కరోనా కలకలం
ABN, First Publish Date - 2022-01-13T05:50:41+05:30
కరోనా కలకలం
భూపాలపల్లి కలెక్టరేట్, జనవరి 12: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కాస్త తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. వారం రోజుల్లో జిల్లాలో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం కలవర పెడుతోంది. ఒక్క సింగరేణిలోనే 18 మంది కరోనా బారిన పడ్డారు. జిల్లాలో కరోనా కేసులు దాదాపు ఆరు నెలలుగా అంతంత మాత్రంగానే కేసులు నమోదయ్యాయి. ఒమైక్రాన్ వ్యాప్తి చెందుతోందనే వార్తలు జిల్లా ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లో కేసుల తీవ్రత ఇలా ఉంటే రానున్న రోజుల్లో పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లో నమోదైన కేసుల్లో సగానికి పైగా సింగరేణిలోనే వెలుగు చూడటం కార్మిక లోకాన్ని కలవరపెడుతోంది. సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 18 మంది కరోనా బారిన పడ్డారు. ఈ సంస్థలో పనిచేసే కార్మికులు భూపాలపల్లి మునిసిపల్ పరిధిలోనే నివసిస్తుండటంతో పట్టణంలో కరోనా సామాజిక వ్యాప్తి జరిగిందనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన వాటిలో ఒమైక్రాన్ కేసులు లేకపోవడం కాస్త ఊరటకలిగిస్తోంది.
సరిహద్దులో జాగ్రత్తలేవీ..?!
జిల్లాను ఆనుకునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. నిత్యం వేలాది కేసులు అక్కడ నమోదవుతున్నాయి. భూపాలపల్లి సరిహద్దులో ఈ రాష్ట్రం ఉండటం జిల్లా వాసులను భయాందోళన కలిగిస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదని తెలుస్తోంది. మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న కాళేశ్వరం, మేడిగడ్డ వద్ద అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాళేశ్వరం ఆలయంతోపాటు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలను సందర్శించేందుకు నిత్యం వందలాదిగా మహారాష్ట్ర నుంచి భూపాలపల్లి జిల్లాకు వస్తుంటారు. సరిహద్దులో అలాంటి వారికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా వారికి కూడా ఎలాంటి పరీక్షలు నిర్వహించడం లేదు.
Updated Date - 2022-01-13T05:50:41+05:30 IST