ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నకిలీ విత్తనాల కేసులు బుట్టదాఖలు!

ABN, First Publish Date - 2022-03-05T07:00:38+05:30

అసలే విత్తన సంస్థలు నకిలీ విత్తనాలు అంటగడుతూ రైతులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతులను నిలువుదోపిడీ చేసిన విత్తన సంస్థలు..
  • సోయాబీన్‌, వేరుశనగ విత్తనాలుకొని నష్టపోయిన అన్నదాత
  • విజిలెన్స్‌, సీబీఐ నివేదికలు తొక్కిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, మార్చి 4(ఆంధ్రజ్యోతి): అసలే విత్తన సంస్థలు నకిలీ విత్తనాలు అంటగడుతూ రైతులను నిండా ముంచేస్తున్నాయి.. ఆపై ఆ సంస్థలపై ఉన్న కేసులను బుట్టదాఖలు చేస్తూ అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం మరింత కుంగదీస్తోంది. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందకుండాపోతోంది. రైతులకు నకిలీ సోయాబీన్‌, వేరుశనగ విత్తనాలు పంపిణీచేసి వారిని నిండా ముంచిన విత్తన కంపెనీలు, వాటిని సరఫరా చేసిన తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ, బోగస్‌ సర్టిఫికెట్లు జారీచేసిన విత్తన ధ్రువీకరణ అథారిటీలపై నమోదైన విజిలెన్స్‌, సీబీఐ కేసులు బుట్టదాఖలయ్యాయి. అక్రమార్కుల ఒత్తిడితో సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే కేసులు తొక్కిపెట్టడం వివాదాస్పదంగా మారింది. కేసులు కొలిక్కివస్తే అంతో ఇంతో నష్టపరిహారం వస్తుందని ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించటంలేదు.


ఆచార్య జయశంకర్‌ యూనివర్సిటీలో కొనుగోలుచేసిన వరి విత్తనాలను బ్యాగింగ్‌ చేసి, లేబుల్‌ మార్చేసి... హైబ్రీడ్‌ పేరుతో విత్తన కంపెనీలు చేస్తున్న దోపిడీ పర్వాన్ని ’ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి  తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, గతంలో నమోదైన సోయాబీన్‌, వేరుశనగ నకిలీ విత్తన కేసుల అంశం ప్రస్తుతం తెరపైకి వచ్చింది. 


పరిహారం కోసం సోయా రైతుల ఎదురుచూపు 

తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, మార్క్‌ఫెడ్‌, హాకా, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ వద్ద 2020 వానాకాలం సీజన్‌లో సోయా బీన్‌ విత్తనాలు కొనుగోలుచేసిన రైతులు నిండా మునిగారు. ఈ నాలుగు ప్రభుత్వ ఏజెన్సీలు కలిసి... మూడు ప్రైవేటు విత్తన కంపెనీల(వీకేర్‌ అగ్రిటెక్‌, అక్షయ్‌ అగ్రిటెక్‌, జేఎ్‌స-35)తో విత్తన సరఫరాకు అగ్రిమెంటు చేసుకున్నాయి. ఈ ప్రైవేటు విత్తన కంపెనీలు కేవలం 10 శాతం నుండి 20 శాతం జర్మినేషన్‌ స్థాయి ఉన్న 75 వేల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వ ఏజెన్సీలకు, తద్వారా రైతులకు సరఫరా చేశాయి. వాస్తవానికి ఈ ప్రైవేటు విత్తన కంపెనీల పరిధిలో సీడ్‌ ప్రొడక్షన్‌(విత్తనోత్పత్తి ఏరియా) లేదు.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, నంద్యాల, కర్నూలు.. ప్రాంతాల్లో విత్తనోత్పత్తి చేసినట్లుగా బోగస్‌ రిజిస్ట్రేషన్‌ చేయించాయి. ఒకవేళ సాగువిస్తీర్ణం లేకపోయినా... ఆ ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉంటే సర్టిఫికేషన్‌ చేయించుకునే వెసులుబాటు ఉంది. కానీ, ఏపీలో ప్రకాశం, నంద్యాల, కర్నూలు ప్రాంతాల్లో ప్రాసెసింగ్‌ యూనిట్లు లేవు. గుంటూరు జిల్లా కేంద్రంలోని ఓ సీడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీలో విత్తన పరీక్షలు నిర్వహించినట్లు, జర్మినేషన్‌ శాతం ఎక్కువున్నట్లు ఆ ప్రైవేటు విత్తన సంస్థలు దొంగ సర్టిఫికెట్లు తెప్పించాయి. జర్మినేషన్‌ లేని సోయా విత్తనాలను ఇండోర్‌, ఔరంగాబాద్‌, భోపాల్‌ లోకల్‌ మార్కెట్లలో కొనుగోలుచేసి తెలంగాణకు తీసుకొచ్చారు.


తెలంగాణ స్టేట్‌ సీడ్‌ అండ్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ(టీఎ్‌స-ఎ్‌సవోసీఏ)తో ఉన్న అంతర్గత ఒప్పందం, అధికారుల అండదండలతో... నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలకు(టీఎ్‌స-సీడ్‌ కార్పొరేషన్‌, మార్క్‌ఫెడ్‌, హాకా, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌) నకిలీ విత్తనాలను అంటగట్టారు. నామమాత్రంగా టెండర్లు నిర్వహించి మూడు ప్రైవేటు కంపెనీల నుంచి అధికారులు గుడ్‌విల్‌ తీసుకుని విత్తనాల సేకరణ బాధ్యతలు అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అవే విత్తనాలను నిర్మల్‌, నిజామాబాద్‌, కామారెడ్డి, అదిలాబాద్‌, వరంగల్‌ సహా... సోయాబీన్‌ సాగుచేసే జిల్లాల రైతులకు అంటగట్టారు. అధికారిక లెక్కల ప్రకారం లక్ష ఎకరాల్లో సోయాబీన్‌ విత్తనాలు మొలకెత్తలేదు. కానీ, నిజానికి రెండున్నర లక్షల ఎకరాల్లో సోయాబీన్‌ రైతులు నష్టపోయారు. ఈ మోసంపై రైతులు ఫిర్యాదుచేయటంతో... విచారణ బాధ్యతలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి అప్పగించారు.


సోయా విత్తనాలు నకిలీవేనని, ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికేషన్‌ తీసుకున్నారని, మహారాష్ట్ర-మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల లోకల్‌ మార్కెట్లో కొనుగోలుచేసి తెచ్చారని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సమగ్ర నివేదిక ఇచ్చారు. జర్మినేషన్‌ 10 శాతం కూడా లేదని చెప్పారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలతోపాటు... విత్తన సేకరణ, టెండర్ల నిర్వహణ, విత్తన సరఫరాలో ప్రమేయమున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఆ నివేదిక పెండింగ్‌లో ఉంది. సుమారు రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. 




రాష్ట్రంలో 450 ప్లాంట్లు.. 

తనిఖీలు శూన్యం


రాష్ట్రవ్యాప్తంగా 450 సీడ్‌ ప్రాసెసింగ్‌ ప్లాంట్లు(యూనిట్లు) ఉన్నాయి. వాటి పరిధిలో ప్రొడక్షన్‌ ఏరియా ఉండటంలేదు. శాంపిళ్ల సేకరణ అసలుకే ఉండటంలేదు. విత్తనోత్పత్తి జరగకపోయినా సీడ్‌ సర్టిఫికేషన్‌ మాత్రం జరుగుతోంది. బయటి మార్కెట్లో కొనుగోలుచేసిన విత్తనాలకే తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ సర్టిఫికేషన్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. మరోవైపు, 2020లో అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి... తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్‌కు రాసిన లేఖను కూడా బుట్టదాఖలైంది. విజిలెన్స్‌ నివేదిక అధారంగా కఠినచర్యలు తీసుకుని ఏటీఆర్‌(యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు)ను జీఏడీ(జనరల్‌ అడ్మినిస్ట్రేషన్‌)కు పంపించాలని ఏపీసీ ఆదేశించినా అది కార్యరూపం దాల్చలేదు.


వేరుశనగ నకిలీ విత్తనాల కేసూ అంతే..


జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట్‌, వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో నకిలీ వేరుశనగ విత్తనాలతో  రైతులు నష్టపోయారు. సర్టిఫైడ్‌ విత్తనాలు సరఫరాచేస్తామని తెలంగాణ సీడ్‌ కార్పొరేషన్‌తో అగ్రిమెంటు చేసుకున్న కంపెనీలు... జర్మినేషన్‌ లేని వేరుశనగ విత్తనాలు సరఫరా చేశాయి. వాటినే రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీచేసింది. తీరా అవి మొలకెత్తలేదు. దీంతో నకిలీల బాగోతం బయటపడింది. నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో విత్తనాల సేకరణ జరిగింది. విత్తనోత్పత్తి విస్తీర్ణం లేకపోయినా ఉన్నట్లు విత్తన సంస్థలు చెప్పుకున్నాయి.


తెలంగాణ స్టేట్‌ సీడ్‌ అండ్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ సర్టిఫికేషన్‌ ఇచ్చింది. ప్రొడక్షన్‌ ఏరియా లేకపోయినా విత్తన ధ్రువీకరణ సంస్థ ఎలా సర్టిఫికెట్‌ ఇస్తుందని, నకిలీ విత్తనాలు ఎలా సరఫరాచేస్తారని, ఫిర్యాదులు రావడంతో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్‌ ప్రమేయం ఉండటంతోనే సీబీఐ రంగంలోకి దిగి సకాలంలో విచారణ పూర్తిచేసి, నివేదిక ఇచ్చింది. మూడేళ్లు గడిచినా అక్రమార్కులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


Updated Date - 2022-03-05T07:00:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising