస్తున్న ఘనత కాంగ్రెస్ నేతలదేనని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్ మంత్రుల్లో ల్యాండ్ మాఫియాలు
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే నెల్లికల్లు ఎత్తిపోతల పూర్తిచేస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారని, నేటికీ పునాది రాయికూడా పడలేదని రేవంత్ రెడ్డివిమర్శించారు. భూ కబ్జాలు చేసే ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఇసుక మాఫియా చేసే మంత్రి జగదీశ్ రెడ్డి.. ఇట్లా చెప్పుకుంటూపోతే ఈ జిల్లాలో ఒక్కో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు ఒక్కో భాగోతం ఉందన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్ మాఫియాలను నడిపించేవాళ్లు టీఆర్‌ఎస్ మంత్రులుగా ఉన్నారని ఆరోపించారు.
సాగర్‌లో జానారెడ్డి ఓడిపోయినా పనిచేస్తాడన్న నమ్మకం ప్రజల్లో ఉందని, ఆయన ఓడిపోవడంతో చట్టసభలకే గౌరవం తగ్గిపోయిందని చెప్పారు. మమ్మల్ని పులులు, సింహాలు అంటున్నారు సంతోషం కానీ, సర్క్‌సలో పులులు, సింహాలను ఆడించడానికి ఒక రింగు మాస్టర్ ఉంటారని, ఇక్కడ ఆ రింగు మాస్టరే జానారెడ్డి అని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరించే నాయకులు కాంగ్రె్‌సలో ఉన్నారని, 40 ఏళ్లపాటు కాంగ్రె్‌సను భుజాన మోసిన దామోదర్‌రెడ్డి, సమస్యలపై మాట్లాడగలిగిన, చట్ట సభల్లో సమస్యలు లేవనెత్తగలిన, దేశం కోసం కొట్లాడిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి నల్లగొండ జిల్లా నుంచి ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ తన ఎనిమిదేళ్ల పాలనలో పోరాట సంస్కృతిని ధ్వంసం చేసి దోపిడీ సంస్కృతిని సృష్టించిందని ధ్వజమెత్తారు.
యాసంగిలో వరి వేయవద్దని సీఎం కేసీఆర్ చెప్పారని, ఆయన మాత్రం తన ఫామ్ హౌస్‌లోని 180 ఎకరాల్లో వరి సాగు చేశారని ఆరోపించారు. ఆ పంటలను చూపించేందుకు తాను అక్కడి వెళతానంటే వందలాది మంది పోలీసులను పెట్టించి తనను నిర్బంధించారన్నారు. ఫామ్ హౌస్‌లో ఎవరైతే వరి కొంటారో వారే రైతుల ధాన్యం కొనాలని, లేదంటే అమరుల స్థూపం సాక్షిగా కేసీఆర్‌ను ఉరి తీస్తామని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, మిల్లర్లకు ఇవ్వాల్సిన బోనస్ ఖరారు కాకపోవడంతో ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని చెప్పారు. అకాల వర్షాలతో సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ
‘‘ఢిల్లీలో మోదీ, గల్లీలో కేడీ.. మోదీ మనుషులు ఇందిరాపార్కు దగ్గర, ఇక్కడ ఉన్న కేడీ ఢిల్లీలో ధర్నా చేస్తడు. ఒకరేమో ప్రధాని, మరొకరేమో ముఖ్యమంత్రి. ఎవరి మీద ఎవరు ధర్నా చేస్తున్నట్లు. ధాన్యాన్ని ఎవరు కొనాలి? దుబాయ్ నుంచి వచ్చి దావూద్ ఇబ్రహీం కొనాలా? ఒక వేళ దావూద్ కొనేదే ఉంటే ఆయన ప్రధానమంత్రి ఎందుకు?, ఈయన ముఖ్యమంత్రి ఎందుకు? మోదీ, కేసీఆర్ ఇద్దరూ తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను దెబ్బతీస్తున్నారు’’ అని రేవంత్ మండిపడ్డారు.
పునర్ వైభవానికి వరంగల్ సభ తొలిమెట్టు
వరంగల్ సభ కాంగ్రెస్ పునర్‌వైభవానికి తొలిమెట్టు కావాలని, తమలో విభేదాలు లేవని నల్లగొండ సమావేశం నిరూపించిందని సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రె్‌సలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ, ఐక్యతకు లోటు లేదని చెప్పారు. పోరాటంలో భిన్నాభిప్రాయాలున్నా భారతదేశం స్వాతంత్ర సాధించిందని, అదే పద్ధతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచడంలో నల్లగొండ జిల్లా అగ్రభాగాన నిలుస్తుందని ఆయన చెప్పారు.
ఒకేసారి లక్ష రుణమాఫీపై రాహుల్ ప్రకటన
దరిద్రపు టీఆర్‌ఎస్ పాలనలో గత నాలుగేళ్లలో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులకు మేలు జరగలేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఒకేసారి లక్ష రుణమాఫీ చేస్తామని, ఇదే అంశాన్ని వరంగల్ సభలో రాహుల్ ప్రకటిస్తారని చెప్పారు. తామంతా ఐక్యంగా ఉంటూ రాహుల్ సభను విజయవంతం చేస్తామని చెప్పారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని, సంచలనాల కోసం సోషల్ మీడియాలో లేనిపోని వార్తలు సృష్టిస్తున్నారని, వాటిని నమ్మవద్దని అన్నారు.
రేవంత్ నిర్ణయం భేష్: దామోదర్‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దళిత, నిరుద్యోగ గర్జన చేపట్టారని, ఇప్పుడు రైతుల సమస్యలపై రైతు గర్జన చేపట్టి రాహుల్‌గాంధీని ఆహ్వానించడం సరైన నిర్ణయమని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కొనియాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి వరంగల్ సభకు లక్ష మందిని తరలిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ పాల్గొన్నారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా అంతా హాజరు
నాగార్జునసాగర్‌లో రేవంత్‌రెడ్డి సమావేశం ప్రశాంతంగా ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఏడాది తర్వాత తొలిసారి రేవంత్‌రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించారు. రాహుల్ సభకు జనసమీకరణ కోసం నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన రావల్సిన అవసరం లేదంటూ స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ ప్రకటన చేయగా, రేవంత్‌కు వ్యతిరేకంగా జిల్లాకు చెందిన నేతలు ఢిల్లీలో ఫిర్యాదులు చేశారు. సీనియర్ నేత జానారెడ్డి సమన్వయంతో సమావేశం జరగ్గా కోమటిరెడ్డి బ్రదర్స్ మినహా ముఖ్య నేతలంతా హాజరయ్యారు. సమావేశానికి రానని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పర్యటన ఉందని వెంకట్‌రెడ్డి ముందే చెప్పగా, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా హాజరుకాలేదు. వర్గపోరు, ఉత్కంఠకు తెరదించుతూ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్, దామోదర్‌రెడ్డి వంటి కాంగ్రెస్ దిగ్గజాలు సమావేశానికి హాజరయ్యారు.
Updated Date - 2022-04-30T07:08:40+05:30 IST