హైదరాబాద్‌లో 4 రోజులు వణుకుడే
ABN, First Publish Date - 2022-12-21T04:13:23+05:30
రాష్ట్రంలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. రాత్రిపూట సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
యెల్లో అలెర్ట్ జారీ చేసిన వాతావరణశాఖ
మరింతగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : రాష్ట్రంలో మూడు రోజుల నుంచి చలి తీవ్రత మళ్లీ పెరిగింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. రాత్రిపూట సాధారణం కన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గాలిలో తేమ సాధారణం కన్నా ఎక్కువగా ఉంటోంది. పలు జిల్లాల్లో చలికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలితో వణుకుతున్న హైదరాబాద్‌కు వాతావరణ శాఖ యెల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన నగరంలో మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి 11 నుంచి 15 డిగ్రీల మధ్యలో నమోదవుతుందని తెలిపింది. మరోవైపు ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు దుప్పటి పరుచుకుంటోంది. రాష్ట్రంలోనే అత్యల్పంగా మంగళవారం తెల్లవారుజామున ఆసిఫాబాద్ జిల్లా సిర్పూరు(యూ) మండలంలో 9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా జన్నారంలో 9.4, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 9.6, ఆదిలాబాద్ జిల్లా బేలలో 9.7, మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వాయర్ వద్ద 9.7, ఆదిలాబాద్ బజార్‌హత్నూరులో 9.9 డిగ్రీలకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలో 10.2, తిర్యాణిలో 10.3, వాంకిడిలో 10.8, సిద్దిపేట జిల్లా అంగడికిష్టాపూర్‌లో 11.6, కాగజ్‌నగర్‌లో 12.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో ఏజెన్సీ గ్రామాల్లో గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో, గ్రామ కూడళ్లలో నెగళ్లు వేసుకొని చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు.
Updated Date - 2022-12-21T10:50:21+05:30 IST