ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పత్తి ధర దూది పింజ

ABN, First Publish Date - 2022-12-16T03:23:47+05:30

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కుండపోత వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తికి ఆశించిన ధర రావడం లేదు. నిన్నటిదాక క్వింటా రూ.10 వేలకు చేరువలో ఉండగా ఇప్పుడు రూ.7,500-రూ.8 వేలకు పడిపోవడంతో రైతులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది గరిష్ఠంగా క్వింటా రూ.14 వేలు.. ఈసారి సీజన్‌ ప్రారంభంలో 9,600

ధరల వ్యత్యాసం నెలలవారీగా

గరిష్ఠం-కనిష్ఠం (క్వింట్లాల్లో)

సెప్టెంబరు రూ.9,600-7,200

అక్టోబరు రూ.8,300-6,000

నవంబరు రూ.9,000-7,500

డిసెంబరు రూ.8,000-7,500

రేటు పతనంతో.. రైతుల్లో కలవరం!..

ఇప్పుడు రూ.7,500-రూ.8 వేలు మాత్రమే

అంతర్జాతీయంగా డిమాండ్‌ లేకనే:ట్రేడర్లు

హైదరాబాద్‌, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): కుండపోత వానలు, చీడపీడల బెడదను తట్టుకుని పండిన పత్తికి ఆశించిన ధర రావడం లేదు. నిన్నటిదాక క్వింటా రూ.10 వేలకు చేరువలో ఉండగా ఇప్పుడు రూ.7,500-రూ.8 వేలకు పడిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరుసగా మూడేళ్లు పంట దెబ్బతిన్నప్పటికీ.. నిరుటి నుంచి రాష్ట్రంలో పత్తి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు రూ.6,380 ఉండగా, గతేడాది రికార్డు స్థాయిలో రూ.14 వేల దాకా వెళ్లింది. అంతోఇంతో దిగుబడి వచ్చినవారికీ గిట్టుబాటైంది. ఇక ఈ సీజన్‌ ప్రారంభంలో గరిష్ఠంగా క్వింటా రూ.9,600 పలికింది. నిరుటికి నాలుగైదు వేలు తగ్గినా రూ.10 వేలకు చేరువగా ఉన్నదని రైతులు సంతృప్తి చెందారు. ముందుగా విత్తనాలు వేసి, మొదటి కాత కోసిన రైతులకు రూ.9 వేల పైగా ధర దక్కింది. అయితే, మార్కెట్‌కు పంట తీసుకురావడం పెరగగానే.. ధరలు తగ్గుతున్నాయి. మళ్లీ ఎమ్మెస్పీకి పడిపోతే గిట్టుబాటు కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తగ్గిన బేళ్లు, దారం, గింజల ధరలు

పత్తి బేల్‌ రేటు రూ.1.14 లక్షల నుంచి రూ.65 వేలకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ తక్కువగా ఉంది. దీంతో బేళ్ల కదలిక లేదు. దేశవ్యాప్తంగా 30 శాతం స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడి, దారం (యార్న్‌) కూడా అమ్ముడుపోవడం లేదు. దారం ధర సగటున కిలోకు రూ.200 తగ్గింది. ఒకప్పుడు బేళ్లను గోదాముల్లో నిల్వ చేసేవారు. ఈసారి దారం నిల్వ చేసే పరిస్థితులు నెలకొన్నాయి. పత్తి బేళ్లు, దారంతో పాటు గింజల ధరలు కూడా తగ్గిపోయాయి. సీజన్‌ ప్రారంభంలో గింజలు టన్నుకు రూ.38 వేల నుంచి రూ.40 వేలు ఉండగా ఇప్పుడు రూ.33 వేలకు పడిపోయింది. తమిళనాడు లాంటి అంతర్రాష్ట్ర మార్కెట్లతో పాటు చైనా, వియత్నాం, బ్రెజిల్‌, బంగ్లాదేశ్‌, ఇతర ఆఫ్రికా, యూరప్‌ దేశాల్లో కూడా డిమాండ్‌ లేదని, అందుకే ధరలు పతనమవుతున్నాయని జిన్నింగ్‌ మిల్లర్లు, ట్రేడర్లు చెబుతున్నారు.

11 శాతం సుంకం.. నిలిచిన దిగుమతులు

కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం విధిస్తోంది. దీంతో ఒక్కో క్యాండీకి రూ.7-8 వేలు భారం పడి దారం దిగుమతులు దాదాపు నిలిచిపోయాయి. సుంకం చెల్లించటం ఎందుకని.. ట్రేడర్లు స్థానికంగా ఉన్న బేళ్లు, దారాన్నే కొంటున్నారు. గార్మెంట్ల తయారీకి స్వదేశీ పత్తినే వినియోగిస్తున్నారు. మరోవైపు గార్మెంట్స్‌ ఎగుమతులు కూడా లేవు. భారత్‌కు ప్రధాన మార్కెట్‌ అయిన బంగ్లాదేశ్‌ దగ్గర యూరప్‌ దేశాలు కొనడం లేదు. తక్కువ ధరకు ఇస్తున్న ఆస్ట్రేలియా, బ్రెజిల్‌ వైపు చూస్తున్నాయని జిన్నింగ్‌ మిల్లర్లు చెబుతున్నారు. వియత్నాం, చైనా వాళ్లు కొనుక్కొచ్చిన బేళ్లు మొన్నటిదాకా యూర్‌పలో అమ్ముడుపోయాయి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు.

పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

రాష్ట్రంలో కనీసం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు లక్ష్యంగా అధికారులు రైతులపై ఒత్తిడి చేశారు. కానీ 50 లక్షల ఎకరాలు దాటలేదు. రెండేళ్లు వానలు, వరదలతో పంట దెబ్బతినడంతో రైతులు కూడా మొగ్గుచూపలేదు. మరోవైపు భారీ వర్షాల తాకిడికి పత్తి ఆరంభంలోనే దెబ్బతింది. కొందరు రైతులు రెండు, మూడుసార్లు నాటాల్సి వచ్చింది. వరదతో చేలు జాలు పట్టి చీడ పీడల బెడద ఎక్కువైంది. దీంతో దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదు. పంట మంచిగా ఉంటే.. ఎకరానికి 14 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సగటున 10 క్వింటాళ్లయినా రావాలి. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని నిలబడిన చేలల్లో 7 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. మిగతా రైతులకు 5 క్వింటాళ్లకు మిండడం లేదు. మరోవైపు పెట్టుబడి విపరీతంగా పెరిగి ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.50 వేలు అవుతోంది. రాష్ట్రంలో 1.30 కోట్ల బేళ్ల జిన్నింగ్‌ సామర్థ్యం ఉంటే.. 40 లక్షల బేళ్ల పత్తి మాత్రమే ఉత్పత్తవుతోంది.

Updated Date - 2022-12-16T03:23:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising