ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం కుట్ర

ABN, First Publish Date - 2022-02-08T07:24:21+05:30

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దాని జోలికొస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది.. కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
  • ప్రైవేటుపరం చేస్తే నష్టాలే.. గనులివ్వకుండా ‘వైజాగ్‌ స్టీల్‌’ను నిర్వీర్యం చేశారు 
  • సింగరేణిపైనా అలాంటి కుట్రలే.. సంస్థకు బొగ్గు గనులు నేరుగా కేటాయించాలి
  • గుజరాత్‌కు గనులిస్తారు కానీ తెలంగాణకు ఇవ్వరా?.. దేశంలో భాగం కాదా?
  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి మంత్రి కేటీఆర్‌ లేఖ

   

హైదరాబాద్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. గతంలో నల్ల చట్టాలతో రైతులను నట్టేట ముంచే కుట్ర చేసిన కేంద్ర ప్రభత్వం.. తాజాగా నల్ల బంగారంపై కన్నేసి సింగరేణిని దెబ్బతీసే కుతంత్రం చేస్తోందన్నారు. ‘‘సింగరేణి నల్లబంగారం యావత్‌ తెలంగాణకే కొంగుబంగారం. దీన్ని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయం. సింగరేణిపై ప్రైవేటు వేటు వేస్తే.. బీజేపీపై రాజకీయంగా వేటు వేసేందుకు తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. సిరులు కురిపించే సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకడం ఖాయం’’ అంటూ హెచ్చరించారు.


లాభాల బాటలో నడుస్తున్న సింగరేణికి అవసరమైన బొగ్గు గనులు కేటాయించి బలోపేతం చేయాల్సింది పోయి.. గనుల వేలంలో పాల్గొనాలని కేంద్రం నిర్ణయించడం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని పేర్కొన్నారు. సింగరేణికి బొగ్గు గనులను నేరుగా కేటాయించాలంటూ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీకి సోమవారం మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. సింగరేణి కాపాడుకునేందుకు.. సింగరేణి బిడ్డలు.. కార్మికులకు తాము అండగా ఉంటామని, వారితో కలిసి ఉద్యమ కార్యాచరణ చేపడతామని స్పష్టం చేశారు. సింగరేణి పరిధిలోని జేబీఆర్‌ఓసీ-3, కేకే-6, శ్రవనపల్లి ఓపెన్‌ కాస్ట్‌, కోయ గూడెం గనులను సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వేలంలో పాల్గొనాలంటూ నిర్దేశించడమేంటని ప్రశ్నించారు.


తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో 450 లక్షల టన్నుల ఉత్పత్తి నుంచి 670 లక్షల టన్నుల వరకు బొగ్గు ఉత్పత్తి జరిగిందని వివరించారు. దీంతోపాటు బొగ్గు తవ్వకాలు, రవాణా, లాభాలు, కంపెనీ విస్తరణ విషయంలోనూ సింగరేణి గణనీయమైన ప్రగతిని సాధిస్తూ వస్తున్నదన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం దేశంలోనే అత్యుత్తమ పీఎల్‌ఎ్‌ఫను కలిగి ఉందని పేర్కొన్నారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు భారీ ఎత్తున సింగరేణి బొగ్గు సరఫరా అవుతోందని ఆయన పేర్కొన్నారు. 


లాభాల సింగరేణిని బలహీనపరుస్తారా?

 దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థ ఇవ్వని విధంగా లాభాల్లో 29ు వాటాను ఇస్తున్న ఏకైక సంస్థ సింగరేణి అని తెలిపారు. కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలనూ చేపట్టిందన్నారు. ఇంతకాలం ‘కార్మికులకు లాభాల్లో వాటాలు’ అనేది పత్రికల్లో పతాక శీర్షికలు అయ్యాయని, సంస్థను ప్రైవేటుపరం చేస్తే ఆ తర్వాత నష్టాల మూటలు అనేవి ప్రధాన శీర్షికలు అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.


లాభాల బాట లో ఉన్న సింగరేణిని బలహీనపరిచి, నష్టపూరిత పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా మార్చి.. అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుట్రకు బీజేపీ ప్రభుత్వం తెరతీస్తోందన్నారు. ఏపీలోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కూ ఐరన్‌ఓర్‌ గనులను ఇవ్వకుండా నష్టా ల పాలు చేసిన కేంద్ర ప్రభుత్వం..దాన్ని ప్రైవేటీకరించేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు. ఇలాంటి కుట్రలనే సింగరేణిపైనా అమలు పరిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నదని, అందులో భాగంగానే సింగరేణికి బొగ్గు గనులు లేకుండా చేసి సంస్థను చంపే కుట్రకు తెరలేపిందన్నారు. 




గుజరాత్‌కో విధానం.. తెలంగాణకో విధానమా?

గుజరాత్‌లో మాత్రం.. గుజరాత్‌ మినరల్‌ డెవల్‌పమెంట్‌ సంస్థకు అడిగిన వెంటనే లిగ్నైట్‌ గనులను నేరుగా కేటాయించారని, అదే విధంగా తెలంగాణలోని సింగరేణికీ నేరుగా బొగ్గు గనులు ఎందుకు ఇవ్వరని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.‘‘బీజేపీ పాలనలో గుజరాత్‌కో విధానం, తెలంగాణకొక విధానం ఉందా? తెలంగాణ దేశంలోని ఒక రాష్ట్రం కాదా?’’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఇది కేవలం సింగరేణి సంస్థపై మాత్రమే వివక్ష కాదని, తెలంగాణ రాష్ట్రంపై వివక్ష అని అన్నారు. కేంద్రం కుట్రలను అపకుంటే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు హుళక్కే!


తెలంగాణ ఏర్పడిన తర్వాత సింగరేణి  16 వేల నూతన ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిందన్నారు. కేంద్రం లేవనెత్తిన ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ.. దళితులు, బహుజనులపై చేస్తున్న దండయాత్ర అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఉద్యోగ ఉపాధి కల్పనకు కేరాఫ్‌ అడ్ర్‌సగా ఉన్న సింగరేణిని ప్రైవేటుపరం చేయడం అంటే.. అంబేడ్కర్‌ ఆశయాలకు తూట్లు పొడవడమేనన్నారు. రిజర్వేషన్లకు పాతరేసే కుతంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనివ్వబోమన్నారు.


సింగరేణిని ప్రైవేటీకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరికే అవకాశమే ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ దృష్టిలో కేంద్రం సింగరేణిలోని కేవలం నాలుగు బ్లాకులను మాత్రమే వేలం వేయడం లేదని, వేలాది మంది కార్మికుల భవిష్యత్తును బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తోందన్నారు. ఈ వేలంవెర్రి  ఆలోచనలు ఇప్పటికైనా మానుకోవాలని, లేనిపక్షంలో సింగరేణి కార్మికులు మరోసారి ఉక్కు పిడికిళ్లు బిగించి కేంద్రంలోని బీజేపీని వెంటపడి తరమడం ఖాయమని ఆయన హెచ్చరించారు. 


Updated Date - 2022-02-08T07:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising